గురువారం 04 జూన్ 2020
Sangareddy - Mar 19, 2020 , 00:14:38

అక్రమాలపై ఉక్కుపాదం

అక్రమాలపై ఉక్కుపాదం

  • బాధ్యత మరిస్తే బదిలీ వేటు..
  • సస్పెన్షన్లు, బదిలీలు, షోకాజ్‌ నోటీసులు, కఠిన చర్యలు
  • అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్‌ సీరియస్‌
  • అవినీతి, అక్రమాలపై ఆగ్రహం
  • అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు
  • సర్పంచ్‌కూ తప్పని షోకాజ్‌ నోటీసులు
  • వరుస పరిణామాలతో అధికార యంత్రాంగంలో చర్చ
  • ఇదే తీరు కొనసాగుతుందని హెచ్చరిస్తున్న కలెక్టర్‌ హనుమంతరావు

బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండే అధికారి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెద్ద నష్టం చవిచూడాల్సి వస్తుంది. ఇలాంటి వాటికి చమరగీతం పాడాలనే సదుద్దేశంతో కలెక్టర్‌ హనుమంతరావు విధుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై కన్నెర్ర చేస్తున్నారు. బాధ్యత మరుస్తున్న వారిపై బదిలీ వేటు వేస్తున్నారు. అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రోజువారీగా జిల్లాలో పర్యటిస్తూ తన దృష్టికి వస్తున్న అక్రమాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అక్కడికక్కడే అధికారులు, సిబ్బందిని సస్పెన్షన్‌ చేయడంతో పాటు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని సిబ్బందిని నిలదీస్తూ బదిలీలు చేస్తున్నారు. కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలతో అధికార యంత్రాంగంలో చర్చ కొనసాగుతున్నది. అప్రమత్తమవుతున్న ఇతర సిబ్బంది బాగా పనిచేస్తుండడంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. కలెక్టర్‌ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతోనే జిల్లా అభివృద్ధిలో ముందుకుసాగుతున్నదని చెబుతున్నారు. 

సంగారెడ్డి ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ : విధుల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ కన్నెర్ర చేస్తున్నారు. బాధ్యత మరచిపోతున్న వారిపై బదిలీ వేటు వేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీగా తాను జిల్లాలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ తన దృష్టికి వచ్చిన అక్రమాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అక్కడికక్కడే అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్‌ వేయడంతో పాటు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని సిబ్బందిని నిలదీస్తూ అక్కడి నుంచి ఇతర చోటుకు బదిలీ చేస్తున్నారు. కలెక్టర్‌ హనుమంతరావు తీసుకుంటున్న కఠిన చర్యలతో అధికార యంత్రాంగంలో చర్చ కొనసాగుతున్నది. అదే తరుణంలో అప్రమత్తమవుతున్న ఇతర సిబ్బంది బాగా పనిచేస్తుండడంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. ఇటీవల చోటు చేసుకున్న వరుస సస్పెన్షన్లు, బదిలీలు, షోకాజ్‌ నోటీసులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న సర్పంచ్‌లపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన వరుస పరిణామాలు ఇలా... 

అక్రమ నిర్మాణాలపై సీరియస్‌..

జిల్లాలో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు అని తేలిన వెంటనే వాటిని కూల్చివేయడంతో పాటు నిర్మాణాల విషయంలో పట్టించుకోని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. కంది మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శి రహీంను కలెక్టర్‌ బదిలీ చేశారు. ఇక్కడి నుంచి ఆయనను ఉన్న ఫలంగా నారాయణఖేడ్‌కు బదిలీ చేశారు. ఇదే అంశంపై కంది డిప్యూటీ తహసీల్దార్‌ మల్లేశంపై కూడా బదిలీ వేటు వేశారు. ఆయనను జహీరాబాద్‌కు బదిలీ చేశారు. వీఆర్వో సత్యనారాయణను సస్పెండ్‌ చేశారు. రామచంద్రాపురం మండలం తాళ్ల చెరువును మట్టితో పూడ్చిన ఘటనపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. విచారణ చేపట్టిన తరువాత ఆర్‌ఐ శ్రీమాన్‌, నీటిపారుదల శాఖ ఏఈ సంతోష్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అక్రమార్కులకు సహకరించింన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడలో నాలాలు, చెరువు భూమిలో ఇండ్ల నిర్మాణం చేపట్టిన వ్యవహారంలో కూడా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్‌, విచారణ జరిపిన తరువాత గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల విషయంలోనే గుమ్మడిదల ఆర్‌ఐ ఆరీఫ్‌ మోహిద్దీన్‌, అన్నారం వీఆర్వో కె.నారాయణరావును కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. 

సర్పంచ్‌, కార్యదర్శులకు నోటీసులు.. 

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న వారితో పాటు అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు మంజూరైన విషయం తెలిసిందే. మరుగుదొడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించపోయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. అంతే కాకుండా అసంపూర్తి నిర్మాణాలకు బిల్లులు చెల్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తరువాత కలెక్టర్‌ సర్పంచ్‌, కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు తీసుకున్న వారిలో కల్హేర్‌ మండలం ఖానాపూర్‌, కృష్ణాపూర్‌, కంగ్టి మండలంలోని బోర్గి, నాగల్‌గిద్ద మండలం ఏస్గీ, నారాయణఖేడ్‌ మండలం హంగర్గ-కె, హంగర్గ-బి, చాప్టా-కె, సిర్గాపూర్‌ మండలంలోని సిర్గాపూర్‌ పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శులున్నారు. ప్రజా ప్రతినిధులకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తుండడంతో అందరూ అప్రమత్తం అవుతున్నారు. 

విరాళాల సొమ్మును ప్రభుత్వ డబ్బుగా చూపి...

కింది స్థాయిలో అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే కలెక్టర్‌ సీరియస్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌కు నివేదిక సమర్పించారు. విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతో జరిగిన నిర్మాణ పనులను ప్రభుత్వ డబ్బు కింద చూపి దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. మనూరు మండలం బెల్లాపూర్‌ గ్రామంలో చర్చి నిర్మాణానికి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి 2016-17లో రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఆ నిర్మాణంలో దాతలు ఇచ్చిన నిధులు వినియోగించారు. అయితే ఇ క్కడ పనిచేసిన ఇన్‌చార్జి ఎంపీడీవో మాలేశ్వరరావు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మొగులయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు చూపా రు. పూర్తిగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీనితో పై ముగ్గురిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు చీఫ్‌ ఇంజినీర్‌కు ఫిర్యాదు చేశారు. రేపో, ఎల్లుండో చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. 

విధులపై నిర్లక్ష్యం వహించిన...

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై వేటు వేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల నిర్వహించిన పట్టణ ప్రగతిలో నిర్లక్షం వహించిన వారిపై చర్యలు తీసుకున్నారు. బొల్లారం మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను ఇదే అంశంపై కలెక్టర్‌ సరెండర్‌ చేశారు. ఇంజినీర్‌ ఎండీ.యూసుఫ్‌ విధుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్‌ గుర్తించారు. పది రోజుల పాటు పట్టణ ప్రగతి జరిగితే విధులు సరిగ్గా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూసుఫ్‌ను చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. గుమ్మడిదల మండలం వావిలాల బీట్‌ అధికారి వెంకటేష్‌ను కూడా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. పటాన్‌చెరు మండ లం ఇంద్రేశం, పెద్ద కంజర్ల రహదారికి ఇరువైపులా హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. 1,200 మొక్కల్లో సగానికి పైగా ఎండిపోయినా అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. 

‘పల్లె ప్రగతి’ సందర్భంలోనూ...

జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున పల్లెప్రగతి జరిగిన విషయం తెలిసిందే. పల్లె ప్రగతి సక్సెస్‌తోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి చేపట్టింది. కాగా పల్లె ప్రగతి రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలువడం గమనార్హం. జిల్లాలో కలెక్టర్‌ తీసుకున్న సీరియస్‌ చర్యలతోనే కార్యక్రమం సక్సెస్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కలెక్టర్‌ కఠినంగా వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంటే అక్కడికక్కడే సర్పంచ్‌, కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో గ్రామాన్ని ఆదర్శంగా తిర్చిదిద్దుకున్న సర్పంచ్‌లను స్వయంగా కలెక్టర్‌ ఆయా గ్రామాల్లోనే సన్మానించారు కూడా. పట్టణ ప్రగతిలో నిర్లక్ష్యం వహించిన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మొత్తంగా పనిచేసిన వారికే కలెక్టర్‌ గుర్తింపు నిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతి, అక్రమాలను ప్రోత్సహించే వారిపై కఠినంగా వ్యహరిస్తున్నారు.  logo