శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Feb 15, 2020 , 23:41:18

గులాబీ జైత్రయాత్ర

గులాబీ జైత్రయాత్ర
  • టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల విజయదుందుభీ
  • పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలో 8 పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ కైవసం
  • 30,663 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు..
  • 36,720 మంది ఓటర్లకు....
  • 83.5 శాతం పోలింగ్‌ నమోదు
  • పుల్కల్‌ పీఏసీఎస్‌ను కైవసం చేసుకున్న బీజేపీ
  • 14 చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులు
  • 38 పీఏసీఎస్‌లలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు స్పష్టమైన మెజార్టీ
  • జిల్లాలో మొత్తం 53 పీఏసీఎస్‌లు

‘సహకార’ పోరులోనూ గులాబీ పార్టీ జైత్రయాత్ర కొనసాగించింది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు మొదలుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, మున్నిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే విజయాలు వరించగా, సహకార సంఘాల ఎన్నికల్లోనూ విజయ దుందుభీ మోగించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు శనివారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 53 సొసైటీల్లో 680 డైరెక్టర్‌ స్థానాలుండగా, 262 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. మిగతా 417 స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగగా, 83.5 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 30,663 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గెలుపొందిన డైరెక్టర్లకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కాగా, నేడు చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.  

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ విజయాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు మొదలుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే విజయాలు వరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కూడా గులాబీ హవా అలాగే కొనసాగింది. జిల్లాలో 53 సంఘాలుండగా, 38 సంఘాలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకు కైవసం చేసుకోవడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ 14 సంఘాల్లో సత్తాచాటుకునే ప్రయత్నం చేసింది. అనూహ్యంగా పుల్కల్‌ పీఏసీఎస్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం. అయితే ఇందులో ఎన్ని సంఘాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు చైర్మన్లు అవుతారో ఇంకా స్పష్టత లేదు. మొత్తంగా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. మొత్తం 53 సంఘాల్లోని 680 డైరెక్టర్‌ స్థానాలుండగా, 262 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా ఎక్కడా చిన్న ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 83.5 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. కాగా, గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువీకరణ పత్రాలు అందించడంతో పాటు ఆదివారం నిర్వహించే చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు హాజరుకావాలని అధికారులు నోటీసులు అందించారు.

పటాన్‌చెరులో క్లీన్‌ స్విప్‌...

పటాన్‌చెరు సబ్‌డివిజన్‌ పరిధిలో ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా, అన్నింటినీ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కైవసం చేసుకోవడం విశేషం. ఈ డివిజన్‌ పరిధిలో వాయిలాల, ముత్తంగి, రుద్రారం, సోలక్‌పల్లి, పటాన్‌చెరు, తెల్లాపూర్‌, బానూరు, గుమ్మడిదల పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఇందులో గుమ్మడిదల, బానూరులు పూర్తిస్థాయిలో ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్లా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు చైర్మన్లు కానున్నారు. కాగా, శనివారం జరిగిన మిగతా 6 పీఏసీఎస్‌లలో కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొందడం గమనార్హం. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అందోలు-జోగిపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 5, కాంగ్రెస్‌ 2 పీఏసీఎస్‌, బీజేపీ ఒక పీఏసీఎస్‌లను కైవసం చేసుకున్నాయి. అలాగే నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ 10, కాంగ్రెస్‌ 2, జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 8, సంగారెడ్డి డివిజన్‌లో 9 టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ 2 పీఏసీఎస్‌లను కైవసం చేసుకున్నాయి.

నేడు చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక

ఆదివారం ఆయా పీఏసీఎస్‌ల వద్ద చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. డైరెక్టర్లుగా గెలుపొందిన వారికి శనివారం అధికారులు ధ్రువపత్రాలు అందించారు. వాటితో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు హాజరుకావాలని అందరికీ నోటీసులు కూడా అందించారు. ఉదయం 9 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకానున్నది. డైరెక్టర్లు ఉదయం 8.30 గంటలకు ఆయా పీఏసీఎస్‌ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. కోరం లేని పరిస్థితుల్లో మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుందని జిల్లా సహకార అధికారి ప్రసాద్‌ తెలిపారు. బాధ్యతలు తీసుకున్న అధికారులు ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ఆదివారం చేపట్టాలని సూచించారు.

30,663 మంది ఓటేశారు...

సహకార శాఖ పరిధిలో జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట సబ్‌డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. 680 డైరెక్టర్‌ స్థానాలుండగా, 262 ఏకగ్రీవమయ్యాయి. 8 పీఏసీఎస్‌లు పూర్తిస్థాయిలో ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. కాగా, డైరెక్టర్‌ స్థానాలను మినహాయిస్తే 417 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 417 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఆయా డైరెక్టర్‌ స్థానాల్లో మొత్తం 36,720 మంది ఓటర్లుండగా, 30,663 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు ముందురోజే అంటే శుక్రవారం సాయంత్రమే సామగ్రితో గ్రామాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడంతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ ముగిసింది. 


logo