శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Feb 18, 2020 , 23:45:41

ఉద్యోగుల సంక్షేమానికి ఆర్టీసీ సంక్షేమ బోర్డు

ఉద్యోగుల సంక్షేమానికి ఆర్టీసీ సంక్షేమ బోర్డు

సంగారెడ్డి టౌన్‌: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ బోర్డును డిపోల వారీగా ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు ప్రతి డిపో వద్ద ఈ బాక్స్‌లను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నది. ఈ నెల రోజుల నుంచి డిపోల్లో ఏర్పాటు చేసిన ఈ బాక్స్‌ల ద్వారా కార్మికులు అందించే దరఖాస్తులను స్వీకరిస్తున్నది. డిపోల వద్ద ఏర్పాటు చేసిన ఈ బాక్స్‌ల ద్వారా సమస్యలు, సలహాలు, సూచనలు ప్రతిరోజు స్వీకరిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం సంక్షేమ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించడంతో మంగళవారం మెదక్‌ రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల్లో సంక్షేమ బోర్డు మీటింగ్‌ నిర్వహించారు. 


మెదక్‌ రీజియన్‌లో సమావేశం..

మెదక్‌ రీజియన్‌ పరిధిలోని 8 ఆర్టీసీ డిపోల పరిధిలో మంగళవారం ఆర్టీసీ సంక్షేమబోర్డు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో నెలరోజుల పాటు ఈ బాక్స్‌ల్లో వచ్చిన సమస్యలు, సలహాలు, సూచనలను చర్చించారు. 8 డిపోల్లో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించారు. డిపో పరిధిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధగా 8 డిపోల పరిధిలో సంక్షేమ బోర్డు సభ్యుల సమావేశం రీజియన్‌ పరిధిలో ప్రతి నెలకోసారి నిర్వహించాలని, రెండు నెలలకోసారి జోనల్‌ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. 


ఈ బాక్స్‌లో 8 డిపోల్లో వచ్చిన 112 ఫిర్యాదులు...

మెదక్‌ రీజియన్‌ పరిధిలోని 8 డిపోల్లో ఏర్పాటు చేసిన ఈ బాక్స్‌లల్లో 112 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 105 ఫిర్యాదులను డిపో పరిధిలో పరిష్కరించారు. మరో నాలు గు ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచారు. అదే విధంగా డిపో పరిధిలో పరిష్కారం కాని మూడు ఫిర్యాదులను డీవీఎం, ఆర్‌ఎంలకు పంపించారు. స్వీకరించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. logo