బుధవారం 03 జూన్ 2020
Sangareddy - Mar 15, 2020 , 00:42:26

విదేశీ అతిథులు

విదేశీ అతిథులు

ఆహ్లాదకరమైన ప్రదేశం అమీన్‌పూర్‌ పెద్ద చెరువు ప్రాంతం. ఇక్కడి ప్రకృతి అందాలకు పర్యాటక ప్రేమికులే కాదు, పక్షులు సైతం ఫిదా కావాల్సిందే. ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వస్తుంటాయి. ఈ పక్షుల రాకతో చెరువుకు మరింత అందం చేకూరుతున్నది. పక్షి ప్రేమికులు ఇక్కడికి వచ్చి వాటి చిత్రాలను కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు. అమీన్‌పూర్‌ పెద్ద చెరువుపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం...

  • అమీన్‌పూర్‌ పెద్దచెరువుకు సుమారు 270 రకాల పక్షులు
  • ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తున్న పక్షి ప్రేమికులు

అమీన్‌పూర్‌: ప్రకృతి మానవ సమాజ మనగడకు గొప్ప సంపద. అందుకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణను మనమంతా కాపాడుటకు నిరంతర ప్రయత్నం కొనసాగించాలి. అందులో భాగంగానే అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువును తెలంగాణ ప్రభుత్వం జీవవైవిధ్య కేంద్రంగా ప్రకటించి, పర్యావరణ ప్రకృతి పరిరక్షణ దిశగా అడుగులు వేసింది. దీంతో పక్షి ప్రేమికురాలు అయిన తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్‌ అమీన్‌పూర్‌ పెద్ద చెరువును దత్తత తీసుకొని పక్షుల అవాసాలకు అండగా నిలిచారు. సుమారు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి అనేక జాతుల పక్షులు వలస వచ్చి కొంత కాలం జీవనం సాగించి తిరిగి వెళ్తాయని ఇక్కడి పెద్దలు చెబుతున్న మాట. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పక్షుల ఆవాసాల కోసం ఏర్పాట్లు చేసి అభివృద్ధి పర్చేందుకు ఈ చెరువును జీవవైవిధ్య కేంద్రంగా ప్రకటించింది. దీంతో పెద్ద చెరువు మధ్య భాగంలో అక్కడక్కడ దీవులను నిర్మించారు. అంతేకాకుండా చెరువు చుట్టూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.3.50 కోట్ల నిధులను కేటాయించి పనులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కట్టకు ఇరువైపులా గ్రిల్స్‌ బిగించి పాదాచారులకు కుర్చీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చుట్టూ వివిధ రకాల పూల మొక్కలను నాటారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు పరసర ప్రాంతం కావడంతో అత్యధికంగా పర్యాటకులు చెరువు అందాలతోపాటు పక్షులను చూడడానికి వస్తున్నారు. చూడముచ్చటైన పక్షులను చూసి పక్షి ప్రేమికులు చిత్రాలు తీస్తూ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.  


పర్యాటకుల సందడి...

అన్ని వయస్సుల పక్షి ప్రేమికులు అనేక రాష్ర్టాలతోపాటు విదేశీయులు సైతం అమీన్‌పూర్‌ బర్డింగ్‌ పాల్స్‌ను సందర్శించి వీక్షిస్తుంటారు. ఎంతోమంది తమ కెమెరాల్లో పక్షుల అందాలను బంధించుకుంటూ తమ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టిస్తున్నారు. శని, ఆదివారాల్లో ఎక్కువగా పర్యాటకులతో చెరువు చుట్టు ఈ ప్రాంతం సందడిగా మారుతుంది.  


270 రకాలకు  పైగా పక్షి జాతులు..

ఈ చెరువు వద్ద దాదాపుగా 270 రకాలకు పైగా పక్షి జాతులు ఉంటాయని అంచనా. ప్రతి యేటా సుమారు 150 పైగా అనేక రకాల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. 120 రకాల పక్షులు స్థానికంగా జీవనం సాగిస్తున్నాయి. విదేశీ పక్షులు సీజనల్‌గా వస్తుంటాయి. కొన్ని రకాల జాతి పక్షులు మార్చి, ఏప్రిల్‌ నెలలో వస్తే మరికొన్ని పక్షులు నవంబర్‌, డిసెంబరు నెలలో వస్తుంటాయి. ఒకసారి పక్షులు వచ్చాయంటే మళ్లీ గుర్తుంచుకొని ప్రతియేటా అదే మాసంలో వలస రావడం విశేషం. రష్యా, సౌది అరేబియా, సౌతాఫ్రికా, యూరప్‌, ఆఫ్రికా వంటి అనేక దేశాల నుంచి పక్షులు వలస వస్తున్నట్లు పక్షిప్రేమికులు చెబుతున్నారు. కాగా, చెరువుకు ఎంతో అందాలను తెచ్చిపెడుతున్న స్వాట్‌ బిల్‌, కింగ్‌ ఫిషర్‌, పెలికాన్‌, ప్లెమింగోస్‌, పెయింట్‌ కొంగలు, సర్వేసెట్‌లతో పాటు మార్చి నెలలో నార్థెన్‌ శవరర్‌, సాండ్‌ పైపర్‌ వంటి అనేక రకాల బాతులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల ఆధారంగా వలసల రాకపోకలు ఉండడం గమనించవచ్చు.


మరింత అభివృద్ధి ఎస్‌పీఎఫ్‌ చొరవే...

అమీన్‌పూర్‌ పెద్ద చెరువులో పక్షుల ఆవాసాలకు నిలయంగా తయారు చేయడం తెలంగాణ ఎస్‌పీఎఫ్‌ అధికారులు, సిబ్బందియే కీలకపాత్ర వహించారు. పక్షులకు స్థిరత్వం ఏర్పర్చుకునేలా అనేక చర్యలు తీసుకుంటూ నిత్యం పర్యవేక్షించడం, ప్రభుత్వ పరంగా మాట్లాడుతూ నిధుల మంజూరుకు కృషి చేస్తూ పక్షుల పరిరక్షణకు తోడ్పడుతున్నారు. అక్కడ పారిశుధ్య పనులను చేస్తూ చెరువు ప్రాంతమంతా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. దీంతో పక్షుల జీవనం కోసం చెరువులోకి కాలుష్య జలాలు చేరకుండా చేస్తున్నారు. 


విదేశీ పక్షుల రాక  అమీన్‌పూర్‌ అదృష్టం...

అమీన్‌పూర్‌ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కప్పుడు చిన్న పల్లె. ఇప్పుడు ఓ పెద్ద పట్టణంగా తయారైంది. అందుకు ఇక్కడ లక్షలాది మంది ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడివారంతా ఆర్థికంగా ఎదిగి అభివృద్ధి చెందారు. దీంతో పాటు మనుషులే కాక మా ఊరి పెద్ద చెరువుకు దేశ విదేశీ పక్షులు సైతం ఇక్కడికి వస్తుండడం అమీన్‌పూర్‌ అదృష్టంగానే భావించవచ్చు.

- శ్రీనివాస్‌, అమీన్‌పూర్‌


అందాలను తెచ్చిపెడుతున్న పక్షులు..

నిత్యం అనేక కొత్త రకాల పక్షులు అమీన్‌పూర్‌ చుట్టూ తిరుగుతూ అందాలను తెచ్చిపెడుతున్నాయి. వీటిని చూడటానికి ఎంతో మంది ప్రజలు ఇక్కడి రావడంతో ఈ ప్రాంతమంతా కళకళాడుతూ కనపడుతుంది. అంతేకాకుండా ప్రతియేటా తేజ్‌దీప్‌కౌర్‌ మేడం పక్షులకు సంబంధించి మహిళలకు ముగ్గులతోపాటు పిల్లలకు అనేక పోటీలు నిర్వహిస్తుండంతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతిసారి ఒకే సమయానికి విదేశాల నుంచి అవే పక్షులు రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

- దేవేందర్‌రెడ్డి, అమీన్‌పూర్‌


పక్షుల సంరక్షణ అవసరం

మానవ మనుగడకు చెరువుల సంరక్షణతోపాటు పక్షుల సంరక్షణ అవసరం. పక్షులు అంతరించకుండా వాటిని కాపాడుకునేందుకు మనమే ముందుకు రావాలి. ప్రకృతిలో పక్షుల జీవనం మానవులకు ఎంతో ఉపయోగకరం. దీంతోపాటు నగర జీవనంలో మనుషులకు మంచిగాలి, ఆహ్లాదకరమైన వాతావరణం చెరువుల వల్ల లభిస్తాయి. అందుకు చెరువులు, పక్షులను సంరక్షించుకుని పర్యావరణాన్ని మెరుగుపర్చుకోవాలి. 

- కళ్యాణ్‌, పక్షి ప్రేమికుడుlogo