గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Feb 20, 2020 , 02:19:49

సాగుకు రక్ష భూసార పరీక్ష

సాగుకు రక్ష భూసార పరీక్ష
  • రైతులందరికీ భూసార పరీక్ష కార్డులు
  • పైలట్‌ ప్రాజెక్టుగా మండలానికో గ్రామం
  • గ్రామాల వారీగా మట్టి నమూనాల పరీక్షలు
  • జిల్లాలో ఇప్పటి వరకు 4,592 పరీక్షలు
  • ఫలితాలను రైతులకు అందజేసిన అధికారులు
  • సేంద్రియ ఎరువుల వాడకం లాభదాయకం

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: రైతన్నలు అధిక దిగుబడులు సాధించడానికి భూసార పరీక్షలు తప్పనిసరి. నేల సారాన్ని బట్టి ఏ కాలాల్లో ఎలాంటి పంటలు వేయాలనే విషయాలను ఈ భూసార పరీక్షల ద్వారా అధికారులు తెలుపుతారు. భూసార పరీక్షలు నిర్వహించి, ఫలితాల కార్డులను రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి మండల వ్యవసాయ అధికారులు గ్రామాలకు వచ్చి భూసారంపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. గ్రామాల వారీగా మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 4,592 మట్టి నమూనాలను ఎంపిక చేసిన అధికారులు ఫలితాలను రైతులకు అందజేశారు. కాగా, సంగారెడ్డి మండలంలో బుధవారం 2019-20కి గానూ పైలట్‌ గ్రామంగా ఎంపిక చేసిన నాగాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు హాజరై రైతులకు జాతీయ సుస్థిర వ్యవసాయ పథకంలో భాగంగా భూసార పరీక్ష ప్రాముఖ్యతను వివరించారు.


రైతులు భూసార పరీక్షలు చేయించుకుని అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. రైతులందరూ తమ భూమి సాంద్రతను తెలుసుకుని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో పంటలు వేసుకుంటే లాభాలు వస్తాయి. అందుకోసం రైతులందరికీ భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను ప్రభుత్వం అందజేసేందుకు కొత్తపథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని ప్రతి మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి మండల వ్యవసాయ అధికారులు గ్రామాలకు వచ్చి రైతులకు భూసారంపై శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల వారీగా మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి ఏ పంటలు వేసుకోవాలో అని అధికారులు సలహాలు ఇస్తున్నారు. దీంతో అధిక దిగుబడులతో సేంద్రియ ఎరువుల వాడకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం సంగారెడ్డి మండలంలో 2019-20కి గాను పైలట్‌ గ్రామంగా ఎంపిక చేసిన నాగాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు హాజరై రైతులకు జాతీయ సుస్థిర వ్యవసాయ పథకంలో భాగంగా భూసార పరీక్ష ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు మనోహరరావు, భూసార పరీక్ష కేంద్రం సహత, సంచాలకులు చంద్రజ్యోతి తదితరులున్నారు.


పరీక్షల ఆధారంగా పంటలు వేయాలి...

రైతులు భూసార పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని పంటలు వేయాలి. భూమి సాంద్రత, అధిక దిగుబడి సాధించడానికి ఆరోగ్యవంతమైన పంటలు పండించడం, రసాయన ఎరువుల ఖర్చు తగ్గించడం భూమిలో ఉన్న పోషక పదార్థాల స్థాయిని తెలుసుకోవడం చాలా అవసరం. సమస్యాత్మక భూములను సాగుయోగ్యం చేసుకోవడం, తగిన యాజమాన్య పద్ధతులు పాటించడం లాంటి విషయాలను భూసార పరీక్ష ఫలితాల కార్డులతో తెలుసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. జిల్లాలో ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల నుంచి 4,592 మట్టి నమూనాలను సేకరించి సంగారెడ్డి భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించి ఫలితాలను రైతులకు అధికారులు గ్రామాల వారీగా అందజేశారు. 


సేంద్రియ ఎరువులు వాడాలి...

రైతులు ప్రస్తుత కాలంలో అధిక దిగుబడులు సాధించాలనే తపనతో రసాయానికి ఎరువులు ఎక్కువ మోతాదులో వాడడంతో భూసాంద్రత తగ్గిపోతుంది. అదేవిధంగా అన్నదాతలు సేంద్రియ ఎరువులవాడకంపై దృష్టి సారిస్తే అధిక దిగుబడులతో పాటు భూమిసారం తగ్గిపోకుండా నేలస్వభావం మారిపోకుండా పంటకు తగిన మోతాదులో పోషకాలు లభించి అధికదిగుబడి వస్తుంది. అంతేకాకుండా పంటలకు చిడపీడల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటు పంటల పెట్టుబడి తగ్గడం, గిట్టుబాటు ధర లభించడంతో పాటు భూ కాలుష్యం నుంచి భూమికి విముక్తి కలుగుతుంది. రసాయన ఎరువులతో భూగర్భజలాల కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడి మానవుల అనారోగ్యానికి కారణాలుగా ఎన్నో పరీక్షల్లో తెలింది. గడిచిన రెండు దశాబ్దాల్లో చిడపీడలు పెరుగడానికి ఎరువుల యాజమాన్యలోపం ఒక కారణం అని శాస్త్రవేత్తలు నిర్ధారించారని వ్యవసాయ అధికారులు రైతులకు స్పష్టం చేశారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకుని సామగ్ర ఎరువుల వాడకాన్ని పెంచాలని అధికారులు రైతులను చైతన్యం చేస్తున్నారు.


సమతుల్య ఎరువులు వాడాలి...

రైతులు వేసిన పంటలకు కావాల్సిన పోషకాలు ఎక్కువ తక్కువ కాకుండా అవసరమైన సమయంలో అందుబాటులో ఉండే విధంగా అందించడానికి సమతుల్య ఎరువుల వాడకం పాటించాలి. ఈ ఎరువుల వాడకంపై రైతులకు సరైన అవగాహన లేనందువల్ల నత్రజని వినియోగం అధికమై మిగిలిన పోషకాలను అశ్రద్ధ చేయడంతో నేల ఫలదశ తగ్గిపోవడం చౌడుభారడం, పైరుకు చీడపీడలకు గురికావడం జరుగుతుందని అధికారులు రైతులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి రైతు భూసార పరీక్షల ఫలితాల కార్డులను తీసుకునిఉంటే వాటి ఆధారంగా అధికారులు చేసిన సిఫారసుల మేరకు ఎరువుల మోతాదులు వాడుకొని భూమి సాంద్రత, చీడపీడల నియంత్రణ, అధిక దిగుబడులను సాధించాలని అధికారులు రైతులకు సలహాలు, శిక్షణ తరగతులలో వివరాలు ఇస్తున్నారు.logo