ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Feb 21, 2020 , 06:02:43

నేడే మహాశివరాత్రి..

నేడే మహాశివరాత్రి..

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివాలయాలు కొత్తశోభ సంతరించుకున్నాయి. ఇప్పటికే ప్రత్యేక పూజల కోలాహలం నెలకొంది. నేటి తెల్లవారుజామున 3గంటలకు ప్రారంభమయ్యే అభిషేకాలు రోజంతా కొనసాగనున్నాయి.

  • ముస్తాబైన శివాలయాలు, ఘనంగా ఏర్పాట్లు
  • చెర్వుగట్టు, వాడపల్లి, పానగల్‌కు పోటెత్తనున్న భక్తులు
  • రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం
  • ఉపవాసం, జాగరణకు భక్తుల సన్నాహాలు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివాలయాలు కొత్తశోభ సంతరించుకున్నాయి. ఇప్పటికే ప్రత్యేక పూజల కోలాహలం నెలకొంది. నేటి తెల్లవారుజామున 3గంటలకు ప్రారంభమయ్యే అభిషేకాలు రోజంతా కొనసాగనున్నాయి. రాత్రి 7:30గంటలకు శివపార్వతుల కల్యాణం జరిపించనున్నారు. ఉపవాస దీక్షలు, జాగరణ ప్రత్యేకత కాగా.. భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చెర్వుగట్టు, వాడపల్లి, పానగల్‌లోని ఆలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ఆలయ కమిటీలు మౌలిక వసతులపై దృష్టి సారించాయి. తాగునీటి సౌకర్యం, 

షామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేశాయి. ట్రస్మా ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పానగల్‌లోని ఛాయ, పచ్చల సోమేశ్వరాలయాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.


రామగిరి :  అత్యంత శుభప్రదమైన వేడుక మహాశివరాత్రి. మాఘబహుళ చతుర్థి రోజున చంద్రుడు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రయుక్తుడైన రోజున ఈ వేడుక జరుపుకుంటారు. ముక్కంటిని దైవంగా భావించి హరహర మహాదేవ.. శంభాశంకర.. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో పరమేశ్వరుడిని ద్యానిస్తూ శివాలయాలను దర్శించే రోజు ఇదే కావడం విశేషం. అయితే శివపార్వతుల వివాహం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాలు గోచరిస్తున్నాయి. అందుకే దీన్ని ‘శివరాత్రి’ అని పిలుస్తుంటారు. ఈ వేడుకలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. తెలంగాణ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చెర్వుగట్టు, వాడపల్లిలోని శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి, మేళ్లచెర్వులోని స్వయంభు శంభులింగేస్వార స్వామి, పానగల్‌లోని సోమేశ్వర, పిల్లలమర్రి శివాలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. 


  ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కానీ 12 మాసాల్లో మాఘబహుళ చతుర్థి రోజున వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున శివపార్వతులు ఒకటై కల్యాణోత్సవం జరిగిన రోజని చెబుతుంటారు. అందుకే దీనికి అత్యంత ప్రశస్తి ఉంది. తెల్లవారుజామునే లేచి లింగస్వరూపుడైన పరమేశ్వరుడికి బిల్వ దళ, మహాన్యాసపూర్వక రుద్రాబిషేకాలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శివపురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా రాత్రి వేళ శివపార్వతుల కల్యాణోత్సవం, మహాశివరాత్రిరోజు అర్థరాత్రి 12 గంటల తర్వాత లింగోద్భవ కాలంలో అభిషేకాలకు ప్రాధాన్యత ఉంటుంది. జాగరణ కూడా శివరాత్రిలో ముఖ్యమే. 


శివరాత్రి చరిత్ర...

పురాణాల్లో మహాశివరాత్రి ఉద్భవం గురించి వర్ణించే అనేక ఇతిహాసాలున్నాయి. ఒక కథ ప్రకారం సముద్ర మదన సమయంలో ఒక విషపు కుండ సముద్రం నుంచి ఉద్భవించింది. ఆ విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు, రాక్షసులు భయబ్రాంతులకు లోనవుతారు. సాయం కోసం వీరంతా శివుడి వద్దకు వెళ్తారు. ఆ చెడు ప్రభావం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగి మింగకుండా గొంతులో ఉంచుకుంటాడు. దీంతో ఆయన గొంతు నీలంగా మారింది. దీని వల్ల ఆయన్ను నీలకంఠుడు అని పిలుస్తారు. అయితే శివుడు ఆ విషాన్ని మింగిన సందర్భంలోనే శివరాత్రి వేడుక జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఇలా ఎన్నో కథలు శివరాత్రికి చెప్పుకుంటారు. శివరాత్రి అంటే రాత్రంత శివుడిని ఆరాధించడం, శివుడి భజనలు, కీర్తనలు చేస్తూ పంచాక్షరితో జాగరణ చేయడంతో పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు. ఇలా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కంటే మాఘ బహుళ చతుర్థి రోజు వచ్చే శివరాత్రి ఎంతో విశిష్టమైందని చెప్పవచ్చు. 


రుద్రాభిషేకం.. 

వేదాల్లో ప్రత్యేక మంత్రమైన రుద్రసూక్తంగా పండితులతో మంత్రోచ్ఛరణ చేస్తూ శివలింగానికి ప్రాతః కాలంలో పవిత్రంగా చేసేది రుద్రాభిషేకం. అంతేకాకుండా మహాన్యాసంతో (నమకం, చమకం, స్త్రీ పురుష సూక్తులతో) మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తారు. ఇవన్ని శివుడికి అత్యంత ప్రీతికరమైన పూజా విధానాలు. పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు ఈ రోజు కావడం విశేషం. 


పంచాక్షరీ మంత్రం...

పంచాక్షరీ మంత్రం శివస్తోత్రాల్లో అత్యుత్తమమైంది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు అని అర్థం ‘న’ ‘మ’ ‘శి’ ‘వా’ య(ఓం నమః శివాయ) నిరంతరం శివరాత్రి రోజు భక్తితో పటిస్తే ఆ ముక్కంటి కరుణతో పాటు శివ సాయుజ్యం ప్రాప్తిస్తుంది. త్రయంబక మంత్రం, రుద్రమంత్రం కూడా జపిస్తారు. 

‘ ఓం త్రయంబకం యజామహే సుగందిం పుష్టి వర్థనం

ఉర్వారు కమిన బందానతు మృత్యోర్ముక్రియ మామృతాత్‌ ’ పఠించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. 


జాగరణ.. 

జాగరణ అంటే ప్రకృతిలో నిద్రానమై ఉన్న శివశక్తిని శివపూజ భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి శివ స్వరూపాన్ని దర్శించేలా చేయడం. మహాశివరాత్రి రోజు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు బోజన తాంబూలాలు స్వీకరించకుండా ఉపవాసం చేయాలి. తర్వాత రాత్రి శివుడిని దర్శించుకొని శివనామస్మరణతో నిద్రపోకుండా చేసేదాన్నే జాగరణ అంటారు. దీన్ని శివరాత్రి జాగరణ అని పిలుస్తారు. ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోను, తమ సొంత పంట పొలాల్లో మట్టితో పార్థివ శివలింగాన్ని తయారు చేసి పూజిస్తే పుణ్య ఫలం లభిస్తుందని పురాణాల్లో ఉంది. శివరాత్రి పూర్తయిన తర్వాత మరుసటి రోజు పరమేశ్వరుడికి అభిషేకం చేసి పూజ చేయడంతో జాగరణ, శివరాత్రి పూజ ముగుస్తుంది. పూర్వం గంగాయమున సంగమమైన ప్రయాగలో (నేటి అలహాబాద్‌) రుషులు ఈ జాగరణను చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.


logo