మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Feb 28, 2020 , 01:43:01

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
  • పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి-అదనపు కలెక్టర్‌ రాజర్షి షా
  • నిర్లక్ష్యం వహించిన నలుగురు
  • స్పెషలాఫీసర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ

(సంగారెడ్డి ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) రాజర్షి షా హెచ్చరించారు. గురువారం ఆయన ‘నమస్తేతెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడారు. ఇప్పటికే గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి విజయవంతమైన సందర్భాన్ని గుర్తు చేశారు. పట్టణ ప్రగతి కూడా జిల్లాలో గ్రాండ్‌ సక్సెస్‌ కావాలన్నారు. ఇందుకు అధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు కలిసి పనిచేయాలని కోరారు. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మొత్తం ఎనిమిది మున్సిపాలిటీలున్నాయి. అన్నింటిలో కలిసి 199 వార్డులున్నాయి. ప్రతి వార్డుకు ఒకరి చొప్పున మొత్తం 199 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్లు రాజర్షి షా తెలిపారు. అయితే పలువురు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందులో భాగంగానే విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించిన రవి (హెచ్‌డబ్ల్యూవో, గుమ్మడిదల), గులాం మోహినొద్దీన్‌ (ఏఈ-ఐఅండ్‌సీఏడీ), మధుసూదన్‌రావు (లైబ్రేరియన్‌, జిన్నారం), కుర్మయ్య (ఏఈపీఆర్‌, జిన్నారం)లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు రాజర్షి షా చెప్పారు. పట్టణ ప్రగతి విషయంలో ప్రత్యేకాధికారులు, వార్డు సూపర్‌వైజర్లు, మున్సిపాలిటీల పరిధిలోని అధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారులు తనిఖీకి కూడా వస్తుంటారని, ఎవరికి వారు బాధ్యతగా పనిచేస్తే ఇబ్బందులుండని సూచించారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

24 గంటల్లో వివరణ

బొల్లారం : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారికి అదనపు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్‌ సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. కాగా సదరు అధికారులు 24గంటల్లో వివరణ ఇచ్చినట్లు తెలిపారు. వీరిలో గులామ్‌ మోహినొద్దీన్‌, రవితేజ పట్టణ ప్రగతి విధుల్లో చేరినట్లు తెలిపారు. మిగతా ఇద్దరిలో కాలేజీ లైబ్రేరియన్‌ మధుసూదన్‌రావు దివ్యాంగుడని, ఏఈపీఆర్‌ కుర్మయ్య బదిలీపై వెళ్లినట్లు కమిషనర్‌ తెలిపారు.


logo