శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Mar 05, 2020 , 00:21:12

జీఎస్టీపై అవగాహన కలిగి ఉండాలి

జీఎస్టీపై అవగాహన కలిగి ఉండాలి

సంగారెడ్డి టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని సెంట్రల్‌ జీఎస్టీ హైదరాబాద్‌ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్య అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు జిల్లా జిల్లాలో ‘సెంట్రల్‌ జీఎస్టీ మీవద్దకు’ అనే అంశంపై అన్ని జిల్లా కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో జీఎస్టీ సమావేశాలు పూర్తి చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ చట్టంలో ట్యాక్స్‌ పేయర్స్‌ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈ సమావేశాల ద్వారా వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ జీఎస్టీపై సమావేశం ఏర్పాటు చేసి పట్టణ ప్రాంతాల వారికి మాత్రమే జీఎస్టీపై అవగాహన ఉంటుందని, జిల్లాల్లో జీఎస్టీపై వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు, ట్యాక్స్‌ పేయర్స్‌లకు అవగాహన ఉండడం లేదని, వారికి కూడా అవగాహన కల్పించాలని సూచించారన్నారు. జీఎస్టీలో ముఖ్యంగా సాప్ట్‌వేర్‌, పాలసీ, ఆపరేటర్‌ నెట్‌వర్క్‌ సమస్యలు వస్తున్నాయన్నారు. ట్యాక్స్‌ పేయర్స్‌ పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు నివేదికలు అందజేస్తామన్నారు.  


 రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన : జీఎస్టీ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు

జిల్లా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జీఎస్టీ హైదరాబాద్‌ జోన్‌ కమిషనర్‌ జి.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీపై తెలంగాణ అన్ని జిల్లాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 25 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకు, ట్యాక్స్‌ పేయర్స్‌కు జీఎస్టీపై అవగాహన కల్పించామన్నారు. ఈనెల 7వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేసి జీఎస్టీ చెల్లింపులపై ట్యాక్స్‌ పేయర్స్‌ పడుతున్న ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, ఆపరేటర్‌ సమస్యలు, నెట్‌వర్క్‌ సమస్యలను నివేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ట్యాక్స్‌ పేయర్స్‌ ఎర్రర్‌ పనిచేయడం లేదు, రిజిస్ట్రేషన్‌ క్యాన్సిల్‌ అయ్యింది, కంపోజిట్‌ డీలర్స్‌ తమ జీఎస్టీని తొలగించారు, సాప్ట్‌వేర్‌ ప్రాబ్లం, పాలసీ ఇబ్బందులు, ఆపరేటర్‌ సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటన్నింటిని పరిష్కరించేందుకు నివేదికను జీఎస్టీ అధికారులకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ రిటర్న్స్‌, న్యూ రిటర్న్‌, ఈ-ఇన్నోవేషన్‌, రిజిస్ట్రేషన్‌, క్యాన్సలేషన్‌, సెక్షన్‌ 16(4) ఆఫ్‌ సీజీఎస్టీ యాక్టు-2017, రూల్‌ 36(4), ఇంటరెస్ట్‌, ఐటీసీ బ్లాకింగ్‌, మల్టిపుల్‌ యూనిట్‌ రిజిస్ట్రేషన్స్‌, జాబ్‌ వర్క్‌, జీఎస్టీ ప్రాక్టిషనర్స్‌, రికార్డ్‌ టూ మెయిన్‌టెన్‌ ఇన్‌ జీ ఎస్టీ, జీఎస్టీ రిఫండ్స్‌, ట్రాన్‌-1 పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జీఎస్టీ హైదరాబాద్‌ జోన్‌ అడిషనల్‌ కమిషనర్‌ వి.వసుధ ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.క మల్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.గోకుల్‌, సంగారెడ్డి డివిజనల్‌ అధికారి అమ్రిత్‌ షా కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo