శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Mar 04, 2020 , 01:02:49

తడి, పొడి చెత్త వేరు చేయకపోతే రూ.500 జరిమానా

తడి, పొడి చెత్త వేరు చేయకపోతే  రూ.500 జరిమానా

సంగారెడ్డి టౌన్‌ : ఖాళీ స్థలాలు డంప్‌యార్డుగా మారుతున్నాయని, మన ఇండ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. మంగళవారం పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక 33వ వార్డులో కలెక్టర్‌ హనుమంతరావు పర్యటించారు. వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి తడి, పొడి చెత్త బుట్టలను అందిస్తున్నామని, ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వకపోతే రూ.500 జరిమానా విధిస్తామన్నారు. ఖాళీ స్థలంలో చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సహకారం లేనిదే పట్టణం ప్రగతి సాధించదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 

అపరిశుభ్రత వాతావరణం వల్ల మలేరియా, డెంగీ వంటి రోగాలు వస్తాయని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కనెక్షన్‌ ఇస్తే మురుగు కాల్వలు ఎండిపోయి దోమలు వృద్ధి చెందవన్నారు. రానున్న పది రోజుల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కనెక్షన్‌ పూర్తి చేయిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. భూగర్భ మురుగు కాల్వలు ఇంటింటికీ కనెక్షన్లు పూర్తి చేసి రోడ్లు వేస్తే 30 యేండ్ల వరకు ఎలాంటి బాధలు ఉండవని చెప్పారు. ప్రతి ఖాళీ స్థలాన్ని డంప్‌యార్డ్‌గా మార్చారని, ఖాళీ స్థలం చూసి చుట్టుపక్కల ఇండ్లవారందరూ చెత్త వేస్తున్నారని, ఖాళీ స్థలాల్లో చెత్తవేస్తే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా మున్సిపాలిటీ చెత్త బండ్లకు తడి, పొడి చెత్త వేరుగా వేసి సహకరించాలన్నారు. పట్టణ ప్రగతికి సహకరించరని వారికి రూ.500 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. చెత్త అనేది దేశానికి పెద్ద సమస్యగా మారిందని, ప్రజలు సహకరిస్తే చెత్తను దూరం చేయడం సులభతరం అన్నారు. దేశంలో ప్రతి రోజు వేల టన్నుల కొద్ది పేరుకుపోతున్న చెత్తను నియంత్రించవచ్చని తెలిపారు. చెత్తను నియంత్రించే బాధ్యత అందరిపై ఉందని అందరూ సహకరిస్తే చెత్త లేకుండా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మీరవి, మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌ చంద్ర, మాజీ సీడీసీ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, టీపీవో లక్ష్మీనారాయణ, డీఈ ఇంతియాజ్‌ అహ్మద్‌, విద్యుత్‌ శాఖ ఏఈ శ్రేయాన్‌, వార్డు ప్రత్యేక అధికారి, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


logo