ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Feb 22, 2020 , T00:50

శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు

శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు

అందోల్‌, నమస్తే తెలంగాణ: నియోజకవర్గ వ్యాప్తంగా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.  భక్తులు ఉపవాస దీక్షలను నియమనిష్టలతో చేపట్టి సాయంత్రం విరమించారు. అందోలు, పుల్కల్‌, రాయికోడ్‌, మునిపల్లి, వట్‌పల్లి, నర్సాపూర్‌ నియోజకవర్గంలోని హత్నూర మండలాల పరిధిలో శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.  ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జోగిపేటలోని జోగినాథ స్వామి ఆలయం, రాజరాజేశ్వరీ దేవాలయం, శివాలయం, మాణిక్‌ ప్రభు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.జోగిపేటలోని ఆర్యసమాజ్‌ మందిరంలో అఖండ గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించగా, ఈ యజ్ఞంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు పడిగె సుమిత్ర-సత్యం, రంగ సురేశ్‌-గీతా దంపతులు పాల్గొన్నారు.  రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద కౌన్సిలర్‌ నాగరాజ్‌ ఆధ్వర్యంలో భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.  

ఏడుపాయాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు కౌంటర్‌..

 మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఏడుపాయల జాతరకు  ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. జోగిపేట బస్టాండ్‌లో ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పా టు చేసి టికెట్లను అందిస్తున్నారు.  ఆర్టీసీ అధికారులు బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడంపై ప్రజ లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

హత్నూరలో.. 

 హత్నూర, దౌల్తాబాద్‌, కాసాల, వడ్డేపల్లి, కొన్యాల, మధుర, సిరిపురం, చింతలచేరు, చందాపూర్‌, రెడ్డికానాపూర్‌, గుండ్ల మానునుర్‌ తదితరల గ్రామాల్లోని శివాలయాల్లోని భక్తులు అభిషేకం చేశారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. శివదీక్ష స్వాములు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హత్నూరలోని శివాలయంలో నేడు శివపార్వతుల కల్యాణం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శివస్వాములు తెలిపారు. 

రాయికోడ్‌లో..

రాయికోడ్‌ : మండల కేంద్రంలో ఉన్న వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గణపతి పూజ, గోపూజ, అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.

పూజలు చేసిన ఎంపీ బీబీపాటిల్‌  

వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌  ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ బీబీపాటిల్‌ మాట్లాడుతూ  ఆలయాల అభివృద్ధికి  కృషి చేస్తానని చెప్పారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ వెంట జహీరాబాద్‌ సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్‌, మండల నాయకుడు నాగేంద్రర్‌పాటిల్‌ ఉన్నారు.

పుల్కల్‌లో..

పుల్కల్‌ : మండలం కేంద్రం, సిం గూర్‌ శివాలయం, ముద్దాయిపేట రా జరాజేశ్వర ఆలయం, చౌటకూర్‌ కాశీ విశ్వేశ్వర ఆలయం, కోర్పోల్‌ మహా దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడికి అభిషేకాలు చేశా రు. శివ్వంపేట మల్లికార్జునుడి ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  ఆలయ నిర్వాహకులు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిన్‌పూర్‌లో మల్లికార్జునికి బోనాలు నిర్వహిస్తారు.  

వట్‌పల్లిలో..

వట్‌పల్లి: మండలంలోని నాగులపల్లి, మర్వెల్లి, దుద్యాల తదితర గ్రా మాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఆలయల్లో పూజలు నిర్వహించిన అనంతరం దీక్షలను విరమించారు.  

ఎంపీని కలిసిన మహ్మద్‌నగర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌

కౌడిపల్లి :  మండలం మహ్మద్‌నగర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ బాన్సువాడ గోవర్ధన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ చిలుముల చిన్న చిన్నంరెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలను ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందజేశారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మెన్‌ చిలుముల చిన్నంరెడ్డి, వైస్‌ ఎంపిపి బొడ్ల నవీన్‌గుప్తా పాల్గొన్నారు.  


logo