శుక్రవారం 05 జూన్ 2020
Sangareddy - Feb 22, 2020 , T01:10

మట్టి రోడ్లకు మహర్దశ

మట్టి రోడ్లకు మహర్దశ

సంగారెడ్డి టౌన్‌ : గ్రామాల్లో ఉన్న మట్టి రోడ్లను తారు రోడ్లుగా మారనున్నాయి. వర్షాకాలంలో మట్టి రోడ్లతో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రజలు రోడ్లు బాగుచేయాలని కోరినా కరుణించిన వారే లేరు. ఇక గ్రామాల రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లాలోని గ్రామాల్లో ఎన్ని కిలోమీటర్ల మేర మట్టి రోడ్లు ఉన్నాయో గుర్తించిన అధికారులు ప్రధానమంత్రి సడక్‌ యోజన పథకం (పీఎంఎస్‌వై) కింద రోడ్ల నిర్మాణం చేపట్టనున్నది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీరాజ్‌ అధికారులు ప్రజల ఇబ్బందులను ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు అవసరం గుర్తించారు. పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అధికారులు పంపించారు. కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌వై పథకం కింద నిధులను విడుదల చేయగానే రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనున్నారు. దీని ద్వారా గ్రామాల్లోని మట్టి రోడ్లకు మహర్దశ పట్టనున్నది. 

మండల కేంద్రాలను కలుపుతూ ప్రతిపాదనలు..

జిల్లాలోని ఐదు నియోజకవర్గలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆయా గ్రామాల నుంచి నేరుగా మండల కేంద్రాలకు రోడ్లను అనుసంధానిస్తూ రోడ్లు వేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోల్‌, జహీరాబాద్‌, నర్సాపూర్‌(హత్నూర) నియోజకవర్గాలను కలుపుతూ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలో మూడు కిలో మీటర్ల నుంచి 10.61 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లు తారు రోడ్లుగా మార్చనున్నారు. కాగా, ఇందులో విడుతల వారీగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రోడ్లను ప్రస్తుతం ఎంపిక చేసి నివేదికలు పంపించారు. తారు రోడ్ల నిర్మాణంలో కేంద్రం 60శాతం వాటా, రాష్ట్రం 40 శాతం వాటాగా ఈ రోడ్లను నిర్మించనున్నారు. రోడ్ల నిర్మాణాలు పూర్తయితే గ్రామాల ప్రజలకు రోడ్ల సమస్య తొలిగిపోయి గ్రామాల్లో మట్టి రోడ్ల స్థానంలో తారు రోడ్లు నిర్మాణం జరుగుతున్నది. ఇదే కాకుండా సులువుగా మండల కేంద్రాలకు ప్రయాణం చేసే వీలు కలుగుతున్నది. ప్రజలు కోరుకున్న రోడ్ల నిర్మాణ కల నెరవేరుతున్నది. 

పీఎంజీఎస్‌ఐ కింద 114.23 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం

ప్రధానమంత్రి సడక్‌ యోజన పథకం(పీఎంజీఎస్‌ఐ) కింద  జిల్లాలో 114.23 కిలో మీటర్ల మట్టి రోడ్లకు మోక్షం లభించనున్నది. జిల్లాలోని అన్ని మండలాలు ఈ పథకం కింద కవర్‌ కానున్నాయి. సంగారెడ్డి మండలంలో పోతిరెడ్డి పల్లి జాతీయ రహదారి నుంచి మక్త అల్లూర్‌ 6 కిలో మీటర్ల, కంది మండలంలోని కంది తండా నుంచి శంకర్‌పల్లి 6 కి.మీ, కొండాపూర్‌ మండలంలోని పరమేశ్వర్‌ గుట్ట నుంచి కొండాపూర్‌ 7 కి.మీ, పటాన్‌చెరు మండలంలో ఇస్నాపూర్‌ చౌరస్తా నుంచి ఇంద్రకరణ్‌ 5.51 కి.మీ, ఇస్నాపూర్‌ చౌరస్తా నుంచి క్యాసారం జడ్పీ రోడ్డు 6.03 కి.మీ, జిన్నారం మండలం మాదారం నుంచి ఫార్మా కంపెనీ వరకు 3.91 కి.మీ, గుమ్మడిదల మండలం బొంతపల్లి నుంచి గుమ్మడిదల 3.35కి.మీ, లచ్చిరెడ్డి గూడెం నుంచి ప్యారానగర్‌ 3.89 కి.మీ, హత్నూర మండలం ఎస్‌ఎస్‌టీ రోడ్డు నుంచి చింతల్‌చెరువు 6.85 కి.మీ, మొగుడంపల్లి మండలం విట్టునాయక్‌ తండా నుంచి మొగుడం పల్లి 5.43 కి.మీ, న్యాల్‌కల్‌ మండలం పీడబ్య్లూడీ రోడ్డు నుంచి ఇబ్రహీంపూర్‌ 4.91 కి.మీ, హద్నూర్‌ నుంచి రాంతీర్థ్‌ 5.40 కి.మీ, కోహీర్‌ మండలం కోహీర్‌ రైల్వే గేట్‌ నుంచి రాజనెల్లి 3.94 కి.మీ, పుల్‌కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టు రోడ్డు ఎస్‌ఎస్‌ఏ నుంచి అల్మాయిపేట 5.8 కి.మీ, రాయికోడ్‌ మండలం రాయికోడ్‌ నుంచి రాఘవపూర్‌ 9.1 కి.మీ, సింగితం నుంచి మోరెట్‌గా 10.61 కి.మీ, నారాయణఖేడ్‌ మండలం మంగల్‌పేట్‌ నుంచి గానుకుల కుంట 6.74 కి.మీ, నాగిల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి నుంచి కర్ణాటక సరిహద్దు 6.5 కి.మీ, కల్హేర్‌ మండలం ఎస్‌ఎస్‌ఏ నుంచి మన్‌సాన్‌పల్లి 6.12 కి.మీ, నాగ్‌ధర్‌ నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు 4.3 కి.మీ, కంగ్టి మండలం నిజామాబాద్‌ సరిహద్దు నుంచి బాన్సువాడ 3.34 కి.మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. 


logo