శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Feb 28, 2020 , 01:23:41

జల తోరణం

జల తోరణం

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జిల్లాలో పూర్తి కావొచ్చాయి. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో త్వరలోనే గోదావరి జలాలు జిల్లాను ముద్దాడనున్నాయి. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌(మిడ్‌మానేరు)కు గోదావరి జలాలు వచ్చి చేరాయి. అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల-సిద్దిపేట జిల్లా సరిహద్దులో నిర్మించిన అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు రానుండగా, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు తరలివస్తాయి. ఇప్పటికే ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి అయ్యాయి. అలాగే, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కృషితో రైతుల కల సాకారం కానున్నది.

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నిరంతర శ్రమ, కృషి ఫలితంగా గోదావరి జలాలు జిల్లాను ముద్దాడనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా శ్రీరాజరాజ్వే ర రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాకు తరలించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం జలసవ్వడులు చేస్తున్నది. అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల -సిద్దిపేట జిల్లా సరిహద్దులో నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు వస్తాయి. అనంతరం రంగనాయక సాగ ర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లలోకి గోదావరి జలాలను ఎత్తిపోస్తారు. ఇప్పటికే పనులన్నీ పూర్తి చేశారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ , ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కృషితో  రైతుల కల సాకారం కానున్నది.


అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌ సిద్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌, ఎల్లాయిపల్లి, కొచ్చగుట్టపల్లి గ్రామాల మధ్యన అన్నపూర్ణ (అనంతగిరి 3.50 టీఎంసీల సామర్థ్యం) రిజర్వాయర్‌ను సర్వం సిద్ధం చేశారు. సుమారుగా రూ. 2,700 కోట్ల వ్యయంతో చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ - 10లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి 88.24 టీఎంసీల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా అప్రోచ్‌ చానల్‌, గ్రావిట్‌ కెనాల్‌ 2.380, మెయిన్‌ కెనాల్‌ 7.65 కిలో మీటర్లు ఉంది. తిప్పారం వద్ద 400/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట మండలం తిప్పారం వద్ద ఆసియాలోనే అతి పెద్ద ఓపెన్‌ సర్జిపుల్‌ పంపు నిర్మించారు. 92 మీటర్ల లోతులో ఈ ఓపెన్‌ సర్జిపూల్‌ పంపు ఉంది. ఒక్కో పంపు 106 మెగా వాట్లతో కలిగినవి నాలు గు, 120 మెగా వాట్ల ట్రాన్స్‌ఫార్మర్లను నాలుగింటిని బిగించారు. ఇక్కడే నాన్‌ ఓవర్‌ పుల్‌ డ్యాం కట్టారు. నీళ్లు సర్జిపూల్‌ నుంచి బయటకు ఎత్తిపోసేందుకు రెడీ చేశారు. ప్రతి రోజు ఒక్కో పంపు 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. నాలుగు పంపులకు గాను రోజుకు 1 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తుంది. ఈ రిజర్వాయర్‌తో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు 30 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. సిద్దిపేట జిలాలోని చిన్నకోడూరు, బెజ్జంకి మండలాల్లో 15,200 ఎకరాలకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో 14,000 ఎకరాలకు, కరీంనగర్‌ జిల్లాలోని గన్నేరువరం మండలంలో 800 ఎకరాలకు సాగునీరందిస్తుంది. కొచ్చగుట్టపల్లి ముంపు గ్రామానికి సిద్దిపేట వద్ద కొత్త కాలనీ ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి రంగనాయక పురంగా నామకరణం చేసుకొని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేశారు. ఈ రిజర్వాయర్‌ నుంచి ఓపెన్‌ కెనాల్‌ సొరంగం ద్వారా రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలను తరలిస్తారు.


శ్రీ రంగనాయక సాగర్‌  

రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను చిన్నకోడూరు మం డలంలోని చంద్లాపూర్‌ - పెద్దకోడూరు శివారులో 3 టీఎంసీల సామర్థ్యంతో 8.6 కి.మీ బండ్‌ను నిర్మాణం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ - 11లో అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌కు 88.25 టీఎంసీల నీటిని తరలిస్తారు. గోదావరి జలాలు నింపడానికి రిజర్వాయర్‌ను సిద్ధం చేశారు. చంద్లాపూర్‌ వద్ద సొరంగంలోనే పంపు హౌస్‌ నిర్మాణం చేపట్టారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి వచ్చిన గోదావరి జలాలు ఓపెన్‌ కెనాల్‌ సొరంగం ద్వారా చంద్లాపూర్‌ సర్జిపుల్‌ పంపులోకి వస్తా యి. అక్కడ లిప్టు చేయగానే, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లో పోస్తుంది. 134 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన 4 మోటార్లను బిగించారు. ఈ సర్జిపూల్‌ పంపు రోజుకు 1 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తుంది. ఈ సర్జిపూల్‌ పంపు 65 మీటర్ల లోతులో ఉంటుంది. సొరంగం, ఓపెన్‌ కెనాల్‌ పనులు, అప్రోచ్‌ చానల్‌ 1.75 కిలో మీటరు. గ్రావిన్‌ కె నాల్‌ 0.454 కిలో మీటర్లు, మెయిన్‌ టన్నెల్‌ 8.59 కిలోమీటర్ల పనులన్నీ పూర్తయ్యాయి. చంద్లాపూర్‌ వద్ద 400/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్‌ నుంచి లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరందిస్తారు. కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ రిజర్వాయర్‌ ద్వారా సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 32,000 ఎకరాలకు సాగునీరందిస్తారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు 50 గ్రామాలను కవర్‌ చేస్తుంది. చిన్నకోడూ రు మండలంలోని 20 గ్రామాల్లో 34,990 ఎకరాలకు, నంగునూరు మండలంలోని 17 గ్రామాల్లో 23,621 ఎకరాలకు, సిద్దిపేట అర్బన్‌ మండలంలోని 8 గ్రామాల్లో 5,323 ఎకరాలకు, సిద్దిపేట రూరల్‌ మండలంలోని 5 గ్రా మాల్లో 3,861 ఎకరాలకు, గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాకకు 269 ఎకరాలకు, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో 2,263 ఎకరాలకు, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల మండలంలో 3 గ్రామా ల్లో 2,461, మద్దూరు మండలంలో 7 గ్రామాల్లో 5,318 ఎకరాలకు సాగునీరందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని 10 గ్రామాల్లో 9,759 ఎకరాలకు, సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్‌ మండలంలో 5 గ్రామాల్లో 1971 ఎకరాలకు, తంగళ్లపల్లి మండలంలో 14 గ్రామాల్లో 20,543 ఎకరాలకు నీరందిస్తారు.


కొండపోచమ్మ రిజర్వాయర్‌

గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్‌ పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. కొండ పోచమ్మ రిజర్వాయర్‌ ఐదు జిల్లాల వరప్రదాయిని. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను కొండ పోచమ్మ తీర్చనున్నది. రంగనాయక సాగర్‌ నుంచి  కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీళ్లు తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను చకచకా చేస్తుంది. దీని సామర్థ్యం 15 టీఎంసీలు. సుమారు రూ.1,540 కోట్లు వెచ్చించారు. ఈ రిజర్వాయర్‌కు రంగనాయక సాగర్‌ నుంచి సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌ పల్లి మీదుగా తొగుట మండలం తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి గజ్వేల్‌ మండలం అక్కారం పంప్‌హౌస్‌కు అటునుంచి మర్కూక్‌ పంప్‌హౌస్‌ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ ఐదు జిల్లాలో కలిపి మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే లక్షా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.

15.8 కి.మీ వలయాకారంలో నిర్మాణమైన కట్ట నుంచి మూడు పాయింట్ల వద్ద కెనాల్స్‌కు నీటిని పంపింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు. రెండు పంపుహౌస్‌లు, ఒకటి అక్కారం, రెండోది మర్కూక్‌ వద్ద నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ కింద ఐదు జిల్లాలోని 26 మండలాల్లోని 2,85,280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గానికి 94,543, దుబ్బాక నియోజకవర్గానికి 42,796, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి 35,543, మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ నియోజకవర్గానికి 35,593, మెదక్‌ నియోజకవర్గానికి 17,691, సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గానికి 31,033, పటాన్‌చెరు నియోజకవర్గానికి 10,211, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గానికి 17,865 ఎకరాలకు సాగునీరు అందనుంది. కాగా, ఆయా నియోజకవర్గాలకు నీటిని తీసుకెళ్లడానికి 9 ప్రధాన కాల్వల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వీటిలో రామాయంపేట, గజ్వేల్‌, ఉప్పరపల్లి, కిష్టాపూర్‌, తుర్కపల్లి, జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి ఉన్నాయి. త్వరలోనే రైతుల కల సాకారం కానుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. కాగా, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ బండ్‌ పొడవు 22.9 కి.మీటర్లు ఉంటుంది. దీని ఎత్తు 63 మీటర్లు ఉంటుంది. బండ్‌ నిర్మాణంలో భాగంగా 4 రీచ్‌లుగా విభజించి, పనులు చేపట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బండ్‌ నిర్మాణ పనులతో  పాటు లింక్‌ కెనాల్‌ పనులు జోరుగా జరుగుతున్నాయి.


logo