సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Feb 18, 2020 , 00:52:04

గిరిజన విద్యార్థులు దేనికి తీసిపోరు

గిరిజన విద్యార్థులు దేనికి తీసిపోరు

గిరిజన విద్యార్థులు దేనికి తీసిపోరని, ఇందుకు మాలవత్‌ పూర్ణ నిదర్శనమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జిన్నారం గిరిజన గురుకుల రెసిడెన్షియల్‌ కళాశాల, పాఠశాలలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.

  • గిరిజన మంత్రిగా అవకాశం ఇచ్చిన
  • సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
  • సీఎం కేసీఆర్‌ నిండు నూరేండ్లే
  • ఆయురారోగ్యాలతో ఉండాలి
  • గిరిజన గురుకుల పాఠశాల సభలో
  • గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌
  • గిరిజన భాషలో మాట్లాడి
  • విద్యార్థులను ఉత్సాహ పరిచిన మంత్రి

జిన్నారం : గిరిజన విద్యార్థులు దేనికి తీసిపోరని, ఇందుకు మాలవత్‌ పూర్ణ నిదర్శనమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జిన్నారం గిరిజన గురుకుల రెసిడెన్షియల్‌ కళాశాల, పాఠశాలలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. గురుకుల అడిషనల్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే గురుకులంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌ లావణ్య అధ్యక్షతన నిర్వహించిన సభను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభా వేదికపై గిరిజన విద్యార్థులతో కలిసి సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు ఆమె తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాటాడుతూ గిరిజన గురుకుల విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు రుణపడి ఉంటామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతున్ని వేడుకుంటున్నానని తెలిపారు. గురుకుల పాఠశాలకు అప్పుడప్పుడు వచ్చి పరిశీలించాలని మంత్రి కలెక్టర్‌ను కోరారు. గురుకులంలో సదుపాయాలు బాగున్నాయా..? మెను ప్రకారం భోజనం ఇస్తున్నారా..? అని మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్‌ను జిన్నారం సర్పంచ్‌ లావణ్య, ఉపసర్పంచ్‌ సంజీవ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కలిసి గురుకులంలో ఓసీ, బీసీ విద్యార్థులకు సీట్ల శాతాన్ని పెంచాలని వినతిపత్రాన్ని అందజేశారు.


గిరిజన భాషలో ముచ్చటించిన మంత్రి..

సభలో తెలుగులో మాట్లాడిన మంత్రి సత్యవతిరాథోడ్‌ విద్యార్థులతో కొద్దిసేపు గిరిజన భాషలో మాట్లాడి అలరించారు. దీంతో విద్యార్థులు సంతోషంతో చప్పట్లు కొట్టారు. విద్యార్థులతో మంత్రి గిరిజన భాషలో మాట్లాడుతుంటే అక్కడే ఉన్న గిరిజన ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, స్టేజీ మీద ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల మొఖంలో సంతోషం కనిపించింది. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ లావణ్య, గురుకుల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ సుధాకర్‌, గురుకుల ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, తహసీల్దార్‌ దశరథ్‌, ఎంపీడీవో సుమతి, ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్‌, లావణ్య, సర్పంచ్‌లు ఆంజనేయులు, శివరాజ్‌, వావిలాల పీఏసీఎస్‌ చైర్మన్‌ శంకర్‌రెడ్డి, సోలక్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేశ్‌, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సార నరేందర్‌, ఉపసర్పంచ్‌ సంజీవ, జీవన్‌, భవానీరమేశ్‌, వెంకటేశ్‌, మోహన్‌, రామకృష్ణ, నిఖిల్‌గౌడ్‌, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. 


మీలాగే నేను ఒక తండాలో పుట్టి పెరిగాను.. 

మీ అందరిలాగే నేను కూడా ఓ తండాలో పుట్టి పెరిగానని, చదువు మధ్యలో ఆపేసి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి సత్యవతి రాథోడ్‌ గిరిజన గురుకుల విద్యార్థులకు తన గురించి వివరించారు. ‘రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పనిచేశానని తెలిపారు. గిరిజన జాతిని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ తన క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం ఇచ్చారని, తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. క్యాబినెట్‌లో నేనే మొదటి మహిళా మంత్రినని. తనపై నమ్మకంతో మంత్రిగా బాధ్యతలను ఇచ్చినందుకు తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున మొక్కలు నాటడం సంతోషంగా ఉందనన్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే కానుకు ఇవ్వాలని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో సంవత్సరానికి ఒక్కో విద్యార్థికి రూ.లక్షా ఇరవై ఐదు వేలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. విద్యార్థులందరూ బాగా కష్టపడి చదువుకోవాలని సూచించారు.  అనంతరం నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. 


కార్పొరేట్‌ను తలదన్నేలా  గురుకులాలు ఉన్నాయి : కలెక్టర్‌ 

ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలు కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలను తలదన్నేలా ఉన్నాయన్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌ అంటే అపార్ట్‌మెంట్‌ విద్య అయ్యిందన్నారు. జిన్నారంలో అద్భుతమైన పాఠశాల, మంచి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. రాజేంద్రనగర్‌లో 60 మంది గురుకుల విద్యార్థులకు ఐఐటీ, నిట్‌లో శిక్షణ ఇస్తే 58 మంది ఎంపిక కావడం చాలా గొప్ప విషయమన్నారు. రాజేంద్రనగర్‌లో అద్భుతమైన కోచింగ్‌ ఉందని, ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ శిక్షణ తీసుకొని ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని సూచించారు.


గురుకులాల అభివృద్ధికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం : గురుకుల అడిషనల్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌

గురుకుల పాఠశాలలు, కళాశాలలపై మంత్రి సత్యవతిరాథోడ్‌ ప్రతినెలా రివ్యూ చేస్తూ గురుకులాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సహకారం అందిస్తూ మమల్ని ఉత్సాహంగా పని చేయిస్తున్నారనని తెలిపారు. తామంతా రెట్టింపు ఉత్సాహంతో గురుకులాల కోసం పని చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 54 గురుకులాలు, 22 డిగ్రీ కళాశాలలు మంజూరు అయ్యాయని, ఐఐటీ కోచింగ్‌ కోసం సీవోఈగా అప్‌గ్రేడ్‌ అయ్యాయని తెలిపారు. అలాగే 25 పాఠశాలల్లో మినీ స్పోర్ట్స్‌ అకాడమీలను ఏర్పాటు చేశామన్నారు. అండర్‌-19లో ఇండియా జట్టుకు గురుకులాల నుంచి విద్యార్థులు, కొత్తగా 4 వేల మంది టీచర్లు ఎంపికయ్యారని గుర్తు చేశారు. ఐఐటీ, మెడిసిన్‌లో వంద మంది విద్యార్థులకు సీట్లు వచ్చాయని తెలిపారు. 


logo