మంగళవారం 02 జూన్ 2020
Sangareddy - Feb 24, 2020 , 00:47:47

కమనీయం సంగమేశ్వరుడి కల్యాణం

కమనీయం సంగమేశ్వరుడి కల్యాణం
  • స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించిన జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి దంపతులు
  • భారీగా తరలివచ్చిన భక్తులు

కేతకీ సంగమేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఆదివారం నిర్వహించిన ఈ వేడుకకు జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై, స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తుల మధ్య నిర్వహించిన పార్వతీ  సంగమేశ్వరుడి కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. అంతకుముందు జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు, క్షీరాభిషేకం చేశారు. కాగా, తెల్లవారు జామున జరిగిన అగ్ని గుండం కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

- ఝరాసంగం


ఝరాసంగం: దక్షిణ కాశీగా బాసిల్లుతున్న  కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి కల్యాణం కమనీయంగా నిర్వహించారు. స్వామి కల్యాణానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కల్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామి కల్యాణానికి ముందు భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి జలలింగానికి పువ్వులు, ఆకులు, కొబ్బరికాయలు కొట్టి భక్షాలతో నైవేద్యం సమర్పించుకున్నారు. గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వరస్వామికి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ మండపం విద్యుత్‌ దీపాలు, పూలతో అలంకరించారు. పండితులు వేదమంత్రాలతో భక్తుల జయజయ ధ్వానాలు, భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణం కనుల పండువగా  సాగింది. పార్వతీ పరమేశ్వరులకు ఆలయ అర్చకులు ఒడిబియ్యం, పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం కల్యాణానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించుకున్నారు.  కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్‌రెడ్డి,  సర్పంచ్‌లు బొగ్గుల జగదీశ్వర్‌, పరమేశ్వర్‌, ఉప సర్పంచ్‌ మాణేమ్మ, తాసిల్దార్‌ తారాసింగ్‌, ఎంపీడీవో సుజాత, సీఐ కృష్ణకిశోర్‌, ఎస్‌ఐ ఏడుకొండలు, ఎంపీటీసీలు రజనీప్రియ, విజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల,గ్రామ పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్‌, ఇజాజ్‌బాబా, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి రాచయ్యస్వామి, కేతకీ మాజీ ఆలయ చైర్మన్లు బస్వరాజ్‌పాటిల్‌, హనుమన్నపాటిల్‌, టీఆర్‌ఎస్‌ నాయకలు నాగన్నపాటిల్‌, నాగన్నసజ్జన్‌శెట్టి, శివశంకర్‌, భక్తులు పాల్గొన్నారు.


జడ్పీ చైర్‌ పర్సన్‌ దంపతుల ప్రత్యేక పూజులు

మహాశిరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామిని దర్శించుకున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి దంపతులు గర్భగుడిలోని స్వామి వారికి  ప్రత్యేక పూజలు, అర్చనలు, క్షీరాభిషేకం చేశారు. 

అంతకు ముందు ఆలయ సిబ్బంది, అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకంతో పాటు అన్న పూజలు  చేయించారు. ఈవో మోహన్‌రెడ్డి, ఆలయం తరుఫున వారిని సన్మానించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. 


 కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు

ఝరాసంగంలోని కేతకీ వనంలో వెలిసిన పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారు జామున  బసవేశ్వరుడి ఆలయం ఎదుట అగ్ని గుండంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, అగ్గిలో నుంచి నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అమావాస్య  కలిసి రావడంతో వేలాది మంది భక్తులు  ఆలయానికి తరలి వచ్చారు. స్వామివారికి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అమృత గుండలో పుణ్యస్నానాలు చేశారు. అక్కడే ఉన్న జలలింగానికి పూజలు నిర్వహించి గర్భ గుడిలోని సంగమేశ్వర సమేత పార్వతీ దేవతలకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకం, ఆకులపూజ ,అన్నపూజలు భక్తులతో వేదపండితులు చేయించారు. అగ్ని గుండంలోని బస్మం (బూడిద)లను  భక్తులు ఇండ్లకు తీసుకెళ్లారు. 


logo