సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Feb 25, 2020 , 23:23:25

రెండు నెలల్లో మళ్లొస్తా...

రెండు నెలల్లో మళ్లొస్తా...

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడుగడానికి వస్తారు. కానీ మేము ఓట్లు అయిపోయాక ప్రజలకు సేవ చేద్దామని మీ ముందుకు వచ్చాం. పట్టణ పర్యటనకు మళ్లీ వస్తా.. రెండు నెలల్లో అన్ని వార్డులు పర్యటిస్తానని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సదాశివపేట పట్టణం 15వ వార్డులో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పిల్లోడి జయమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 65వ నెంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి శుభ్రం చేసుకోవాలని భూమి యజమానులకు మంత్రి సూచించారు. అనంతరం కాలనీలో పర్యటించి ఇండ్ల ఎదుట  మురుగు నీరు చేరి రోగాలు వస్తాయని మహిళలకు వివరించారు. మా వీధిలో నీళ్ల సరఫరా జరుగడం లేదని ఇబ్బందులు పడుతున్నామని మాణెమ్మ, జ్యోతి, ఫాతీమా బేగం మంత్రికి వివరించారు. మున్సిపల్‌ అధికారులు చెత్త బుట్టలు ఇవ్వక పోవడంతో తడి, పొడి చెత్తలను కలిపి రెండు రోజులకోకసారి వచ్చే చెత్త బండికి ఇస్తున్నామని సునీత మంత్రి దృష్టికి తెచ్చారు. వార్డులోని గ్రూపులకు అప్పులు వస్తున్నాయా? మీ వార్డులో ఎన్ని గ్రూపు లు ఉన్నాయని, బ్యాంకు రుణాలు ఇస్తున్నారని గ్రూపు అధ్యక్షురాలు ప్రభావతిని మంత్రి ప్రశ్నించారు. మా వార్డులోని గ్రూపులకు సకాలంలో బ్యాంకు అధికారులు అప్పులు ఇస్తున్నారని, వార్డులో 26 గ్రూపులు ఉన్నాయని మంత్రికి వివరించారు. అలాగే, కమిటీ హాల్‌ ఏర్పాటు చేసి గ్రూపు సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని చేర్చించుకునే విధంగా భవనం నిర్మించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. స్థలం ఉంటే చెప్పండి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. 


అనంతరం 4వ వార్డులో నిర్మాణంలో ఉన్న కందకం రోడ్డును మంత్రి పరిశీలించి కంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్‌అండ్‌బీ అధికారులను పిలిచి కందకం రోడ్డు పరిస్థితి ఎందుకు ఇలా.. ఉందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు ముట్టినకా పనులు మధ్యలో ఎందుకు నిలిపివేశారని  అర్‌అండ్‌బీ అధికారులను నిలదీశారు. పట్టణంలో ఇండ్లపై వేలాడే విద్యుత్‌ తీగలు, వంగిన, తుప్పుపట్టిన స్తంభాలు, రోడ్డుపై ఉన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలిగించి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని విద్యుత్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొత్త మున్సిపల్‌ చట్టంపై పట్టణ వాసులకు అవగాహన కల్పించారు.  ఎన్నికలప్పుడు ప్రజల ముందుకు ఓట్ల కోసం వస్తారని, మేము పట్టణంలో 75 గజాల లోపు ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, ఒక్క రూపాయి దరఖాస్తుతో నిర్మాణం చేసుకోవచ్చన్నారు. అలాగే, 75 గజాల నుంచి 250 స్థలంలో ఇంటి నిర్మాణం చేసే యాజమానులు సొంతపూచికత్తుతో పక్క మ్యాప్‌ ప్రకారం ఇండ్లు నిర్మించుకుంటే ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నారు. మున్సిపల్‌ నింబధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేపడితే చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామన్నారు. 


రూ.15 వందల కోట్లతో అభివృద్ధి..

సదాశివపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుందుకు రూ.1500 కోట్ల నిధులు మంజూరు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ఇండ్ల ఎదుట గుంతల్లో మహిళలు నీళ్లు పట్టుకునే దౌర్భగ్యం ఉందని, మంచినీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొత్త పైపులైన్లతో వంటగదిలో నీళ్లు పట్టుకునేలా నళ్లాలతో నీళ్లిస్తామన్నారు. ఆరు నెలల్లో కొత్త పైపులైన్లు పూర్తిచేసి ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామన్నారు. పట్టణంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్‌ ట్యాంక్‌లు, పైప్‌లైన్లు వేస్తామన్నారు.  


వేరు వేరుగా తడి, పొడి చెత్త..

పట్టణంలో ఉన్న నివాసాలకు మున్సిపల్‌ అధికారులు తడి, పొడి చెత్తలను వేరు వేరుగా చేసి చెత్త బండ్లలో వేసేందుకు సం చులు పంపిణీ చేస్తామన్నారు. తడి చెత్తకు ఎర్రని బుట్టలు మున్సిపల్‌ అధికారులు ప్రతి ఇంటికీ అందజేస్తారని, వారం రోజుల్లో పొడి చెత్తకు సంచులు పంపిణీ చేస్తారని అందుకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని మంత్రి వివరించారు. పట్టణంలోని ప్రైవేట్‌, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సమీప నివాసాలవారు చెత్తను వేయడంతో కుప్పలుగా పేరుకు పోయాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తడి, పొడి చెత్తను చెత్త వాహనాల్లో వేయాలని సూచించారు. బహిరంగా ప్రదేశాలు, రోడ్లపై చెత్తవేస్తే గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, చెత్త వేసిన వారిని గుర్తించి రెండుసార్లు మందలించి మూడోసారి రూ.500 జరిమానా వేస్తామన్నారు.  


ఉగాది లోగా ఊబ చెరువు పనులు పూర్తి..

పట్టణంలోని ఊబచెరువును మినీ ట్యాంక్‌బాండ్‌గా సుందరీకరించేందుకు నిధులు ఖర్చు చేశామని, ఐదేండ్లుగా ఊబచెరువు పనులు ఊగిసలాడుతున్నాయని మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు కట్టపై చిన్నారుల ఆటపాటలకు పార్కుల ఏర్పాటు, పచ్చదనం ప్రతిబింబించేలా మొక్కలు పెంచడం, పాదచారులకు వాకింగ్‌ ట్రాక్‌, కూర్చోడానికి ప్రత్యేక టేబుళ్లు, బతుకమ్మ ఫ్లాట్‌ఫాం నిర్మాణం, కట్టపై రెండువైపులా లైట్ల వెలుగులు యువతకు ఓపెన్‌ జిమ్‌, బతుకమ్మ విగ్రహం ప్రతిష్ఠాపన చేసి కట్టకు రెండువైపులా గేట్లు బిగించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశించారు.


వైకుంఠధామాలకు రూ.5 కోట్లు..

ప్రభుత్వం అన్ని మతాలకు ప్రాధాన్యత కల్పిస్తూ  వేరు వేరుగా వైకుంఠధామాలు నిర్మాణాలకు రూ.5 కోట్లు మంజూరు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. దీంతో పాటు మతానికి 5 ఎకరాల చొప్పున 15 ఎకరాల స్థలం శ్మశాన వాటికలకు కేటాయించామని గుర్తుచేశారు. ప్రస్తుతం ముస్లిం, క్రిస్టియన్‌ శ్మశాన వాటికల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, హిందూ శ్మశాన వాటిక పనుల పురోగతిలో ఉందని మంత్రి వెల్లడించారు.  షాదీఖానను మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.  


విద్యుత్‌ సమస్యలు తొలిగిస్తాం..

పట్టణంలోని 16 ప్రాంతాల్లో ఇండ్లపై వేలాడే కరెంట్‌ తీగలు ఉన్నట్లు విద్యుత్‌ అధికారులు తన దృష్టికి తెచ్చారని, అలాంటి వాటితో పాటు స్తంభాలు, బైపాస్‌ టూ బైపాస్‌ రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌, 2.6 కిలో మీటర్ల దూరంలో 109 లైట్లు బిగించడానికి రూ.5కోట్ల నిధులు మంజూరు ఇచ్చామని, పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. మూడు నెలల్లోగా పనులన్నీ పూర్తి చేస్తామని విద్యుత్‌ అధికారులు సమావేశంలో మాట ఇచ్చారని ప్రజలకు వివరించారు. పట్టణ హాల్‌ కోసం రూ.కోటి ఇచ్చామని, స్థలం విషయాన్ని పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు. అలాగే, మాంసాహార మార్కెట్‌కోసం మంజూరు చేసిన రూ.40లక్షలు సరిపోవని అదనంగా రూ.3.50 కోట్లతో కొత్త మార్కెట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు స్లాటర్‌హౌజ్‌, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలిగిస్తామన్నారు. 


అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు..

పట్టణంలో 30 సంవత్సరాలుగా అద్దె ఇండ్లలో నివాసముంటున్న పేదవారికి అర్హులను గుర్తించి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. రెజింతల్‌ గ్రామ శివారులో 400 ఇండ్లు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులను ఎంపిక చేసి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందిస్తామన్నారు.  అలాగే, మహిళా సంఘ భవనానికి రూ.15లక్షలు మంజూరు చేసి గణేశ్‌ కట్ట దగ్గర నిర్మాణం చేస్తామన్నారు.  


కుమ్మరులను ఆదుకుంటాం.. 

చేతి వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న శాతవాహనులను ఆర్థికంగా ఆదుకుని రుణాలు అందజేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కందకం రోడ్డుపై కుండలు తయారు చేసే కుమ్మరి చేతువృత్తుల వారిని మంత్రి పలుకరించి సమస్యలు తెలుసుకున్నారు. వేసవి కాలంలో కుండల నీరు ఆరోగ్యానికి మంచిదని, పేదోడి ఫ్రిజ్‌లాగా చాలామంది ఉపయోగిస్తారని, అందుకోసం చేతి వృత్తి పనిని విడిచిపెట్టకుండా చేయడం గొప్పవిషయం అని మంత్రి కితాబిచ్చారు.


పట్టణ పరిశుభ్రత ముఖ్యం : కలెక్టర్‌  

ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని ప్రజలు ముందుకు వచ్చి స్వాగతిస్తే పట్టణాలు పరిశుభ్రంగా తయారు అవుతాయని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని, వార్డు అభివృద్ధిపై చర్చ జరిపి అవసరమైన పనులకు నిధులు మంజూరు ఇస్తామన్నారు. సదాశివపేట పట్టణానికి డంపుయార్డు ఉందని, చెత్తను వేరు వేరుగా అందించడంతో తడి చెత్త భూమిలో కలిసిపోయి ఎరువుగా మారుతుందని, పొడి చెత్తతో కరెంట్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని కలెక్టర్‌ వివరించారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నరాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, జడ్పీ సీఈవో రవి, ఆర్డీవో మెంచు నగేశ్‌, తాసిల్దార్‌ ఆశాజ్యోతి, ఎంపీడీవో స్వప్న, మున్సిపల్‌ కమిషనర్‌ స్పం దన, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఆకుల శివ, నస్రీన్‌ బేగం, విద్యాసాగర్‌రెడ్డి, ఇంద్రమోహన్‌గౌడ్‌, చౌదరి ప్రకాశ్‌, ఖుద్దూస్‌, నాయకులు చీల మల్లన్న, ఎర్రోళ్ల చిన్న, వీరేశం, నజీర్‌, ముద్ద నాగు, 4,15వ వార్డుల అభివృద్ధి కమిటీల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.


logo