శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Feb 14, 2020 , 23:22:05

సీఎం కేసీఆర్‌కు హరిత కానుక

సీఎం కేసీఆర్‌కు హరిత కానుక

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకుని హరిత శుభాకాంక్షలు చెప్పడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం పుట్టిన రోజున పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్‌ అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 10 వేల మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

  • 17న ముఖ్యమంత్రి పుట్టిన రోజు
  • అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్‌ హనుమంత రావు
  • అనంతరం కలెక్టరేట్‌లో పల్లెప్రగతిపై మంత్రి సమీక్ష
  • ముఖ్యఅతిథిగా రానున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
  • ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొనేలా చర్యలు
  • అదే రోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో 10వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పడానికి, జిల్లా అధికార యంత్రాంగం హరిత కానుకను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం పుట్టిన రోజున పెద్దఎత్తున మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్‌ అన్నివర్గాల వారికి పులుపునిచ్చిచారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని పెద్దసంఖ్యలో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 10 వేల మొక్కలు ఒకేసారి నాటనున్నారు. కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం కలెక్టర్‌ అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.కాగా, సంగారెడ్డిలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలు పాల్గొనేలా చూస్తున్నారు. సైరన్‌ ద్వారా పట్టణంలో అన్నిచోట్ల ఒకేసారి మొక్కలు నాటాలా..? మరో విధంగానా..? అనే అంశాలపై అధికారులతో కలెక్టర్‌ చర్చిస్తున్నారు. ఎక్కడా ఇబ్బంది రాకుండా కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 


పల్లెప్రగతిపై ప్రజాప్రతినిధులతో సమీక్ష

సీఎం పుట్టిన రోజునే సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్‌రావు పల్లెప్రగతిపై సమీక్షించనున్నారు. పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తైన తర్వాత మంత్రితో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నేరుగా కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. అన్ని శాఖల అధికారులతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు సమీక్షకు హాజరుకానున్నారు. ఇప్పటికే జిల్లాలో 30, 10 రోజుల పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లాలకు మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేటలకు మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. 17న నిర్వహించనున్న సమీక్షలో పల్లెప్రగతి లక్ష్యాలను ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించనున్నారు. కాగా, ఇప్పటికీ నిర్వహించిన 30, 10 రోజుల పల్లెప్రగతి జిల్లాలో సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యేలా కలెక్టర్‌ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 


మంత్రి కేటీఆర్‌ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా..

సీఎం పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటాలని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు యువత, విద్యార్థులు, ఇతరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మొక్కనాటి సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతామని యువత ఉత్సాహంగా ఉన్నది. ఇదిలా ఉండగా, ఇప్పటికే గ్రీన్‌ చాలెంజ్‌ నిర్వహిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న ఎంపీ సంతోశ్‌కుమార్‌ కూడా 17న మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా 17న తమ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


logo