శుక్రవారం 29 మే 2020
Sangareddy - Mar 07, 2020 , 23:51:42

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌

కంది: ఐఐటీల్లో చదివే విద్యార్థులందరూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి (జాబ్‌ గివర్స్‌గా) బయటకి రావాలి. ఐఐటీలో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థి ఇతరులకు ఆదర్శం. వారి చేతుల్లో దేశ భవిష్యత్‌ ఉందనే విషయాన్ని ఇక్కడి విద్యార్థులు గమనించాలి. త్యాగం సేవా గుణంతో దేశ అభివృద్ధి కోసం పని చేసి ఇతరులకు ఆదర్శంగా నిలువాలని హిమాచల్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం కంది మండల పరిధిలో ఐఐటీ హైదరాబాద్‌ను గవర్నర్‌ దత్తాత్రేయ సందర్శించారు. రెండు ముఖ్య కారణాల వల్ల ఐఐటీని ప్రత్యేకంగా తాను సందర్శించినట్లు చెప్పారు. ఐఐటీ ఎలా పని చేస్తుందనే విషయం తెలుసుకోవడం ఒకటి కాగా, ఇక్కడి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి తగిన సూచనలు ఇవ్వడానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.  ఐఐటీలోని ఆడిటోరియంలో విద్యార్థులతో  ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్‌ విద్యార్థులతో కలిసి మచ్చటించారు. దేశం ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాలి. ప్రతి ఒక్కరూ తాము ఫలానా రాష్ర్టానికి చెందిన వారి మని, ఫలానా ప్రాంతం వారు కామని, తాము కేవలం భారతీయుడిననే విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలని గవర్నర్‌ చెప్పారు. దేశం అభివృద్ధిలో ఐఐటీయన్ల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీకీ ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో వాటిని మరింత స్థాయికి అభివృద్ధి చేయాలని విద్యార్థులకు సూచించారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల ఉద్యోగావకాశాల్లో అందులో సగం 1.50 కోట్ల భారత్‌కే దక్కనున్నాయన్నారు. ఎందుకంటే 2030 నాటికి దేశంలో 65శాతం మంది యువత ఉండబోతున్నారని తెలియజేశారు. యువత చేతుల్లోనే దేశం ఉందని, భావిభారత పౌరుల్లా దేశాభివృద్ధి కోసం త్యాగ గుణం, సేవా గుణాన్ని ఈ స్థాయి నుంచే అలవర్చుకోవాలన్నారు.


ఆత్మహత్యలు వద్దు

చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం సరైన చర్య కాదని గవర్నర్‌ దత్తాత్రేయ అన్నారు. ఈ మధ్య కాలంలో ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని తరచూ పేపర్‌లో చూసి బాధవేసిందన్నారు. అయితే మనోధైర్యం, మానసిక శాతం పొందాలంటే యోగా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.  


ఉన్నత స్థాయికి ఐఐటీ హైదరాబాద్‌

 పదేండ్ల కాలంలోనే ఐఐటీ హైదరాబాద్‌ ఉన్నత స్థాయి రావడం ఎంతో గొప్ప విషయమని దత్తాత్రేయ అన్నారు. అనతికాలంలోనే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో 4వ స్థానానికి చేరుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. అలాగే అర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఐఐటీ  హైదరాబాద్‌ ఒప్పందం కుదుర్చుకోవడం మంచి విషయమన్నారు. ప్రధానంగా ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులు ఐఐటీ మండీ తరహా నానో టెక్నాలజీని అభివృద్ధి చేసేలా పరిశోధనలు చేయాల్సి అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీ.ఎస్‌.మూర్తి, ఐఐటీ ప్రొఫెసర్లు డాక్టర్‌ సుమొన, రాజా బెనర్జి, రాజలక్ష్మి, ఐఐటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం గవర్నర్‌ నేరుగా సంగారెడ్డిలోని జడ్పీ హాల్‌లో ఏర్పాటు చేసిన పౌరసన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, పౌర సన్మాన కమిటీ నాయకులు జగన్‌, పట్టణ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు ఆయన ఘనంగా సన్మానించారు.logo