శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Mar 03, 2020 , 00:14:05

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు
  • జిల్లాలో జోరుగా పట్టణ ప్రగతి కార్యక్రమం
  • పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
  • వార్డుల్లో పర్యటిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
  • పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
  • హరితహారం, విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
  • కలెక్టర్‌ హనుమంతరావు
  • తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో పర్యటించిన కలెక్టర్‌
  • నారాయణఖేడ్‌ మున్సిపాలిటీలో పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌ రాజర్షి షా
పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఎనిమిది మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. వార్డుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటిస్తూ మురుగు కాల్వలు,  హరితహారం, విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.  సోమవారం కలెక్టర్‌ హనుమంతరావు తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో పర్యటించారు. ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు.  అలాగే, నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిల్లో అదనపు కలెక్టర్‌ రాజర్షి షా  పర్యటించారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నట్లు తెలిపారు.  

-నారాయణఖేడ్‌, నమస్తేతెలంగాణ / రామచంద్రాపురం 


రామచంద్రాపురం : పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. సోమవారం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్‌, తెల్లాపూర్‌, ఉస్మాన్‌నగర్‌ గ్రామాల్లో పర్యటించారు. ఆయా వార్డుల్లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ లలితాసోమిరెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్‌నగర్‌లో  20 ఏండ్ల క్రితం వేసిన అంతర్గత డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌లతో సమస్యలు వస్తున్నాయని, నూతన లైన్‌లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. తెల్లాపూర్‌లో సర్వేనంబర్‌ 323లో నాన్‌వెజ్‌ మార్కెట్‌, నూతన మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. గ్రామంలో 252 సర్వేనంబర్‌లో ఎస్‌టీపీ నిర్మాణానికి ఎకరం భూమి కేటాయించాలని, అర్హులైన పేదలకు ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులను మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.  ఉస్మాన్‌నగర్‌లో శ్మశానవాటిక అభివృద్ధికి అదనంగా భూమిని కేటాయించాలని కౌన్సిలర్‌ చిట్టి ఉమేశ్వర్‌ కోరారు. అలాట్‌ చేసిన ప్రభుత్వ భూమిలో శ్మశానవాటికను అభివృద్ధి చేసుకోవాలని, మిగతా భూమి టీఎస్‌ఐఐసీ ఆధీనంలో ఉందని, వారితో చర్చిస్తానని కలెక్టర్‌ చెప్పారు. కొల్లూర్‌లో పారిశుధ్య సమస్యలు అధికంగా ఉన్నాయని, అధికారులు సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని కౌన్సిలర్‌ మయూరిరాజుగౌడ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. 


రేడియల్‌ పనుల పురోగతిపై నివేదిక ఇవ్వండి..

తెల్లాపూర్‌ నుంచి కొల్లూర్‌ ఓఆర్‌ఆర్‌ వరకు, తెల్లాపూర్‌ నుంచి ఈదులనాగులపల్లి వరకు జరుగుతున్న రేడియల్‌ రోడ్ల పనుల పురోగతిపై నివేదికను ఇవ్వాలని తాసిల్దార్‌ శివకుమార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. రోడ్డు పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, ఇతరత్రా సమస్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని తాసిల్దార్‌కు సూచించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ రేడియల్‌ రోడ్డు పనుల విషయమై నివేదికను అడిగారు. రేడియల్‌ రోడ్డులో భాగంగా రైతులకు నష్ట పరిహారం చెల్లించి పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతకుముందు కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణాలను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చుకునేందుకు ప్రతిఒక్కరిపై బాధ్యత ఉన్నదని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. వార్డుల్లో పారిశుధ్య, తాగునీటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని సూచించారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో  సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమం లో వైస్‌ చైర్మన్‌ రాములుగౌడ్‌, కౌన్సిలర్లు శ్రీశైలం, బాలా జీ, పావనిప్రసన్న, మం జుల, జ్యోతి, మయూరి, లచ్చిరాం, రాజు, భరత్‌, రాంసింగ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ మల్లారెడ్డి, కమిషనర్‌ వెంకటమణికరణ్‌, అధికారులు  పాల్గొన్నారు.


logo