శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Mar 01, 2020 , 23:29:44

పట్టణ శోభ

పట్టణ శోభ
  • జోరుగా ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం
  • జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పనులు
  • పరిష్కారమవుతున్న ఏండ్ల నాటి సమస్యలు
  • పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యం
  • సంగారెడ్డిలో కలెక్టర్‌ హనుమంతరావు పర్యటన
  • అమీన్‌పూర్‌, జహీరాబాద్‌ పట్టణాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, కొనింటి మాణిక్‌రావు
  • సదాశివపేట పట్టణంలో పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌ రాజర్షి షా

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తిస్తూ పరిష్కరిస్తున్నారు. చెత్తలేకుండా శుభ్రం చేయించడంతోపాటు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కార్యక్రమం ద్వారా పరిష్కారమవుతున్నాయి. ఆదివారం సంగారెడ్డి మున్సిపాలిటీలో కలెక్టర్‌ హనుమంతరావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో పర్యటిస్తూ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్‌ సమస్యలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అన్ని వార్డులను పరిశుభ్రంగా చేసి అభివృద్ధిలో సంగారెడ్డిని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఆయా వార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. జహీరాబాద్‌ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. పట్టణ ప్రగతిలో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ స్థానిక సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.  

- సంగారెడ్డి నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌


సంగారెడ్డి మున్సిపాలిటీ: వార్డులో వంగిన,  పట్టిన, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులకు సూచించారు. పట్టణంలోని ఆదివారం 27వ వార్డులో కలెక్టర్‌ పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు వార్డులో విద్యుత్‌ వైర్లు ఇండ్లపై వేలాడుతున్నాయని, లోవోల్టేజీ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. అన్ని ప్రాంతాల్లో ప్రమాద రహితమైన విద్యుత్‌ వ్యవస్థను మెరుగుపర్చాలని అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్‌ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇండ్లపై వేలాడే వైర్లను సరిచేయాలని, చిన్న స్తంభాలను తొలిగించి పెద్ద స్తంభాలను వేయాలన్నారు. పనులకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే  మంజూరు చేస్తామని తెలిపారు. అధికారులు ప్రతిరోజు విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లను తనిఖీ చేయాలని, పగలు సమయంలో ఎక్కడ లైట్లు వెలుగకుండా చూడాలన్నారు. రాత్రి సమయంలో విధిదీపాలు వెలిగేలా చూడాలని తెలిపారు. రహదారులపై పచ్చదనంతో పట్టణం కళకళలాడాలని హితవు పలికారు. చెత్త నిర్మూలనకు డంప్‌యార్డును ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు.  పట్టణ ప్రగతిపై ఏర్పాటు చేసిన కమిటీలతో మాట్లాడారు. వార్డును శుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలను పెంచడంతోపాటు వాటిని కాపాడుకోవాలన్నారు. 


ప్లాస్టిక్‌ రహిత సంగారెడ్డిగా తీర్చిదిద్దాలి..

ప్లాస్టిక్‌ రహిత సంగారెడ్డిగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ హనుమంతరావు ప్రజలకు సూచించారు. అందరికీ తడి, పొడి చెత్త బుట్టలు అందించామని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేయకుండా చెత్తను అందించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రూ.500 జరిమానా విధించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అభివృద్ధిలో సంగారెడ్డి నెం బర్‌-1 స్థానంలో ఉంచేందుకు అందరూ  కృషిచేయాలన్నారు. చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ఆటోలను త్వరలో పంపిణీ చేస్తామన్నారు.  హరితహారంలో యువత భాగస్వాములకు కావాలని పిలుపునిచ్చారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రతి పట్టణానికి డంప్‌యార్డులు నిర్మించి తడి, పొడి చెత్తను వేరు వేరు చేయాలని, తడి చెత్తను వర్మీకంపోస్టుగా తయారు చేసి మొక్కలకు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  సంగారెడ్డి పట్టణాన్ని సుందరంగా ఉంచుకుందామన్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చెత్తను రోడ్డుపై వేసే వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 


27వ వార్డును మోడల్‌ కాలనీగా చేద్దాం..

27వ వార్డును  అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామని, దశల వారీగా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతి రోజు మున్సిపల్‌ కార్మికులు వార్డుల్లో మురుగు కాల్వలను శుభ్రపరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్‌ పౌడర్‌ను వేయాలని సూచించారు. మీ-సేవ పక్కన గల ఖాళీ స్థలంలో మహిళ, చిన్నారుల పార్కు, మహిళా జిమ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులకు చూసి కౌన్సిలర్‌ మంజులతను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మీరవి, వార్డు కౌన్సిలర్‌ నక్క మంజులత నాగరాజుగౌడ్‌, డీఈ ఇంతియాజ్‌ అహ్మద్‌, జిల్లా పరిషత్‌ సెక్షన్‌ అధికారి, వార్డు ప్రత్యేకాధికారి వేణు, విద్యుత్‌ ఏఈ శ్రేయాన్‌, నాయకులు వీరన్న యాదవ్‌, సంకీర్త్‌, వార్డు సభ్యులు శివశంకర్‌, అబ్దుల్‌ రహమాన్‌, వీరారెడ్డి, అరుణ్‌, సత్యనారాయణ, దత్తత్రేయ, రాజు, నర్సోజు, రుక్మయ్య, విశ్వనాథం, జ్యోతి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo