శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Mar 09, 2020 , 02:29:26

ఎన్ని సార్లు కూల్చినా మళ్లీ అదే దందా

ఎన్ని సార్లు కూల్చినా మళ్లీ అదే దందా
  • అధికారులను సైతం లెక్క చేయని అక్రమార్కులు
  • బ్యాతోల్‌, ఎర్దనూర్‌లో జోరుగా ఇసుక మాఫియా
  • అరికట్టలేకపోతున్న అధికారులు
  • తూతూ మంత్రంగా చర్యలు

కంది : అదో చీకటి దందా. రాత్రి మొదలు పెడితే వేకువజామున వరకు ఇసుకను తోడి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెద్ద పెద్ద చైన్‌ ఇటాచీలతో ఇక్కడ ఏకంగా కృత్రిమ ఇసుకను తయారు చేసి మరీ దందాను కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో నాలుగు, ఐదుసార్లు అధికారులు ఇసుక ఫిల్టర్లను కూల్చివేసినా అక్రమార్కులు మాత్రం లెక్క చేయకుండా మట్టి దందాను నడిపిస్తున్నారు. ప్రధానంగా కంది మండల పరిధిలోని బ్యాతోల్‌, ఎర్దనూర్‌ గ్రామాల్లో జోరుగా ఈ దందా కొనసాగుతున్నది. అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నారని స్థానికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు గ్రామ శివారు పరిధిలో ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతుంది.


ఎన్ని సార్లు కూల్చినా..

ఇసుక మాఫియాపై గతంలో రెవెన్యూ అధికారులు నాలుగైదు సార్లు స్వయంగా వెళ్లి కూల్చివేశారు. రెండు సార్లు పోలీసుల సహాయంతో కూడా ఇసుక ఫిల్టర్లను కూల్చి వేసినా మళ్లీ దందాను కొనసాగిస్తున్నారు. కృత్రిమ ఇసుకను తయారు చేసి రాత్రి వేళల్లో టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా ఆదివారం ఆర్‌ఐ సంతోశ్‌ ఇతర సిబ్బంది వెళ్లి 12 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేయించారు. ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే చెక్‌ పోస్టు పెడితేనే సాధ్యపడుతుందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే ఇందు కోసం ఎస్పీకి కూడా చెక్‌పోస్టు అనుమతి కోసం లెటర్‌ ద్వారా దరఖాస్తు పెట్టామని తాసిల్దార్‌ రమాదేవి వివరణ ఇచ్చారు.


ఆరు సార్లు.. తొమ్మిది కేసులు

ఇసుక ఫిల్టర్లపై ఆరు నెలలో కాలంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఇప్పటి వరకు ఇదే రెండు ప్రాంతాల్లో అదే చోట ఆరుసార్లు కూల్చివేత చేశారు. ఇందులో భాగంగా సంబంధిత వ్యక్తులపై కూడా తొమ్మిది కేసులు కూడా నమోదు చేశారు. రెండు చైన్‌ ఇటాచీలను పోలీసులు సీజ్‌ చేశారు. ఇన్ని చేసినా అక్రమ దందా మాత్రం అరికట్టలేకపోవడం గమనార్హం.  


చెక్‌పోస్టు ఏర్పాటుకు దరఖాస్తు పెట్టాం

బ్యాతోల్‌, ఎర్దనూర్‌ శివారులలో ఇది వరకే రెండు సార్లు ఇసుక ఫిల్టర్లను కూల్చి వేశాం. అయితే కొందరు వ్యక్తులు మళ్లీ ఈ కృత్రిమ ఇసుక తయారీ చేస్తున్నారు. వీటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఈ రెండు ప్రాంతాల వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి లెటర్‌ ద్వారా దరఖాస్తును కూడా సమర్పించాం. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవు.

- రమాదేవి, కంది తాసిల్దార్‌logo