మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Feb 26, 2020 , 23:25:05

హరితహారం, ‘డబుల్‌' ఇండ్లు హర్షనీయం

హరితహారం, ‘డబుల్‌' ఇండ్లు హర్షనీయం

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ/నారాయణరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, భవిష్యత్‌ తరాలకు పచ్చదనం అందించేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఉత్తరాఖండ్‌ రాష్ర్టానికి చెందిన జడ్పీ చైర్మన్లు, కేంద్ర పాలిత ప్రాంతమైన లడక్‌కు చెందిన బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ చైర్మన్లు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పంచాయతీ రాజ్‌ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఉత్తరాఖండ్‌ రాష్ర్టానికి చెందిన 34 మంది జడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కేంద్రపాలిత ప్రాంతమైన లడక్‌కు చెందిన బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్లు 32 మంది బుధవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, వైకుంఠధామం, సామూహిక గొర్రెల షెడ్డు, డంప్‌యార్డు, హరితహారం, బాల వికాస వాటర్‌ ప్లాంట్‌, పార్కు, ఇంకుడు గుంతలు, పంచాయతీ భవనం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించారు. 


సాయంత్రం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నదని వివరించారు. పేదల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను వివరించారు. జిల్లాలో మొక్కలు నాటిన విధానం, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల గురించి తెలుసుకొని ఉత్తరాఖండ్‌, లడక్‌ బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌, లడక్‌లోనూ వీటి అమలు కోసం స్థానిక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీ ప్రతినిధి సకీయొద్దీన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పట్నాయక్‌, డీపీవో సురేశ్‌బాబు, జడ్పీ సీఈవో శ్రావణ్‌, ఎంపీడీవో సమ్మిరెడ్డి, నాయకులు రాధాకృష్ణశర్మ, ఎంపీడీవోలు మురళీధర్‌శర్మ, సమ్మిరెడ్డి, ఎంపీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ దేవయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.logo