గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Mar 04, 2020 , 01:04:50

ఆర్టీసీలో సంబురాలు

ఆర్టీసీలో సంబురాలు

మెదక్‌ రూరల్‌ : ఆర్డీసీని లాభాల బాట పట్టించేలా కలిసికట్టుగా ముందుకెళ్దామని మెదక్‌ ఆర్‌ఎం.రాజశేఖర్‌ అన్నారు. మంగళవారం మెదక్‌ మండలం కొంటూరు చెరువు వద్ద మెదక్‌ బస్సు డిపో మేనేజర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఉద్యోగులతో ఆత్మీయ వనభోజన సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్‌ఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆర్టీసీని లాభాల బాటవైపు నడిచేలా కృషి చేయాలన్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం ఆర్జించేలా ముందుకెళ్లి సంస్థను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మెదక్‌ రీజియన్‌లో 2,900 మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. మెదక్‌ రీజియన్‌లో ప్రతి రోజు రెండున్నర లక్షల కిలోమీటర్లు బస్సులను తిప్పుతూ 80 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నారన్నారు. సంస్థను మంచి ప్రణాళికతో ముందుకు  తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తుందన్నారు. మేడారం, ఏడుపాయల జాతరల్లో మెదక్‌ రీజియన్‌కు అత్యధిక లాభాలు తెచ్చి పెట్టాయన్నారు. ఈ సందర్భంగా గత మాసంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన ఉద్యోగులకు ఆర్‌ఎం ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉద్యోగులతో కలిసి ఆర్‌ఎం రాజశేఖర్‌, ఏవో జాకబ్‌, మెదక్‌, సంగారెడ్డి బస్సు డిపోల మేనేజర్లు జాకీర్‌హుస్సేన్‌, నాగభూషణం డ్యాన్స్‌లు చేశారు. మహిళా ఉద్యోగులు కోలాటం ఆడారు. అనంతరం ఉద్యోగులందరూ వన భోజనాలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ తిరుమలేశ్‌, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉద్యోగులు ఎమ్‌ఆర్కే రావు, బోస్‌, శాకయ్య, వీఎస్‌ రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, అంజాగౌడ్‌, మాందపురం శ్రీనివాస్‌, వెంకట్‌గౌడ్‌, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. 


logo