బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Mar 09, 2020 , 03:38:33

ప్రాజెక్టులకు పెద్దపీట

 ప్రాజెక్టులకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 1,82,914 కోట్ల అంచనాతో బడ్జెట్‌ రూపొందించింది. ఇందులో అన్ని వర్గాల ప్రజలకు సమప్రాధాన్యం కల్పించింది. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంది. ఆదివారం శాసనసభలో తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సకలజనుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. బడ్జెట్‌లో సింహభాగాన్ని నీటిపారుదల శాఖకు కేటాయించడంతోపాటు రైతులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్తను అందించింది. జిల్లాలోని పెద్దనీటి ప్రాజెక్టు అయిన ‘సింగూర్‌'కు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టు మరమ్మతులు చేయనున్నారు. అలాగే కేతకీ సంగమేశ్వర దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలతోపాట ఇతర రంగాలకూ అధిక ప్రాధాన్యమిచ్చింది. బడ్జెట్‌ పేదల మనసు గెలిచిందని, ప్రజలు మెచ్చేలా ఉందని, సామాన్యులకు మేలు జరిగేలా ఉందనే అభిప్రాయాలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.


(సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు సమప్రాధాన్యం కల్పించింది. ఇది సకల జనుల బడ్జెట్‌.. సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ఈ బడ్జెట్‌ ఉంది. బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం శాసనసభలో తొలిసారిగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పెద్ద ప్రాజెక్టు అయిన సింగూర్‌ డ్యామ్‌కు రూ.50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాతికట్ట మరమ్మతులు, క్రస్టు గేట్ల దిగువన ఉన్న ఆప్రాన్ల మరమ్మతులు చేపట్టనున్నారు. అదేవిధంగా ఝరాసంగం మండలం కేతకీ సంగమేశ్వరాలయ అభివృద్ధికి నిధులు కేటాయించారు. అలాగే వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలతోపాట ఇతర రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలకు..ఇంటి ఖాళీ స్థలం ఉంటే సొంతగా ఇల్లు కట్టుకోవడానికి నిధులను కేటాయించింది. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ కార్యక్రమానికి నిధులు. బీడువారిన పొలాలకు త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించనుంది. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీకి నిధులు కేటాయించడంతో  పాటు ఈ నెల నుంచి అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామాల్లో ప్రతి ఐదువేల(క్లస్టర్‌) ఎకరాలకు ఒకటి చొప్పున రూ. 12 లక్షలతో రైతు వేదికల నిర్మాణం.. రైతాంగానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్‌, ఆర్టీసీ కార్మికుల రిటైర్‌మెంట్‌ వయస్సును 60 ఏండ్లకు పెంచడంతో పాటు ఆ సంస్థకు పెద్ద ఎత్తున నిధులను కేటాయింపులు చేశారు. గ్రామాల అభివృద్దికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. నూతన మున్సిపల్‌ చట్టం, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, బీసీ, మైనార్టీలకు భారీగా నిధులను కేటాయించడంతో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


లక్ష రూపాయల రుణ మాఫీ

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేలా ప్రభుత్వం రుణమాఫీకి భారీగా నిధులను కేటాయించింది. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు రూ.25 వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేయనున్నారు. మిగతావి నాలుగు విడుతలుగా మాఫీ చేస్తారు. నేరుగా రైతు చేతికే చెక్కులను అందించనున్నారు. ఈ నెల నుంచే రుణమాఫీకి శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక శాసన సభ్యులు రుణమాఫీ చెక్కులను రైతులకు అందిస్తారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రెండు పంటలకు అందించే రైతుబంధు, రైతుబీమా పథకాలకు నిధులను కేటాయించారు. తుంపర సేద్యాన్ని ప్రోత్సహించడానికి రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందించనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడంతో పాటు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని చెప్పారు.  


రైతు వేదికలు

జిల్లా వ్యాప్తంగా ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా రైతు వేదికలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఒక్కో రైతు వేదికను రూ.12 లక్షలతో నిర్మాణం చేయనున్నారు. రైతు సమన్వయ సమితులను రైతుబంధు సమితులుగా పేరు మార్చనున్నారు. రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పాడి పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తుంది. పాడి పరిశ్రమ బలోపేతం చేయడానికి రైతుల నుంచి సేకరించిన పాలపై లీటరు రూ.4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహాకం అందిస్తుంది.  


అందరికీ విద్య

ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌లో భాగంగా అందరికీ విద్యను అందించాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా అందరికీ విద్యకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఇప్పటికే గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యుల్యను గుర్తించారు. అదేవిధంగా పట్టణ ప్రగతిలో ఆయా మున్సిపాలిటీ పరిధిలో కూడా నిరక్షరాస్యులను గుర్తించారు. త్వరలోనే వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. 


57 ఏండ్లు నిండిన వారికి పింఛన్‌

సంక్షేమ పథకాల్లో భాగంగా ఎలాంటి ఆధారం లేని వారికి సీఎం కేసీఆర్‌ ఆసరా పథకం ద్వారా ఆ ఇంటా పెద్దకొడుకుగా నిలుస్తున్నాడు. ఇప్పటికే ఆసరా పెన్షన్లను పెంచి వృద్ధులకు అందిస్తున్నారు. తాజాగా వృద్ధాప్య పెన్షన్‌ కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించింది. వీరందరికీ  వచ్చే నెల నుంచి పెన్షన్‌ అంద్చినున్నామని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు పేర్కొనడంతో ఆ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. 


సాగునీటి రంగానికి పెద్ద పీట

సాగునీటి రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీటవేసింది. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో సింగూరు ప్రాజెక్టు మరమ్మతులకు రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రైతులకు సాగు నీరందించనున్నట్లు పేర్కొన్నారు. రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జల్లా వ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాలకు సాగు నీరందనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్వల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ప్రాజెక్టు నుంచి చెరువులను నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గొలుసుకట్టు చెరువుల ద్వారా గోదావరి జలాలు నింపనుండడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుంది. మిషన్‌ కాకతీయ పథకం కింద నాలుగు విడుతల్లో జిల్లాలో చెరువులను పనురుద్ధరించారు. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి.  


ఆలయాల అభివృద్ధి..

రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన జహీరాబాద్‌ నియోజకవర్గంలోని కేతకీ సంగమేశ్వర దేవాలయం అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 


పల్లె ప్రగతి జోరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పల్లె ప్రగతికి భారీగా నిధులను కేటాయంచడంతో గ్రామాలు మరింతగా అభివృద్ది చెంది దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అద్భుతంగా తయారవుతున్నాయి. రెండు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను అందించడంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించింది. ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. పచ్చదనం ఉట్టి పడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తడి పొడి చెత్తను వేరుచేసేలా ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను అందించారు. ప్రతి గ్రామంలో డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పారిశుధ్య కార్మికులకు వేతనాలను పెంచడంతో పాటు రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించింది. నూతన మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చింది. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పట్టణాలను అద్భుత పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 


పౌష్ఠికాహారం.. ఆరోగ్యం

ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, శిశువులకు ప్రతి రోజు పౌష్ఠికాహారం అందిస్తుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. గర్భిణులు దవాఖానకు వచ్చి పోవడానికి అమ్మ ఒడి వాహనాల ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయం సౌకర్యం కల్పిస్తున్నుట్ల తెలిపారు. కేసీఆర్‌ కిట్టుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. 


సంక్షేమ పథకాల జోరు 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. గొర్రెలు, బర్రెల పంపిణీ, మత్స్యకార్మికులకు జీవనోపాధి తదితర పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలుపడంతో ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు, బీసీలు, ఇతర కులవృత్తుల వారికి నిధులు కేటాయించారు.


మైనార్టీల సంక్షేమానికి కృషి

రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించడం సంతోషంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బడ్జెట్‌ కేటాయించలేదు. విద్యాపరంగా అభివృద్ధి సాధించేందుకు మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉన్నది. 

- షేక్‌ ఫరీద్‌, రైల్వే బోర్డు సభ్యులు


పట్టణాల అభివృద్ధి బడ్జెట్‌ 

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండోసారి కూడా సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తయారు చేసినట్లుగా ఉన్నది. మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. పట్టణాల రూపురేఖలు మార్చడానికి ప్రత్యేకంగా మున్సిపల్‌శాఖకు నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించడం సంతోషంగా ఉంది. 

- కొలన్‌ రోజారాణి, బొల్లారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ 


అన్ని రంగాలకు ప్రాధాన్యం

 అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ సంతృప్తికరంగా ఉంది. అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, విద్య, వైద్య గృహ నిర్మాణాలకు సముచిత బడ్జెట్‌ను కేటాయించారు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నది చాలా సంతోషంగా ఉంది. గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. 

  - కొరివి ఆంజనేయులు, ఊట్ల సర్పంచ్‌


రైతు బీమా వరం

రైతులకు భరోసా కల్పించే సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, వాటిని అమలు చేయడంతో సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట పెద్దన్నగా నిలుస్తున్నాడు. బడ్జెట్‌లో రైతు బంధు, రైతుబీమా పథకాలకు అధికంగా నిధులు కేటాయించడం చాలా సంతోషం. రైతు బీమా కింద రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బులు అందజేస్తున్నది.  

- ప్రభాకర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు 


రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

 బడ్జెట్‌లో రూ.25 వేల రుణమాఫీ చేస్తామని చెప్పడం హర్షించదగిన విషయం. రైతులకు ఉచిత విద్యుత్‌, ఎరువులు, తక్కువ ధరలకు విత్తనాలు అందిస్తూ వారిని అన్ని రకాలుగా అందుకుంటామని తెలుపడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌ నిజంగా రైతుల పాలిట దేవుడు.     

- పి.బస్వరాజుపాటిల్‌, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌, 


టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నెరవేరనున్న పేదోడి సొంతింటి కల 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే పైచేయి అని మరోసారి రుజువైంది. ఖాళీ స్థలం ఉన్నవారికి సొంతింటిని కట్టుకునేందుకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌, ఆదివారం బడ్జెట్‌లో రూ.11,917 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించడం హర్షణీయం. పేదోడి సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదో సువర్ణావకాశం. - అనిల్‌ రాజ్‌


బడ్జెట్‌తో అన్ని వర్గాలకు లాభం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్నివర్గాలకు లాభం చేకూర్చేలా ఉంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 14 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి. అదేవిధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌, రైతు రుణమాఫీ రూ.25 వేల లోపు ఒకేసారి మాఫీ చేయడం సంతోషకరం. అదేవిధంగా పట్టణ ప్రగతికి నిధులు కేటాయించారు. ఈ నిధుల ద్వారా పట్టణాలు సుందరంగా తయారవుతాయి. మున్సిఫల్‌ శాఖకు రూ.14,809 కోట్లు కేటాయించడం ఆనందం. 

- ఉద్యోగి గౌరిరెడ్డి అనంతరెడ్డి


ప్రజల ఆకాంక్షల బడ్జెట్‌ భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే


అసెంబ్లీలో ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే బడ్జెట్‌. తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ రూ.1,82,914 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రజాసంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కాంక్షించి రూపొందించిన ఈ బడ్జెట్‌ ఖచ్చితంగా ప్రజల సంక్షేమానికి తోడ్పాటునందిస్తుందన్నారు. రైతు రుణమాఫీ, సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించడం శుభపరిణామం. 


బడ్జెట్‌ అద్భుతంగా ఉంది 

క్రాంతికిరణ్‌, అందోలు ఎమ్మెల్యే 

తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బడ్జెట్‌ అద్భుతంగా ఉంది. దేశానికే తలమానికంగా ఉన్న అనేక సంక్షేమ పథకాలను కొనసాగించే విధంగా రూపొందించిన బడ్జెట్‌ అన్నివర్గాల ప్రజలకు మేలు కలుగుతుంది. సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగాన్ని ఆదుకునే విధంగా ఉన్నది. గ్రామీణ, పట్టణ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయింపులు పొందుపర్చడం సంతోషం. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్తుడిని అయినందుకు సంతోషిస్తున్న.


అన్నివర్గాల సంక్షేమ బడ్జెట్‌ 

కొనింటి మాణిక్‌రావు, జహీరాబాద్‌ ఎమ్మెల్యే 

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రైతులకు రుణ మాఫీ, 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటుతో పాటు సౌకర్యలు కలిపించేందుకు నిధులు కేటాయించారు. జహీరాబాద్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే ఝరాసంగం కేతకీ దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రైతులకు భరోసానిచ్చిన బడ్జెట్‌


2020-2021 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రైతులకు పూర్తి భరోసానిచ్చే విధంగా ఉంది. రైతులను ఆదుకునే దిశగా అంశాల వారీగా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి ప్రభుత్వమని నిరూపించుకుంది. రైతుబంధు, రైతుబీమా పథకాలకు బడ్జెట్‌లో నిధులను కేటాయించడాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణానికి, సబ్సిడీ విత్తనాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రైతుల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు. 

- వెంకట్రామ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌


రైతుల సంక్షేమానికి పెద్దపీట

మాల్కాపూర్‌ శివకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ 

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఆర్థిక మాద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీకి నిధులు మంజూరు చేసింది. బడ్జెట్‌లో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.14వేల కోట్లు కేటాయించడం జరిగింది. రైతుల రుణమాఫీతో పాటు పంటలకు మద్దతు ధర కలిపించేందుకు ప్రాధాన్యత కల్పించింది. రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యతనిచ్చింది. రైతు సంక్షేమానికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.


సంక్షేమానికి ప్రాధాన్యం

కొత్త ప్రభాకర్‌రెడ్డి,మెదక్‌ ఎంపీ

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రగతి పద్దును ఆదివారం ప్రవేశపెట్టింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదాయాన్ని పెంచుకుంటూ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నది. ముందు చూపుతో బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. రాష్ట్ర ప్రగతి మరింత వేగవంతమవుతుంది. రైతులు, పేదలు, మహిళలు, మైనార్టీలు, ఉద్యోగ, కార్మిక వర్గాలకు అవసరమైన ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్రం ప్రగతి వైపు పరుగు తీయడానికి  బడ్జెట్‌ బాగా ఉపయోగపడుతుంది.


జనరంజక బడ్జెట్‌ ఎమ్మెల్సీభూపాల్‌రెడ్డి

రాష్ట్ర బడ్జెట్‌లో అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రామిక రంగం, వ్యవసాయరంగం, విద్యుత్‌రంగం, విద్యారంగం ఇలా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సీడీపీ నిధుల్లో భాగంగా రూ.480 కోట్లు కేటాయించడం సంతోషకరం. రాష్ట్రం సర్వతోముకాభివృద్ధి దిశగా పయణించే విధంగా సీఎం కేసీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను రూపొందించడం సంతోషకర విషయం. 


పేదల సంక్షేమానికి అధిక నిధులు 

పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత కల్పించారు. ఆసరా పింఛన్లు, విద్య, వైద్య, రవాణా రంగాలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. హరితహారం, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల మంజూరు, వ్యవసాయ అభివృద్ధికి పంటలు రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతులను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో నిధులు మంజూరు చేశారు. 

- ఉమాకాంత్‌ పాటిల్‌, 


సీడీసీ చైర్మన్‌ జహీరాబాద్‌  రైతులకు ఒకేసారి రుణమాఫీ సంతోషకరం..

రైతులకు ఈ బడ్జెట్‌లోఒకే సారి రూ.25వేల రుణమాఫీ చేయడం సంతోషం. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. వ్యవసాయానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నారు. రైతులపై భారం పడకుండా కరెంట్‌కు ప్రభుత్వమే భరించేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గ్రామాల్లో పల్లెప్రగతి ద్వారా అభివృద్దిలోకి పయనిస్తున్నాయి.గ్రామాల్లో ఇల్లు లేని పేదల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషకరం. - శ్రీవాణి, ముబారక్‌పూర్‌, సర్పంచ్‌


రుణమాఫీతో రైతుకు మేలు 

లక్షలోపు రుణాఫీ చేయడమే కాకుండా, రూ.25వేల లోపు ఉన్నవారికి ఏకకాలంలో రుణమాఫీకి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుండటంతో వ్యవసాయాన్ని భరోసాగా చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమాతో ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ప్రోత్సహిస్తుంది. 

- విఠల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు, కొన్యాల 


logo