బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Mar 07, 2020 , 05:54:54

అక్రమ వెంచర్లకు చెక్‌

అక్రమ వెంచర్లకు చెక్‌
  • కొత్త చట్టం అమలుతో అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం
  • ఏప్రిల్‌ 2 నుంచి బీ-పాస్‌ అమలు
  • జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు
  • అక్రమ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్లకు ఆదేశం
  • అత్యధికంగా అమీన్‌పూర్‌లో 123 అక్రమ లేఅవుట్లు
సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మున్షిపల్‌ చట్టంతో ఆయా మున్సిపాలిటీల పరిధిలో అక్రమాలకు చెక్‌ పడనున్నది. ప్రధానంగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేస్తున్నారు. 75 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేకుండా 200 గజాల వరకు సొంత అంగీకార పత్రంతో ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తున్నారు. ఏప్రిల్‌ 2 నుంచి ఇందుకు సంబంధించిన బీ-పాస్‌ విధానం అమలులోకి రానున్నది. అయితే ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వెలసిన లేఅవుట్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ మున్సిపల్‌ కమిషనర్లు సబ్‌రిజిస్ట్రార్లకు సర్వేనెంబర్లతో సహా నివేదికలు అందించారు. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలుండగా అమీన్‌పూర్‌లో పెద్దఎత్తున అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఓ వైపు కూల్చివేతలు కొనసాగుతుండగానే మరోవైపు కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సదాశివపేటల్లో కూడా అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలను సహించేది లేదని మున్సిపల్‌ కమిషనర్లు హెచ్చరిస్తున్నారు.


సంగారెడ్డి, నారాయణఖేడ్‌లలోనూ...

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా అక్రమ లేఅవుట్లను మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. పట్టణ పరిధిలో మొత్తం 9 లేఅవుట్లను గుర్తించి వాటిలోని ప్లాట్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని ప్రచారం చేయడంతో పాటు సబ్‌రిజిస్ట్రార్లకు సర్వేనెంబర్లతో సహా నివేదికలు కూడా అందించారు. నారాయణఖేడ్‌లో మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో 5 లేఅవుట్లు, జహీరాబాద్‌లో ఒక లేఅవుట్‌, సదాశివపేటలో 6 లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఇదిలాఉండగా అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, బొల్లారంలో అక్రమ లేఅవుట్లు లేనట్లు అధికార రికార్డులు చెబుతున్నాయి. అయితే లేఅవుట్లు కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణాలు పెద్దఎత్తున ఉన్నాయి. బొల్లారంలో 27 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. మరో 69 నిర్మాణాలు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో కూడా అక్రమ నిర్మాణాలు తేలనున్నాయి. జహీరాబాద్‌లో 70 అక్రమ నిర్మాణాలకు మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి, సదాశివపేటల్లో కూడా అనుమతిలేని నిర్మాణాలను గుర్తిస్తూ అధికారులు నోటీసులు ఇస్తున్నారు.


logo