శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Mar 07, 2020 , 05:52:21

మైనార్టీ విద్య మరింత బలోపేతం

మైనార్టీ విద్య మరింత బలోపేతం
  • జిల్లాకు ఆరు మైనార్టీ గురుకుల కళాశాలలు మంజూరు
  • 480 మంది విద్యార్థులకు అవకాశం
  • రెసిడెన్షియల్‌ ద్వారా విద్యాభ్యాసానికి ఊతం
  • ఇది వరకే జిల్లాలో రెండు కళాశాలలు

సంగారెడ్డి టౌన్‌: తెలంగాణ సర్కార్‌ మైనార్టీ విద్యార్థులకు శుభవార్తనందిస్తున్నది. ఇప్పటికే మైనార్టీల కోసం జిల్లాలో 12 మైనార్టీ గురుకుల పాఠశాలలు, రెండు ఇంటర్‌ కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. 12 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 4,260 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 210 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా మరింత మంది మైనార్టీ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం నూతనంగా జిల్లాకు మరో ఆరు మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాలలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి కళాశాలలో రెండు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నది. వాటిలో ఒక్కో గ్రూపునకు 40 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించనున్నది. ఆరు కళాశాలల్లో మొత్తం 480 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కలిగింది. 


ఇది వరకే జిల్లాలో రెండు కళాశాలలు ఏర్పాటు చేయగా, అందులో 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సంగారెడ్డిలో బాలికల మైనార్టీ గురుకుల కళాశాల, సదాశివపేటలో బాలుర మైనార్టీ గురుకుల కళాశాల, పటాన్‌చెరులో బాలురు, అందోల్‌ బాలురు, నారాయణఖేడ్‌ బాలికలు, జహీరాబాద్‌ బాలికల మైనార్టీ గురుకుల కళాశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ మైనార్టీ గురుకుల కళాశాలలు ప్రారంభం కానున్నాయి. మైనార్టీ పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉన్న చోట కళాశాలలు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు తరగతి గదులు లేనిచోట అద్దె భవనాలు తీసుకుని ప్రారంభించనున్నామని డీఎల్‌సీ గోపాల కిషన్‌ తెలిపారు. 


జిల్లాకు ఆరు కళాశాలలు మంజూరు..

జిల్లాకు ఆరు మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఒక్కో కళాశాలకు రెండు గ్రూపులను మంజూరు చేసింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సంగారెడ్డిలో బాలికల కళాశాలలను ఏర్పాటు చేస్తూ బైసీపీలో 40 సీట్లు, ఎంపీసీలో 40 సీట్లు కేటాయించారు. మైనార్టీ విద్యార్థులకు 30 సీట్లు, నాన్‌ మైనార్టీ విద్యార్థులకు 10 సీట్ల చొప్పున కేటాయించారు. సదాశివపేట (బాలురు) 80 సీట్లు, పటాన్‌చెరు (బాలురు) 80 సీట్లు, అందోల్‌ (బాలురు) 80 సీట్లు, నారాయణఖేడ్‌ (బాలికలు) 80 సీట్లు, జహీరాబాద్‌ (బాలికలు) 80 సీట్లు బీపీసీ/ఎంపీసీ గ్రూపులకు కేటాయించారు. మొత్తం 480 సీట్లను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. జిల్లాలోని మైనార్టీలు జిల్లాకు 6 కళాశాలలు మంజూరు కావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 


వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు..

జిల్లాకు మంజూరైన ఆరు మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాలలను వచ్చే విద్యాసంవత్సరం 2020-2021 సంవత్సరం నుంచి అమలు చేయనున్నాం. కళాశాలల ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే గురుకుల పాఠశాలలు కొనసాగుతున్న చోట, అదనపు తరగతి గదులు ఉన్న చోట వీటిని ప్రారంభిస్తాం. జహీరాబాద్‌లో కళాశాల ఏర్పాటు కోసం తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యింది. సంగారెడ్డిలో అద్దె భవనంలో కొనసాగుతున్నది. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఒక్కో గ్రూపుకు 8 మంది అధ్యాపకులను నియమిస్తున్నాం. వచ్చే అకాడమి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.    - డీఎల్‌సీ గోపాల కిషన్‌


logo