మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Mar 03, 2020 , 00:10:03

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
  • రేపటి నుంచి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు
  • ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లు
  • ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు
  • జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు
  • పరీక్షలకు 32,138 మంది విద్యార్థులు
  • పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి కిషన్‌ పవార్‌

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కిషన్‌ పవార్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 నుంచి 18 వరకు జరిగే ఇంటర్‌ పరీక్షలో విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసి తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చాలన్నారు. హాల్‌ టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్‌లో tsbi.cgg.gov.in వెబ్‌ సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులు ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసిన అన్‌లైన్‌లో హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లాలో 49 కేంద్రాలను ఏర్పాటు చేసి 32138 మంది విద్యార్థులకు పరీక్షలు రాయడానికి  ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష సమయానికి ముందు ఉదయం 8:30 నిమిషాలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 8:45కు కేంద్రాల లోపటికి అనుమతి ఉంటుందని, 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. పరీక్ష పేపర్లు కేంద్రాల సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లలో భద్రపర్చామని, పరీక్షల ప్రారంభం రోజున డ్రా తీసీ ఆయా కేంద్రాలకు బందోబస్తుతో పరీక్ష పేపర్లు పంపిస్తామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందు కు సెంటర్‌ లొకేషన్‌ యాప్‌తో దూరంతో పాటు స మయం తెలుస్తుందని విద్యార్థులందరికీ అనుసంధానం చేశామన్నారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని సమయానికి ముందు యాప్‌ పర్యవేక్షణతో చే రుకొని పరీక్షలు  రాయాలన్నారు. పదోతరగతి హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో లాగిన్‌ చేస్తే ఇంటర్‌ మొదటి సంవత్సరం హాల్‌ టికెట్‌ వివరాలు తెలుస్తాయన్నారు. 

 

144 సెక్షన్‌ అమలు.. 

ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, పోలీస్‌ బందోబస్తులో పరీక్షలు రాస్తారని ఆయన వివరించారు. అంతే కాకుండా కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తామన్నారు. ఇన్విజిలేటర్లు, విద్యార్థులు చరవాణిలతో హాజరైతే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌, మంచినీటీ సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, వైద్య సదుపాయానికి ఒక ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచామన్నారు. పోలీసులు, సీసీ కెమెరాల నిఘాలో విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. 


అధికారులతో పర్యవేక్షణ.. 

ఇంటర్‌ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు ముఖ్య కార్యదర్శి చిత్ర రాంచంద్రన్‌, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశాలతో ప్రత్యేక అధికారలు పర్యవేక్షణ ఉంటుందన్నాని ఆయన తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో డీఈసీ కమిటీ, హైపర్‌ కమిటీ, రెండు ఫ్లయింగ్‌ స్కాడ్‌ల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌లో 14790 మంది విద్యార్థులు, వొకేషనల్‌లో 1272 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 12700, వొకేషనల్‌లో 857 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొంటారన్నారు. అలాగే ప్రైవేటు పరీక్షలు రాసే విద్యార్థులు 2463 మంది, వొకేషనల్‌లో 56 మంది విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాస్తారన్నారు. దీంతో పాటు బ్రిడ్జి కోర్సు ప్రథమ సంవత్సరం వారికి 19న, ద్వితీయ సంవత్సరం వారికి 28న పరీక్షలు ఉంటాయన్నారు. 


17 కేంద్రాల్లో పరీక్ష పేపర్లు.. 

జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాలకు పరీక్ష పేపర్లను తరలించేందుకు 17 కేంద్రాల్లో పేపర్లు భద్రపర్చామని ఇంటర్‌ మీడియట్‌ జిల్లా అధికారి కిషన్‌ పవార్‌ వెల్లడించారు. పరీక్షలు ప్రారంభమయ్యే రోజు పోలీసు బందోబస్తు నడుమ పరీక్ష కేంద్రాలకు పేపర్లను తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి నిర్భయంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఇందుకోసం 101 కళాశాలల్లో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాడానికి కౌన్సిలర్‌ను ఏర్పాటు చేసి అవగాహన కల్పించామని  ఆయన వెల్లడించారు. సమావేశంలో డీఈసీ సభ్యులు గోవింద్‌రామ్‌, శ్రీనివాస్‌, అశోక్‌, హైపర్‌ కమిటీ సభ్యులు ఎంఏ.ప్రభావతి, సుభాష్‌చంద్ర, ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


logo