శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Feb 23, 2020 , 00:07:09

డబ్బులే డబ్బులు

డబ్బులే డబ్బులు

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతితో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ ఆదర్శంగా తయారు కావాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆకాంక్షించారు. పటాన్‌చెరు జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం జరిగిన ‘పట్టణ ప్రగతి’ సమీక్షలో ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు పట్టణ ప్రగతితో పట్టణాలు కొత్త రూపును సంతరించుకోవాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి మున్సిపాలిటీలకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. రెండు రోజుల్లో మార్చి నెల నిధులు కూడా విడుదల కానున్నాయని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రూ.12.81 కోట్లు నిధులు వస్తున్నాయని, ఇవి కాకుండా ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో రూ.109.73 కోట్లు రెడీగా ఉన్నాయని, ప్రణాళిక బద్ధంగా ఆ నిధులను ఖర్చు చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఏ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు విడుదల అయ్యాయో మంత్రి వెల్లడించారు.


నేడు సమావేశాలు ఏర్పాటు చేసుకోండి

ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆదివారం సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశాలకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు హాజరుకావాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్యలు ఏమిటి..? ప్రస్తుతం తక్షణమే పరిష్కారం అయ్యేవి ఏమిటో నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మహిళా, యువత, రిటైర్డ్‌ ఉద్యోగులు, మేధావులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే కమిటీల ఎన్నిక పూర్తయినట్లు సమాచారం ఉన్నది. లేనిచోట తక్షణమే కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పట్టణ ప్రగతి కొనసాగాలని, అన్నివర్గాల ప్రజలను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని మంత్రి పేర్కొన్నారు.


ప్రణాళిక బద్ధంగా నిధులు ఖర్చు చేయాలి

మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఖర్చుకాని నిధులు రెడీగా ఉన్నాయని, వాటికి తోడు రెండు నెలల నిధులు కూడా వస్తున్నాయని మంత్రి చెప్పారు. ఉన్న నిధులను ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేయించాలని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్లకు మంత్రి సూచించారు. మెదక్‌ మున్సిపాలిటీలో అత్యధికంగా రూ.23.32 కోట్లు, సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.16 కోట్లకు పైగా నిధులున్నాయని, మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావులు వాటిని అవసరమైన చోట వినియోగించేలా చూడాలన్నారు. అదేవిధంగా రెడీగా ఉన్న నిధులను, వచ్చిన నిధులను ఆయా మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులకు వాడాలన్నారు. తమ మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడంలో అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పోటీలు పడాలని మంత్రి కోరారు. కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టాలను ప్రతి ఒక్కరూ చదువాలని, అందులోని అంశాలపై అవగాహన అవసరమని హరీశ్‌రావు సూచించారు.


logo