ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Mar 01, 2020 , 00:54:21

దేవేందరుడికే పట్టాభిషేకం డీసీసీబీ పీఠంపై గులాబీ జెండా

దేవేందరుడికే పట్టాభిషేకం డీసీసీబీ పీఠంపై గులాబీ జెండా
  • చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక
  • చిట్టికి, శివకుమార్‌లకు శుభాకాంక్షల వెల్లువ
  • వరుసగా రెండోసారి చిట్టికే పట్టం
  • వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం
  • వైస్‌ చైర్మన్‌గా రమేశ్‌
  • డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు
  • నియామకాన్ని ప్రకటించిన అధికారులు, ధ్రువపత్రాల అందజేత
  • డీసీసీబీ ప్రాంగణంలో గులాబీ నాయకుల కోలాహలం
  • ముగిసిన సహకార ఎన్నికల ప్రక్రియ

ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. డీసీసీబీ చైర్మన్‌గా కొండపాక పీఏసీఎస్‌ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. చైర్మన్‌గా ఎన్నికకావడం వరుసగా ఇది రెండోసారి. వైస్‌ చైర్మన్‌గా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం సంగారెడ్డి డీసీసీబీ కార్యాలయంలో జరిగిన ఎన్నికలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానానికి ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించి ధ్రువపత్రాలు అందజేశారు. అలాగే జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌గా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, వైస్‌ చైర్మన్‌గా కొల్చారం మండలం రంగంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌లు ఎన్నికయ్యారు. అంతకుముందు పార్టీ అధిష్ఠానం నుంచి ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ సీల్డ్‌ కవర్‌లో ఉన్న పేర్లను ప్రకటించడంతో డైరెక్టర్లంతా ఆమోదం తెలిపారు. ఎన్నిక అనంతరం నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు ఎంపీతోపాటు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులతో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. - సంగారెడ్డి అర్బన్‌,నమస్తే తెలంగాణ


సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: ఎన్నికలు ఏవైనా అధికార పార్టీ బలపర్చిన మద్దతుదారులకే ప్రజలు పట్టం కడుతారని డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో మరోసారి రుజువు చేశారు. శనివారం చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో చైర్మన్‌ పదవి ఎవరినీ వరిస్తుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. ఫిబ్రవరి 25వ తేదీన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికకు ఒక్కొక్క నామినేషన్లు దాఖలు కావడంతో 18డీసీసీబీ, 7డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. డీసీసీబీ డైరెక్టర్లుగా ఎన్నికైన 18మంది, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు విహార యాత్రకు వెళ్లారు. గెలిచిన డైరెక్టర్లందరూ గోవా విహార యాత్రకు వెళ్లి చైర్మన్ల ఎన్నికకు హాజరయ్యారు. ఉదయం 9గంటలకు డీసీసీబీ కార్యాలయానికి యాత్రలో ఉన్న డైరెక్టర్లు అందరూ చేరుకున్నారు. ముందుగా డీసీసీబీ ఎన్నికల అధికారి డీసీవో ప్రసాద్‌ ఎన్నికైన ధ్రువపత్రాలను డైరెక్టర్లకు అందజేశారు. అనంతరం డైరెక్టర్లతో అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నియమ, నిబంధనలను ఎన్నికల అధికారి వివరించారు. 


అధిష్టానం నుంచి ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య షీల్డ్‌ కవర్‌తో వచ్చి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల అభ్యర్థులను ప్రకటించారు. దీనికి డైరెక్టర్లందరూ మద్దతు తెలిపి ఆమోదం తెలుపడంతో నామినేషన్లు వేశారు. 10:15లకు  చిట్టి దేవేందర్‌రెడ్డి చైర్మన్‌గా నామినేషన్‌ను దాఖలు చేశారు. చైర్మన్‌గా బక్కి వెంకటయ్య ప్రతిపాదించగా, ఎం.దేవేందర్‌రెడ్డి బలపర్చారు. అలాగే, వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం నామినేషన్‌ దాఖలు చేయగా, టి.అనంతరెడ్డి ప్రతిపాదించారు. బి.గోవర్ధన్‌రెడ్డి బలపర్చి మద్దతు తెలిపారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఒక్కొక్క నామినేషన్లు దాఖలు కావడంతో మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల అధికారి ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు నియమక పత్రాలను అందజేసి అభినందించారు. కార్యాలయ ప్రాం గణం అభిమానులతో సందడిగా మారింది. అనంతరం అభిమానులు పటాకులు కాల్చి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రత్యేకంగా తలపాక కట్టుకుని అందరినీ ఆకట్టుకున్నాయి. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు డైరెక్టర్లు, పార్టీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. 


డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం..

జిల్లా కో-ఆపరేటీవ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. శనివారం స్థానిక డీసీఎంఎస్‌ కార్యాలయంలో సిద్దిపేట డీసీవో, ఎన్నికల అధికారిగా మనోజ్‌కుమార్‌ వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకుడిగా అధిష్టానం పంపిన షీల్డ్‌ కవర్‌తో రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్‌ హాజరై చైర్మన్‌గా శివకుమార్‌ పేరు, వైస్‌ చైర్మన్‌గా రమేశ్‌ పేర్లను ప్రకటించారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా ఎన్నికైన సభ్యులు చైర్మన్‌గా శివకుమార్‌ను జె.వెంకటేశం ప్రతిపాదించగా, జి.వెంకటేశ్వర్లు బలపర్చారు. అలాగే, వైస్‌ చైర్మన్‌గా రమేశ్‌ను జి.మాణెయ్య ప్రతిపాదించగా, స్వామి బలపర్చి మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సం తోషం వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుట పటాకులు కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు.   ఎన్నికల్లో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, డైరెక్టర్లు అనంత్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, వెంకటయ్య, గోవర్ధన్‌రెడ్డి, సరోజ, హనుమంతరెడ్డి, వెంకట్‌రెడ్డి, రఘవేంద్రారెడ్డి, అంజిరెడ్డి, రమేశ్‌, జగన్‌మోహన్‌రెడ్డి, రాములు, దర్శనం, వెంకట్‌ రాములు, కిషన్‌, నరేందర్‌రెడ్డిలతోపాటు డీసీఎంఎస్‌ డైరెక్టర్లు జేజేల వెంకటేశం, స్వామి, వెంకటేశ్వర్లు, కనకయ్య, గొల్ల మాణెయ్య, సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మీరవి, టీఆర్‌ఎస్‌ నాయకులు జైపాల్‌రెడ్డి, ఆర్‌.వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింహులు, రాం రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, చేర్యాల ప్రభాకర్‌, ఆత్మకూర్‌ నగేశ్‌, మల్లుయాదవ్‌, నర్సింహాగౌడ్‌ పాల్గొన్నారు.


logo