శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Feb 18, 2020 , 23:44:33

‘కోవిద్‌-19’పై కంగారొద్దు

‘కోవిద్‌-19’పై కంగారొద్దు

సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రపంచాన్ని బయపెడుతున్న కోవిద్‌-19 వైరస్‌ గురించి జిల్లా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, కరోనా వ్యాధిగ్రస్తుడి నుంచి తుమ్మడం, దగ్గడం ద్వారా తుంపర్ల ద్వారా గాలి మార్గంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి ప్రబలుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ అన్నారు. మంగళవారం స్థానిక డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పటి వరకు 24 దేశాల్లో 26,554 కేసులు ‘కోవిద్‌-19’ వ్యాధి ప్రభలిందన్నారు. అందులో మన దేశంలో కేరళ రాష్ట్రంలో 3 కేసులు నమోదైయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు ఈ ‘కోవిద్‌-19’ వ్యాధికి ఉంటాయన్నారు. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాసరే 14 రోజులు ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచాలన్నారు. వీరి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు పంపించాలని తెలిపారు. 


ఎవరైనా ఈ నెల 15 తరువాత చైనా దేశంలోని వుహాన్‌ నుంచి మనదేశానికి వచ్చినట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 040-2465119కి కాల్‌చేసి సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు ఐహెచ్‌ఐపీ (ఇంటిగ్రేటేడ్‌ హెల్త్‌ ఇన్‌ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం) ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లా దవాఖానలో ‘కోవిద్‌-19’ కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇందుకు సంబంధించి డాక్టర్లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి సిద్ధంగా ఉంచామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఓ కాంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తూ సమాచారాన్ని సేకరించి, సలహాలు, సూచనలు ఇస్తుందన్నారు. అదేవిధంగా పరీక్ష కిట్లను గాంధీ దవాఖానలో అందుబాటులో ఉంచారని తెలిపారు. జిల్లా దవాఖానలో సిబ్బందికి (ఎన్‌ 95) మాస్కులను ఉంచామన్నారు. అనుమానిత కేసులను క్షేత్రస్థాయి సిబ్బంది 28 రోజులు వారిని పరిశీలిస్తుంటారని తెలిపారు. ఇందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. అలాగే అనుమానిత కేసుల రవాణా కోసం శిక్షణ ఇవ్వబడిన అంబులెన్స్‌ సిబ్బంది, రక్తనమూన సేకరణ కోసం టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ వ్యాధిపై ఎవరికీ భయం అవసరం లేదని, తుమ్మినా, దగ్గినా చేతిరూమాలును అడ్డుపెట్టుకోవాలని తెలిపారు. తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని, వ్యాధి గ్రస్తుడిని తాకినా చేతులు శుభ్రం చేసుకోకుండా కండ్లు, ముక్కు, నోరు, మూఖాన్ని చేతులతో తాకరాదని సూచించారు. అనుమానితులకు వెంటనే దవాఖానకు పంపించాలని ఆయన కోరారు.