మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Mar 04, 2020 , 00:58:37

ఆడపిల్లల పెండ్లికి భరోసా కల్యాణలక్ష్మి

ఆడపిల్లల పెండ్లికి భరోసా కల్యాణలక్ష్మి

హత్నూర: పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు భరోసాగా కల్యాణలక్ష్మి పథకం నిలుస్తుందని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రం హత్నూరలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. పండుగలకు కొత్తబట్టల పంపిణీ, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పించన్లు అందజేత తదితర పథకాలతో పేదలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి గ్రామం సంపూర్ణ పారిశుధ్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. కాగా,  హరితహారం మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని నాటిన మొక్కలను రక్షిస్తూనే కొత్త మొక్కలు నాటాలని కోరారు.

తారురోడ్లతో కొత్తకళ

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు తరువాత పట్టణాలు, పల్లెలను కలిపే చిన్న, పెద్దరోడ్లన్నీంటికి మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణాలతో ప్రజలు సాఫీగా ప్రయాణాలు జరుపుతున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని దేవునిగుట్ట, ఎల్యగుట్ట, భీమ్లాతండాలను కలుపుతున్న మట్టిరోడ్డును బీటీరోడ్డుగా మార్చడం కోసం ప్రభుత్వం రూ.1కోటి 6లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సిరిపుర పంచాయతీకి మంజూరైన ట్రాక్టర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ జయరాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ బుచ్చిరెడ్డి, సర్పంచ్‌లు వీరాస్వామిగౌడ్‌, సుధాకర్‌, మాణిక్యరెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo