శుక్రవారం 05 జూన్ 2020
Sangareddy - Mar 05, 2020 , 23:25:59

పైసలొచ్చినయ్‌..

పైసలొచ్చినయ్‌..

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కందులు అమ్ముకున్న రైతులకు డబ్బులొచ్చినయ్‌. మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల నుంచి కందులు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులకు అందాల్సిన డబ్బులు వచ్చాయి. ఈసారి జిల్లాలోని రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ 25 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు అంత వరకు మాత్రమే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.  25 వేల క్వింటాళ్లకు సంబంధించి రైతులకు రూ.14 కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. ఇందులో రూ.9 కోట్లను గురువారం విడుదల చేశారు. జిల్లాకు వచ్చిన డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో చేమచేస్తున్నారు. మిగతా డబ్బులు కూడా రెండు, మూడు రోజుల్లో రానున్నట్లు మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, 25 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి కేంద్రం చేతులెత్తేయగా, రైతులు ఆందోళన చెందారు. రైతుల పరిస్థితులను గుర్తించిన సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. 


ఈ క్రమంలో జిల్లాలోని నారాయణఖేడ్‌, జహీరాబాద్‌లలో రెండు సెంటర్లలో వారం రోజుల నుంచి తిరిగి ప్రభుత్వం క్వింటాలుకు రూ.5800 మద్దతు ధరకు కందులు కొనుగోలు చేస్తున్నది. నారాయణఖేడ్‌ కేంద్రంపై భారం పెరిగిపోవడంతో శుక్రవారం నుంచి రాయికోడ్‌లో మరో కేంద్రం తెరుచుకోనున్నది. ఆ ప్రాంతంలోని కంది రైతులు రాయికోడ్‌ కేంద్రంలో కందులు అమ్ముకోవాలని రంజిత్‌రెడ్డి సూచించారు. జిల్లాలో జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లోనే కంది పంట సాగుచేస్తున్నారు.  వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2 లక్షల క్వింటాళ్ల వరకు కంది దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. అయితే కేంద్రం మాత్రం కేవలం 25 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి కేంద్రాలను మూసేసింది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కందులు కోనుగోలు చేస్తుండడంతో జిల్లా రైతుల సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.


logo