శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Mar 16, 2020 , 23:07:17

డబుల్‌ ధమాకా

డబుల్‌ ధమాకా

పేదల చిరకాల వాంఛ సొంత గూడు.. మనదంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా.. పొద్దంతా కూలీ నాలి చేసుకుని వచ్చి తలదాచుకోవడానికి కాస్త చోటుంటే ఎంతో ధైర్యం.. వారి కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు అందజేస్తున్నది. చిరకాల కోరికను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్‌ ఇండ్లు మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లోనూ ఇండ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారు. జిల్లాలో ఇప్పటి వరకు నియోజకవర్గానికి 1400 చొప్పున మొత్తం 5555 ఇండ్లను మంజూరు చేశారు. ఇండ్ల నిర్మాణాలకు గానూ రూ.144 కోట్లను విడుదల చేశారు. 5505 ఇండ్లకు టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాగా, ఇప్పటి వరకు 1086 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలు అత్యధికంగా కొల్లూర్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మంజూరైన ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో నిర్మాణాలు చేపడుతున్నారు. 124 ఎకరాల్లో పురుడు పోసుకుంటున్న ‘ఆదర్శ టౌన్‌షిప్‌'లో ఒకేచోట 15,660 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నారు. ఆయా పనులు పూర్తి చేసి త్వరలోనే పేదల చేతికి అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • జిల్లాలో 5555 ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం
  • రూ.144 కోట్ల నిధులు మంజూరు
  • ప్రారంభానికి సిద్ధంగా 1086 ఇండ్లు
  • నియోజకవర్గానికి 1400 ఇండ్లు కేటాయింపు
  • డబుల్‌ ఇండ్లకు బడ్జెట్‌ పెంచిన ప్రభుత్వం
  • దేశానికే ఆదర్శం కానున్న కొల్లూర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
  • ఒకే చోట 15,660 నిర్మాణాలు

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: పేదోడి సొంతి కల నెరవేరనున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతమయ్యాయి. జిల్లాలో నిరుపేదలకు అందించేందుకు 5555 ఇండ్లను మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేసి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇండ్ల నిర్మాణాలకుగానూ ప్రభుత్వం రూ.144 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో 5505 ఇండ్లకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుని తుది జాబితా సిద్ధం చేసి కాంట్రాక్టర్లుకు పనులు అప్పగించగా, అందులో 5115 ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1086 ఇండ్ల నిర్మాణాలు పూర్తి ప్రారంభానికి సిద్ధం చేసింది. పూర్తయిన నివాసాలను అర్హులకు పంపిణీ చేసేందుకు గుర్తింపు శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామసభలతో ఎంపిక చేసి నివేదికలు సద్ధం చేశారు. 

ప్రారంభానికి 1086 ఇండ్లు సిద్ధం...

జిల్లాకు మంజూరైన ఇండ్లలో ఇప్పటి వరకు 1086 ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్‌ మండలం అలియాబాద్‌ శివారులో 50 ఇండ్లు, సదాశివపేట మండలం ముబారక్‌పూర్‌లో 30, తంగేడుపల్లిలో 30 ఇండ్లు, సదాశివపేట మండల పరిధిలోని సిద్ధాపూర్‌లో 100 ఇండ్లు నిర్మాణాలను పూర్తి చేసుకున్నాయి. అలాగే జహీరాబాద్‌ మండలం రహెమత్‌నగర్‌లో పట్టణ పేదలకు కేటాయించిన 312 ఇండ్లు, ఫస్తాపూర్‌ శివారులో 40 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అందోల్‌ మున్సిపల్‌ పరిధిలోని పట్టణ వాసులకు 216 ఇండ్లు, వడ్డెర-హమాలీస్‌ కాలనీ కోసం 108 ఇండ్లను నిర్మించి పూర్తి చేశారు. దీంతో పాటు పుల్కల్‌ మండలం సింగూర్‌ గ్రామ శివారులో 150 ఇండ్లు పూర్తి చేసుకున్నాయి. నారాయణఖేడ్‌ నియోజకవర్గం కంగ్టి మండలం బాచేపల్లిలో 50 ఇండ్లు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. 

నియోజకవర్గాల వారీగా డబుల్‌ ఇండ్లు మంజూరు

ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా 1400ల చొప్పున డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో రెండు విడుతలుగా 2015-16లో 1800ల డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు, 2016-17లో 3755 ఇండ్లను సర్కార్‌ మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ప్రాథమిక ఆరోగ్యశాఖలకు పనులను అప్పగించింది. అదేవిధంగా ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలకు అత్యధికంగా నిధులు కేటాయించింది. దీంతో నిర్మాణాలు మరింత వేగవంతం కానున్నాయి. 

అర్హులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు...

గ్రామాల్లో ఇళ్లు లేని పేదలు, పట్టణాల్లోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి నివేదికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే డబుల్‌బెడ్‌రూం ఇండ్లను అర్హుల జాబితా ప్రకారం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సమావేశాల్లో డబుల్‌బెడ్‌రూంల ఇండ్లకు అత్యధిక నిధులు కేటాయించడంతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం పేదలకు వరంగా మారిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

సొంతింటి కల నెరవేరనున్నది...

ఇల్లులేని పేదలకు సొంతింటి కలను పేదలకు సహకారం కానున్నది. తమ గ్రామశివారులో 50 ఇండ్లు నిర్మాణాలు పూర్తిచేసుకోవడం సంతోషకరం. గ్రామంలోని 10మంది లబ్ధిదారులకు అధికారులు డబుల్‌బెడ్‌రూం ఇండ్లను కేటాయించారు. అధికారికంగా ప్రారంభం కాగానే అర్హుల జాబితాలో ఎంపికైన పేదలు సొంతింట్లోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాకుండా 50 ఇండ్లు తమ గ్రామ శివారులో నిర్మాణాలు చేసుకోవడం భవిష్యత్‌లో గ్రామపంచాయతీకి నిధులు పెరిగే అవకాశం కలిగింది.

- ఫయీమ్‌, సర్పంచ్‌ అలియాబాద్‌ logo