శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Feb 26, 2020 , 23:30:16

ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

అమీన్‌పూర్‌ : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలోని బీరంగూడ బ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూముల పరిరక్షణకు ఆలయ ఈవోలు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఉమ్మడి జిల్లా పరిధిలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సుమారు 34 వందల ఎకరాల భూములు ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఆలయ భూముల వివరాలు సేకరించి 10 రోజుల్లో నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో పాటు ఆలయ స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా దేవాదాయ శాఖ ఉద్యోగులు డేగ కన్నుతో పర్యవేక్షిస్తూ భూములను కాపాడాలన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


 భక్తులకు సౌకర్యాలు కల్పించాలి.. 

ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, దీంతో పాటు ఆలయం, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. వృద్ధులకు ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేయాలని, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు బెల్లం లడ్డూను తయారు చేసి అందించాలని తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, ఉమ్మడి మెదక్‌ జిల్లా సహాయ కమిషనర్‌ హేమంత్‌కుమార్‌, ఆలయ ఈవోలు వేణుగోపాల్‌రావు, సార శ్రీనివాస్‌, వివిధ ఆలయాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo