ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Feb 29, 2020 , 01:11:19

20 రోజులు సూత్రాలు

20 రోజులు సూత్రాలు
 • మార్చి 19 నుంచి పదో తరగతి పరీక్షలు
 • మార్చి 2వ తేదీ నుంచి 7వరకు రెండో ప్రీ ఫైనల్స్‌
 • జిల్లాలో పరీక్షలు రాయనున్న 22,182 మంది
 • తక్కువ మార్కుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
 • ప్రత్యేక తరగతులతో రాటుదేలుతున్న విద్యార్థులు
 • ఒత్తిడికి లోనుకావొద్దంటున్న నిపుణులు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు పాఠ్యాంశాల వారీగా రోజుకో అంశంపై 20 రోజులు 20 సూత్రాల ప్రకారం విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. డీఈవో రాజేశ్‌ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేస్తూ విద్యార్థుల చదువుపై ఆరా తీస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు. దీంతో ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వారు ఇంట్లో చదివేలా చూస్తున్నారు. కాగా, మార్చి 19వ తేదీ నుంచి జరుగనున్న పరీక్షల్లో జిల్లాలో 467 పాఠశాలల్లో 22,182 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. - సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ


సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకోసం జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్‌ పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం నుంచి ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ  విద్యార్థులకు సూచనలు, సలహాలు అం దిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మార్చి 19వ తేదీ నుంచి జరుగనున్న పరీక్షల్లో జిల్లాలో 467 పాఠశాలల్లో 22,182 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గురుకులాలు, కస్తూ ర్బా, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులను ఉదయం 6గంటలకే నిద్రలేపి తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విద్యార్థులను నిద్రలేపి చదివించే బాధ్యత తీసుకుని పది ఫలితాల్లో మెరుగైన ఫలితాల కోసం కృషిచేయాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఈసారి పది పరీక్షల్లో జిల్లా అగ్రభాగాన నిలుపాలని విద్యాధికారి ఉపాధ్యాయులను ఆదేశించిన  విషయం తెలిసిందే. 20రోజుల్లో 20 సూత్రాలతో పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టి ముఖ్యమైన ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై దృష్టి పెట్టి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మార్చి 2వ తేదీ నుంచి 7వరకు రెండో ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు నిర్వహించి మార్కుల జాబితా ఆధారంగా విద్యార్థుల చదువులపై శ్రద్ధ తీసుకోనున్నారు. పది పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు నిపుణులు సలహాలు ఇస్తున్నారు.


20 సూత్రాలు పాటిస్తే విజయం..

పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు పాటిస్తే విజయం సాధిస్తారు. అందుకోసం పాఠ్యాంశాల వారీగా రోజుకో అంశంపై 20 రోజులు 20 సూత్రాల ప్రకారం ఉపాధ్యాయుల సలహాలను విద్యార్థులు పాటించాలి.పాఠ్యాంశంలో 20 ప్రశ్నలను ఉపాధ్యాయులు బోధించి జవాబులు చదివిస్తారు. పరీక్షల్లో ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వాటిని ఉపాధ్యాయులు గుర్తించి విద్యార్థులకు బోధన చేస్తారు. ప్రతి పాఠ్యాంశం వారీగా ఉపాధ్యాయులు బోధించే, ఇచ్చిన ప్రశ్నలను కంఠస్థం చేసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. తెలుగులో వ్యాసాలు, కథనాలు, సామాన్య శాస్త్రంలో ప్రయోగ నైపుణ్యం, పట్టికలు, చార్టులు, లోగోలు తదితర అంశాలను ప్రశ్నకు అనుగుణంగా జవాబు రాయాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. అలాగే, గణిత శాస్త్రంలో ఉపాధ్యాయులు బోధించిన సూ త్రాల ప్రకా రం లెక్కలు చేస్తే వందశాతం ప్రతిఫలం వస్తుందని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. 


విద్యార్థులకు ప్రత్యేక తరగతులు..

పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తనగతులు నిర్వహిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు సాయంత్రం 4:30నుంచి 5:30 గం టల వరకు పాఠ్యంశాల వారీగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. విద్యలో వెనుబడిన విద్యార్థులను గుర్తించి దత్తత తీసుకుని ప్రత్యేకంగా బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణను విద్యాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. 


విద్యార్థుల ఇండ్లు, హాస్టళ్లకు ఫోన్‌ కాల్స్‌..

పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఇండ్లు, వసతి గృహాల విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయులు ఫోన్‌ కాల్స్‌ చేసి నిద్ర లేపుతున్నారు. ఉదయం 4 గంటలకే ఫోన్‌చేసి నిద్రలేపి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు వార్డెన్లతో ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్టడీ అవర్స్‌ నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గతేడాది వచ్చిన పది ఫలితాలకు భిన్నంగా వందశాతం సాధించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రీ ఫైనల్స్‌లో  తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి విద్యాభోదన చేస్తున్నారు. పాఠ్యాంశాల వారీగా విద్యార్థులను చదివిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దృష్టి సారించారు.


మార్చి 19 నుంచి పది పరీక్షలు...

మార్చి 19వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించారు. జిల్లాలో22,040 మంది  విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే, ప్రైవేట్‌గా 142 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 112 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి 43 జోన్లుగా విభజించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, కరెంట్‌ సరఫరా, వైద్య శిబిరాలను అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షల సమయాన్ని ప్రకటించారు. 


నిపుణుల సలహాలు పాటించాలి 

 • విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా నిపుణుల సలహాలు పాటించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. నిపుణుల సలహాలు విద్యార్థులు పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుని తల్లిదండ్రులకు సూచించాలి.
 • రోజు పాఠశాలలో నేర్చుకున్న అంశాలపై విద్యార్థులు ఇంట్లో శ్రద్ధగా చదువుకోవాలి.
 • పాఠ్యాంశాల వారీగా చదువుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. 
 • చదువకున్న జవాబులను ఒకటి రెండుసార్లు రాయడం అలవాటు చేసుకోవాలి.
 • పరీక్షల సమయంలో పుస్తకాలతో కుస్తీ పట్టకుండా గంట సమయం ఉల్లాసంగా ఆటల్లో పాల్గొనాలి.
 • చదువుకునే గదిలో వెలుతురును ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
 • ఎక్కువ సేపు చదివితే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
 • పరీక్షల సమయంలో తేలికైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అవసరమైతే పరీక్ష కేంద్రాలకు తాగునీటి బాటిళ్లను తీసుకెళ్లాలి.


మెరుగైన ఫలితాలు సాధిస్తాం

ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రీ ఫైనల్స్‌ను నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించాం. మొదటి ప్రీ ఫైనల్స్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను గుర్తించి మార్చి 2వ నుంచి నిర్వహించే రెండో ప్రీ ఫైనల్స్‌లో ప్రత్యేక బోధన చేసి పరీక్షలకు సిద్ధం చేస్తాం. పాఠ్యాంశాల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి 20 రోజులు 20 సూత్రాల అంశాలతో పరీక్షలకు తయారు చేశాం. మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతాం.

- డీఈవో రాజేశ్‌


విద్యార్థులు కంగారు పడొద్దు

విద్యార్థులు కంగారు పడకుండా ప్రశ్నాపత్రాన్ని పూ ర్తిగా చదివి సులువైన ప్రశ్నలకు జవాబులు రాయాలి. అక్షరాలను గుండ్రంగా రా యడంతో మార్కులు ఎక్కువశాతం ఉన్నది.  పట్టుదలతో పరీక్షలు రాయడానికి విద్యార్థులు సన్నద్ధం కావాలి. అక్షరదోషాలు లేకుండా జవాబులు పూర్తిచేయాలి. జవాబులు రాసేటప్పుడు ఉక్కిరి బిక్కిరి కాకుండా శ్రద్ధగా రాయాలి.

-పూర్ణ కృష్ణ, భాషోపాధ్యాయుడు 


 పరీక్షల్లో ఒత్తిడికి గురికావొద్దు

ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి. ముం దుగా ప్రశ్నా ప్రతాన్ని పూర్తిగా చదువుకొని జవాబులను రాయాలి. తోటి విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా జవాబులపై దృష్టి సారించాలి. ఉపాధ్యాయులు సూచించిన అంశాలను గుర్తించి పరీక్షలు పూర్తిచేయాలి. అప్పుడే లక్ష్యాలను చేరుకుని ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉన్నది.

- గుండప్ప, హిందీ భాషోపాధ్యాయుడు


 పదికి పది సాధిస్తా

పదో తరగతి పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధిస్తా. ఉపాధ్యాయులు బోధించిన విధంగా పరీక్షలను నిర్భయంగా పూర్తిచేస్తా. ప్రత్యేక తరగతుల్లో పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను ఉపాధ్యాయులు తయారు చేసి జవాబులను చదివించారు. ఆ ప్రకారం ప్రశ్నలను చదివి జవాబులు పూర్తి చేసి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తా.

- వి.శైలజ, విద్యార్థి 


పరీక్షలకు సిద్ధం..

ఉపాధ్యాయులు నేర్పించిన విధంగా పరీక్షలకు సిద్ధమయ్యా. ప్రత్యేక తరగతుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు బోధించారు. ఆ ప్రకారం పరీక్ష పేపర్‌లో వచ్చే ప్రశ్నలను పూర్తిగా చదివి జవాబులు రాస్తా. దీంతో పదికి పది సాధించి పాఠశాలకు పేరుతెస్తా.

- శివకృష్ణ, విద్యారి


పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలు 

పాఠశాల సంఖ్య విద్యార్థులు

ప్రభుత్వ                     11 713

జిల్లా పరిషత్‌     195 10155

ఎయిడెడ్‌         2 108

కేజీబీవీ                 17 704

ఆదర్శ పాఠశాలలు 10 941

గురుకులాలు         22 1451

ప్రైవెట్‌                210 7968

మొత్తం                467 22040


logo