బుధవారం 03 జూన్ 2020
Sangareddy - Feb 28, 2020 , 00:57:32

ఆదాయాన్ని సమకూర్చే మొక్కలు నాటాలి

ఆదాయాన్ని సమకూర్చే మొక్కలు నాటాలి
  • రాష్ట్ర ఫ్లయింగ్‌ స్కాడ్‌ ఆఫీసర్‌ ఫిదానంద్‌ కూక్రీటీ
  • పారిశుధ్యంపై అవగాహన కల్పించాలి
  • నీటిని పొదుపుగా వాడుకోవాలి
  • కొడెకల్‌, నాదులాపూర్‌ గ్రామాల్లో పర్యటన

అందోల్‌, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చే చింత మొక్కలను నాటాలని ఫారెస్ట్‌ సర్వీసెస్‌ విభాగంలోని రాష్ట్ర ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారి ఫిదానంద్‌ కూక్రీటీ అన్నారు. గురువారం అందోలు మండలంలోని నాదులాపూర్‌, కొడెకల్‌ గ్రామాల్లో ఆయన  మండల అధికారులతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామా ల నర్సరీలు, శ్మశాన వాటికలు, డంప్‌ యార్డులు, పార్కు స్థలాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామ పంచాయతీల పరిధిలోని స్థలాల్లో చింత  మొక్కలు నాటి వాటిని పెంచడం వల్ల పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. నాదులాపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన మరుగు దొడ్లను పరిశీలించిన ఆయన వాటిని ఎందుకు వాడడం లేదని  ఉపాధ్యాయులను అడుగగా, నీటి వసతి లేకపోవడంతోనే వాటిని నిరుపయోగంగా వదిలేశామని తెలిపారు. దీంతో పాఠశాలకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని, మరుగుదొడ్లను వాడకంలోకి తీసుకురావాలని సర్పంచ్‌ సత్యనారాయణకు సూచించారు.

ఆయా గ్రామాల్లో అక్కడక్కడ నీరు వృథా చేస్తుండడంతో ఆయన అక్కడున్న వారిని పిలిచి మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, అవసరం మేరకే బోర్లను ఆన్‌ చేసుకోవాలని, నల్లాలకు తప్పని సరిగా మూతలను బిగించుకోవాలన్నారు. ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ఆయా గ్రామాల్లోని నర్సరీలు పెంచే విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్మశాన వాటికల నిర్మాణ పనులు, డంప్‌ యార్డు  పనులను ఆయన పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో చేపట్టిన పనుల గురించి ఎంపీడీవో సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఎంపీవో స్వాతి, ఏపీవో అర్చన, సర్పంచ్‌లు సత్యనారాయణ, పద్మానర్సింహారెడ్డి, ఈసీ ఉదయ్‌, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు. 


logo