బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Mar 16, 2020 , 00:07:58

కరోనా బంద్‌

కరోనా బంద్‌
  • సినిమాహాళ్లు, బార్లు, విద్యాసంస్థలకు సెలవులు
  • ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • స్వగ్రామాలకు పయనమైన విద్యార్థులు

సంగారెడ్డి అర్బన్‌/పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు ముసిఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. సెలవులు ప్రకటించడంతో జిల్లాలోని గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది మాస్కులతో కూడిన ప్రయాణికులు కనిపించారు. ఆదివారం కావడంతో అన్ని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు బంద్‌ ఉన్నాయి. రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కూడా ఈ నెల 31వరకు తమ విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తున్నట్టు పత్రిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు సహకరించి కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు అధిక సంఖ్యలో సంచరించే ప్రాంతాల్లో నోటికి చేతి రుమాలు, మాస్కులు ధరించి ఉండాలని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.  

సినిమాహాళ్లు, బార్లులు బంద్‌...

సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్‌, రుక్మిణీ, సితార థియేటర్లు ముసివేసి బోర్డులు ఏర్పాటు చేశారు. అదే విధంగా జహీరాబాద్‌ పట్టణంలో సినీమ్యాక్స్‌ థియేటర్‌, బొల్లారంలో జ్యోతి థియేటర్లు మూసి ఉన్నాయి. అలాగే బార్‌లు మూసివేసి వినియోగదారులకు మద్యం అమ్మకాలను నిలిపివేశారు. మద్యం దుకాణాల్లో సిట్టింగ్‌రూమ్‌లను బంద్‌చేసి మద్యాన్ని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం సెలవు దినం కావడంతో రహదారులు బోసిపోయి వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ కరోనా వైరస్‌ నుంచి కపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించే పనిలో ఉన్నారు.


logo