సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Mar 10, 2020 , 00:28:11

సింగూర్‌కు సింగారం

సింగూర్‌కు సింగారం
  • రూ.50 కోట్లతో పనులకు ఆమోదం..

1976లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో 1988 నుంచి నీటిని నిల్వ చేస్తున్నారు. ఏటా ఈ ప్రాజెక్టుకు కేటాయించే నిధులతో వివిధ రకాల మెయింటెనెన్స్‌, మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు మరమ్మతు పనులకు రూ.50 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.20 కోట్లతో డ్యాం రాతికట్ట పటిష్టత పనులకు కేటాయించారు. డ్యాంకు ఇరువైపులా 7 కిలోమీటర్ల మేర మట్టి కట్టను నిర్మించారు. డ్యాం కుడి, ఎడమ వైపు ఉన్న ఈ మట్టికట్ట దిగువ భాగంలో నీటి తొలకులకు మట్టితో కూడిన రాతి కట్ట కుంగిపోయింది. దీంతో ఈ రాతి కట్ట మరమ్మతుకు నీటిపారుదల శాఖ నిధులను కేటాయించనున్నది. అంతేకాకుండా డ్యాం కట్టపై లైట్లకు రూ.50 లక్షలు, క్రస్ట్‌గేట్ల దిగువ భాగంలోని అప్రాన్‌ మరమ్మతులకు మరో రూ.2 కోట్లు కేటాయించారు.


2009లోనే గుర్తించిన కమిటీ...

సింగూర్‌ డ్యాం రాతి కట్ట కుంగుతున్న విషయాన్ని 2009లోనే కేంద్రం డ్యాం రివ్యూ సేప్టీ కమిటీ గుర్తించింది. అందుకు సాంకేతికంగా మరమ్మతులను గుర్తించి రాతికట్ట పటిష్టతకు సిఫార్సు చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపించింది. దీనికి తోడు సింగూర్‌ సాగుకు 2 టీఎంసీల నీటిని వాడు కోవడానికి వీలుగా సాగునీటి కాల్వలు చేపట్టడంతో కాల్వల నిర్మాణానికి ప్రాధాన్యత నిచ్చారు. 62 కిలోమీటర్ల మేర సాగు నీటి కాల్వలు తవ్వి 40 వేల ఎకరాలకు సాగుకు నీరందించారు. దీంతో రాతి కట్ట పటిష్టతకు అంత ప్రాధాన్యత నివ్వలేదు. ప్రస్తుతం సాగు నీటి కాల్వ పూర్తి కావడంతో డ్యాంపై ఎక్కువ నిధులతో చేసే పనులు రాతి కట్ట పటిష్టత మాత్రమే మిగిలింది.


సీఎం దృష్టిలో రాతి కట్ట పటిష్టత అంశం...

వర్షా కాలంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో సరళా సాగర్‌ డ్యాం కొట్టుకుపోవడంతో సీఎం కేసీఆర్‌ సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సింగూర్‌ డ్యాం ప్రస్తావన రావడమే కాకుండా 2009లో కేంద్ర డ్యాం రివ్యూ సేప్టీ కమిటీ చేసిన సిఫార్సులను నీటిపారుదలశాఖ అధికారులు గుర్తు చేశారు. దీంతో సీఎం కేసీఆర్‌ జ్యోక్యం చేసుకుని సింగూర్‌ డ్యాం దిగువ భాగంలోని రాతికట్ట పటిష్టతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ సీఈ, ఎస్‌ఈలు స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి డ్యాం కట్టను పరిశీలించి, రాతికట్ట మరమ్మతు చేసేందుకు గానూ కవలసిన ప్రతిపాదనలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివారం నిర్వహించిన బడ్జెట్‌ సమావేశాల్లో సింగూర్‌ డ్యాంకు రూ.50 కోట్లు కేటయించడంతో త్వరలోనే మరమ్మతు పనులు చేపట్టనున్నారు.  


మరమ్మతులకు అనుకూలం... 

29.9 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.3 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఈ నీరు కూడా వేసవిలో మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటిని సరఫరా చేస్తుండటంతో నీటిమట్టం మరింత తగ్గే అవకాశమున్నది. నీరు అడుగంటిపోవడంతో కట్ట మరమ్మతులు చేసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాతికట్టను డ్యాంకు ఇరువైపులా ఆరు కిలోమీటర్ల మేర మరమ్మతు చేయడానికి సంకల్పించారు. అంతేకాకుండా రూ.2 కోట్లతో డ్యాం క్రస్ట్‌గేట్లకు దిగువన సెకండ్‌ ఆప్రాన్‌లకు మరమ్మతులు చేయనున్నారు. క్రస్ట్‌గేట్ల కింద సీపింగ్‌ వాటర్‌ (తేమ నీరు) పోవడానికి గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీని ఇటీవల శుభ్రం చేయించారు. వీటికి పెయింటింగ్‌ వేయడానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. క్రస్టుగేట్లకు, క్రేన్లకు, గేట్లను ఎత్తే క్రేన్లకు పెయింటింగ్‌ వేయనున్నారు. ఈ పనులు కూడా డ్యాంలో నీరుంటే సాధ్యం కాదు. ప్రస్తుతం డ్యాం గేట్ల దిగువన మరమ్మతు పనులు చేయడానికి ఆప్రాన్‌ల వద్ద చుక్కనీరు లేదు. కావున ఆప్రాన్‌లు కూడా సులభంగా మరమ్మతు చేయవచ్చును. సింగూర్‌ డ్యాంలోకి వానకాలం ప్రారంభంలో నీరు రాదు. ఎగువన కురిసిన వర్షాలకు సెప్టెంబర్‌లో నీరు చేరుతుంది. కాబట్టి మరమ్మతులు చేయడానికి ఇంచుమించు ఆరేడు నెలల సమయం ఉంటుంది. నీటిపారుదలశాఖ అధికారులు ఈ సమయాన్ని వినియోగించుకుంటే డ్యాం మరమ్మతులు సులువుగా చేయవచ్చని ఆ దిశగా పనులు మొదలు పెట్టనున్నారు.


పనులకు అనుకూల సమయం..

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సింగూర్‌ ప్రాజెక్టుకు రూ.50 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టు మరమ్మతు పనులను చేపట్టనున్నాం. రాతికట్ట, క్రస్టు గేట్ల దిగువన ఆప్రాన్‌ల మరమ్మతులు, గ్యాలరీకి, క్రస్టుగేట్లకు, క్రేన్లకు పెయింటింగ్‌ పనులకు ఏర్పాటు చేస్తున్నాం. డ్యాంలో నీరు లేనందున మరమ్మతు పనులు చేయడానికి ఇదే అనుకూల సమయం.

- బాలగణేశ్‌, డిప్యూటీ ఈఈ, నీటిపారుదలశాఖ


ఆనందంగా ఉన్నది..

రాష్ట్ర బడ్జెట్‌లో సింగూర్‌కు ఎక్కువ నిధులు కేటయించడం ఆనందంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన నుంచి సింగూర్‌ డ్యాంకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ఈ సారికూడా రూ.50 కోట్లు కేటాయించడం సంతోషంగా అనిపిస్తున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సింగూర్‌ భారీ నీటిపారుదల ప్రాజెక్టు. ఈ డ్యాం నుంచి 40వేల ఎకరాలకు సాగునీటి సరఫరా, 6 టీఎంసీలు మిషన్‌ భగీరథకు నీరు సరఫరా అవుతున్నాయి. ఈ డ్యాంకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం అవసరం.

- సంగమేశ్వర్‌గౌడ్‌, రైతు, సింగూర్‌


logo