మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Feb 29, 2020 , 01:08:54

30 ఏండ్ల కష్టానికి ‘ప్రగతి’తో విముక్తి

30 ఏండ్ల కష్టానికి ‘ప్రగతి’తో విముక్తి
  • ఇండ్లపై ఉన్న విద్యుత్‌ తీగలు తొలిగింపు
  • నారాయణరెడ్డి కాలనీ వాసుల ఇబ్బందులకు స్వస్తి
  • టవర్ల ఏర్పాటుకు అధికారుల చర్యలు
  • రూ.30 లక్షలతో విద్యుత్‌ పనులు షురూ...
  • మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో కదిలిన అధికారులు
  • మాట నిలబెట్టుకున్నారని కాలనీ ప్రజల హర్షం

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ తీగల సమస్యలకు చెక్‌ పడనున్నది. ఈ నెల 24న పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకి ఇండ్లపై వేలాడుతున్న విద్యుత్‌ తీగల సమస్యలు పరిష్కరించాలని 8వ వార్డు కాలనీ వాసులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాలనీ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సమస్యను పరిష్కరించాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించి, అవసరమైన నిధులు కూడా మంజూరు చేస్తానని ప్రకటించారు. మంత్రి ఆదేశాలతో విద్యుత్‌ యంత్రాంగం కదిలింది. వెంటనే కాలనీలో పర్యటించి ఇండ్లపై ఉన్న తీగలు, స్తంభాల తొలిగింపు పనిని మొదలుపెట్టారు. విద్యుత్‌ సమస్యను శాస్వతంగా పరిష్కరించేందుకు రోడ్డుపై ఉన్న స్తంభాలు, ఇండ్లపై వేలాడుతున్న తీగలను మార్చేందుకు అధికారులు 6 టవర్ల, 2 స్తంభాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.30 లక్షల నిధులు మంజూరు చేసి విడుదల చేశారు. పనులు ప్రారంభించడంతో ఇబ్బందులు తీరనున్నాయని నారాయణరెడ్డి కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏండ్లుగా ఇండ్లపై ఉన్న విద్యుత్‌ తీగలు, ఇండ్ల మధ్యలోని స్తంభాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మంత్రి పట్టణ ప్రగతి కార్యక్రమానికి రావడం కాలనీ ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆనందిస్తున్నారు.  


రోడ్లపై విద్యుత్‌ స్తంభాలు, తీగలు...

30 ఏండ్లుగా రోడ్లపై ఉన్న విద్యుత్‌ స్తంభాలు, తీగల తొలిగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇండ్లపైకి వెళ్లాలంటేనే భయపడే ప్రజలకు ప్రమాదం కలిగించే తీగలను తొలిగించడం పనులకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌శాఖ అధికారులు పనుల పురోగతిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్‌ టవర్ల ఏర్పాటుకు గుంతలు తీయడం పనులు ప్రారంభించారు. టవర్ల ఏర్పాటు చేసే నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. త్వరగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చి విద్యుత్‌ సమస్యలను పరిష్కరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. అంతేకాకుండా విద్యుత్‌ కోతల సమస్య లేకుండా కాలనీలో నూతనంగా 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేసి పనులను ప్రారంభించారు. దీంతో విద్యుత్‌ కోతల సమస్య ఉండదని, నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరా అవుతుందని కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


రూ.30 లక్షలతో విద్యుత్‌ పనులు...

కాలనీలో ఇండ్లపై వేలాడుతున్న విద్యుత్‌ తీగల తొలిగింపు, స్తంభాల ఏర్పాటు వంటి పనులకు ప్రభుత్వం నుంచి మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో రూ.30 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో విద్యుత్‌శాఖ అధికారులు కాలనీలో పర్యటించి పనులను ప్రారంభించారు.  


27 కుటుంబాలకు విముక్తి...

నారాయణరెడ్డి కాలనీలో 30 ఏండ్లుగా నివాసాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న 27 కుటుంబాలకు విద్యుత్‌ తీగల తొలిగింపుతో విముక్తి కలుగుతున్నది. 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ తీగలతో పొంచివున్న ప్రమాదంతో ఇన్నాళ్లూ ఆయా కుటుంబ సభ్యులు భయాందోళనలో జీవించారు. కానీ, కాలనీల సమస్యలు పరిష్కరించేందుకు అధికార, ప్రజాప్రతినిధుల బృందం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని నిధులు మంజూరు చేసి పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావు స్పందన అమోఘమని కాలనీ వాసులు కొనియాడుతున్నారు.  


మంత్రి సహకారం మరువలేనిది...

పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కాలనీవాసుల సమస్యలు విన్న మంత్రి హరీశ్‌రావు పరిష్కరానికి సహకరించడం మరువలేం. కాలనీలో విద్యుత్‌ తీగలు, రోడ్లపై  ఉన్న స్తంభాల తొలిగింపునకు నిధులు మంజూరు చేయడం సంతోషకరం. కాలనీ వాసులు మంత్రికి రుణపడి ఉంటారు.

- శ్రీకాంత్‌, 8వ వార్డు కౌన్సిలర్‌


భయంకరంగా ఇంటిపై తీగలు...

కొన్నేండ్ల నుంచి మా ఇంటిపై కరెంటు తీగలు వేలాడుతుండడంతో భయంభయంగా బతుకుతున్నం. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితంలేదు. కానీ కాలనీకి మంత్రి రావడం, సమస్యలు విని స్పందించి పరిష్కారానికి కృషి చేయడం సంతోషకరం. ఇక నుంచి ఇంటిల్లిపాది భయం లేకుండా దాబాపై పనులు చేసుకుంటం. - సంగీత, గృహిణి 


కలలో కూడా ఊహించలేదు...

విద్యుత్‌ తీగల తొలిగింపు, స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని కలలో కూడా ఊహించలేదు. దీర్ఘకాలిక సమస్యలపై స్పందించి పనులకు శ్రీకారం చుట్టడం కాలనీ వాసులు చేసుకున్నా అదృష్టం. వార్డు పర్యటనకు మంత్రి రావడంతోనే సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుని పనులు ప్రారంభించారు.

- కిషన్‌రావు, కాలనీ వాసి


logo