బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Feb 24, 2020 , 00:48:46

పట్టణాలకు .. ప్రగతి పండుగ

పట్టణాలకు .. ప్రగతి పండుగ
  • జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలు
  • ప్రత్యేక కమిటీల ఏర్పాట్లు, స్పెషలాఫీసర్లకు బాధ్యతలు
  • మొదటి రోజు సమావేశాలు
  • వార్డుల పర్యటన, సమస్యల గుర్తింపు
  • కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
  • సంగారెడ్డి మున్సిపాలిటీలో పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు
  • అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్‌ హనుమంతరావు

పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకు స్పెషలాఫీసర్లను కూడా నియమించారు. ఈ కమిటీలు, ప్రత్యేకాధికారులు రోజువారీగా పట్టణ ప్రగతిని పర్యవేక్షించనున్నారు. 24 నుంచి మార్చి 4 వరకు 10 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు వార్డులోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం వార్డు మొత్తం పాదయాత్ర చేస్తూ సమస్యలను గుర్తిస్తారు. ఆయా సమస్యలను ప్రణాళికా బద్ధంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

- సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ


సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి రేపటి నుంచి మొదలుకానున్నది. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీలు ఉన్నా యి. అన్ని చోట్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు సమీక్షలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. పలుమార్లు కలెక్టర్‌ కూడా అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పా టు చేశారు. ప్రతి వార్డుకు స్పెషలాఫీసర్లను కూడా నియమించారు. ఈ కమిటీలు, ప్రత్యేకాధికారులు రోజువారీగా పట్టణ ప్రగతిని పర్యవేక్షించనున్నారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సోమవారం వార్డులోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం వార్డు మొత్తం పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సమస్యలను గుర్తిస్తారు. గుర్తించిన సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు. ఇదిలా ఉండగా, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మొదటి రోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగే పట్టణ ప్రగతిలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పల్లెప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతిని జయప్రదం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. 


పాదయాత్రతో సమస్యల గుర్తింపు..

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో మొదటి రోజు సోమవారం స్థానిక వార్డు ప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, ఇతర అధికారులు ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వార్డు పరిస్థితిపై సమీక్ష జరుపుతారు. తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పరిరక్షణ, విద్యుత్‌ సరఫర ఇతర అన్ని అంశాలపై చర్చిస్తారు. ఇక్కడ చర్చకు వచ్చిన అంశాలను నమోదు చేసుకుంటారు. సమావేశం తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వార్డులో ప్రతి కాలనీని స్వయంగా పరిశీలిస్తారు. అంటే పాదయాత్రగా అన్నిచోట్లు కలియతిరుగుతారు. సమస్యలు, ఇతర అంశాలను చూసి పరిస్థితులను నమోదు చేసుకుంటారు. అధికారుల దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిగణంలోకి తీసుకుంటాం. వీటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి తగు చర్యలు చేపడుతారు. పాదయాత్రలో గుర్తించి విద్యుత్‌ సమస్యల్లో ప్రధానంగా వంగిన స్తంభాలు, వేలాడే వైర్లు, తుప్పుపట్టిన స్తంభాలను తొలిగించి కొత్తవి అమర్చుతారు. ఇలా ప్రతి శాఖ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. 


సంగారెడ్డిలో మంత్రి, మిగతా చోట ఎమ్మెల్యేలు

జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలుజోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ప్రారంభం కానున్నది. జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టణ ప్రగతిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పట్టణంలోని 8వ వార్డు నారాయణరెడ్డి కాలనీ చౌరస్తా నుంచి ఎల్లమ్మకట్ట మీదుగా సంజీవనగర్‌ కాలనీ వరకు పాదయాత్రలో పాల్గొంటారు. మిగతా మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులతో కలిసి కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. కలెక్టర్‌ మొదలుకుని అదనపు కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొనున్నారు. కాగా, ఇప్పటికే సంగారెడ్డిలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష జరుపారు. శనివారం పటాన్‌చెరులో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరిపారు. ఎంపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, కలెక్టర్లతో సహా అన్ని శాఖల అధికారులు హాజరైన విషయం తెలిసిందే. పల్లె ప్రగతి తరహాలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి సూచించిన విషయం తెలిసిందే.


సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

మున్సిపాలిటీల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పల్లెప్రగతిని రెండు సార్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకసారి 30రోజుల ప్రణాళిక, రెండోసారి 10 రోజుల పల్లెప్రగతి నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలో  జిల్లా రెండో స్థానంలో నిలువడం విశేషంగా చెప్పుకోవచ్చు. కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక చొరవతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి అద్భుతంగా కొనసాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజలు ఉత్సాహంగా పల్లెప్రగతిలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పల్లెప్రగతి జిల్లాలో కొనసాగిన నేపథ్యంలో అదే తరహాలో పట్టణ ప్రగతి జరుగాలని కలెక్టర్‌ హనుమంతరావు అందరికీ విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీల పరిధిలో అన్ని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ ప్రగతి సక్సెస్‌గా ముం దుకు సాగాలని కోరారు. మహిళ, యువత, రిటైర్ట్‌ ఉద్యోగుల, మేథావుల కమిటీలను ఎన్నుకున్నారు. అందుకు తోడు మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు స్పెషలాఫీసర్లను నియమించారు. ప్రత్యేక కమిటీలు, అధికారులు 10రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతిలో సమస్యల గుర్తింపు వాటి పరిష్కారానికి కృషి చేస్తారు.


logo