శుక్రవారం 05 జూన్ 2020
Sangareddy - Mar 01, 2020 , 23:28:29

రమణీయం.. రాచన్న కల్యాణం

రమణీయం.. రాచన్న కల్యాణం

బడంపేట రాచన్న స్వామి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. ఆదివారం ఆలయ ప్రాంగణంలోని భద్రకాళీసమేత వీరభద్ర అవతారంలోని రాచన్నస్వామికి వేదపండితులు కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యే మాణిక్‌రావు గర్భగుడిలోని రాచన్నస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

- కోహీర్‌


పలు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు

ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

కోహీర్‌: బడంపేట రాచన్నస్వామి కల్యాణం కనుల పండువలా కొనసాగింది. ఆదివారం రాచన్నస్వామి దేవాలయ ఆవరణలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన కల్యాణ మండపంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. భద్రకాళిదేవికి అపర వీరభద్ర  అవతారంలో రాచన్నస్వామితో మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల పాదాలపై అక్షింతలు వేసి ఆశీస్సులు పొందారు. అంతకు ముందు ఆలయ గర్భగుడిలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్‌ పట్టణానికి చెందిన కౌలాస్‌ పరివార్‌ ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మహామంగళహారతి చేపట్టారు. తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన కృష్ణమూర్తి దంపతులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ రాందాస్‌, మదన్‌మోహన్‌రావు, ఈవో శివరుద్రప్ప, శివానంద్‌, శివమూర్తిస్వామి, జగదీశ్వర్‌స్వామి, భక్తులు పాల్గొన్నారు.


రాచన్నస్వామిని దర్శించుకున్న ప్రముఖులు

బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రముఖులను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని శివలింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం వారిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌ వెంకట్‌రాంరెడ్డి, నర్సింహారెడ్డి, శంకర్‌, భక్తులు పాల్గొన్నారు. 


logo