గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Feb 14, 2020 , 23:20:33

ఇసుక మాఫియా ఆగడాలు

ఇసుక మాఫియా ఆగడాలు
  • ఇసుక అక్రమ రవాణాను
  • హనుమాన్‌నగర్‌, ఇస్మాయిల్‌ఖాన్‌పేట,
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • ముఖాలకు మాస్కులు ధరించిన దుండగులు
  • అడ్డుకున్నందుకు వీఆర్వో బైక్‌ దహనం
సంగారెడ్డి రూరల్‌ : ఇసుక అక్రమ రవాణాదారులు మాఫియా అవతారమెత్తారు. వారి ఆగడాలు శృతి మించుతున్నాయి. ప్రభుత్వ భూముల నుంచి ఇసుక, మట్టి అక్రమంగా రవాణా చేస్తూ లక్షల్లో సంపాదనకు అలవాటు పడుతున్న అక్రమార్కులు తమకు అడ్డొచ్చిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, గౌడిచర్లలో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల నుంచి ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటున్నాడనే కారణంగా వీఆర్వో బైక్‌ను ముసుగు ధరించి వచ్చిన ఇసుకమాఫీయా తగులబెట్టడం చర్చనీయాంశమైంది. వీఆర్వో వాహనాన్ని వదిలి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకోగా బైక్‌ మాత్రం అగ్నికి ఆహుతయ్యింది. కొంతకాలంగా మూడు గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతుందని అందిన ఫిర్యాదుల మేరకు ఆర్డీవో, తహసీల్దార్‌, వీఆర్వో ఆ గ్రామాలను పరిశీలించి వచ్చిన మరుసటి రోజే దుండగులు బైక్‌ను తగులబెట్టడం గమనార్హం. సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. 

కొంతకాలంగా సంగారెడ్డి మండలంలోని హనుమాన్‌నగర్‌, ఇస్మాయిల్‌ ఖాన్‌పేట, గౌడిచర్ల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతున్నది. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రైవేట్‌ భూముల నుంచి భారీ జేసీబీ యంత్రాలతో ఇసుకను తీసి లారీలు, ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూడు గ్రామాల్లోని పలువురు వ్యక్తులు ఓ గ్రూపుగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. పలుకుబడి ఉన్నవారు కావడంతో వీరి అక్రమ దందాకు ఎవరు అడ్డు చెప్పడం లేదు. ఒకవేళ అడ్డు చెబితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల నుంచి ఇసుక, మట్టిని తీస్తున్న అక్రమార్కులు దానిని లారీలు, ఇతర వాహనాల్లో అర్ధరాత్రి వేళ పటాన్‌చెరు మీదుగా హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా కొంత కాలంగా వీరి వ్యాపారం లక్షల్లో కొనసాగుతున్నది. అయితే వీరి అక్రమ ఇసుక దందాతో గ్రామాల్లో రోడ్లు ధ్వంసం కావడంతోపాటు భూములు పాడవుతున్నాయి. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. సోషల్‌ మీడియాలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 

ఆర్డీవో పరిశీలించి వచ్చిన మరుసటిరోజే..

మూడు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో సంగారెడ్డి ఆర్డీవో నగేశ్‌, తహసీల్దార్‌ స్వామి, వీఆర్‌వోలు గురువారం గ్రామాలను పరిశీలించారు. ఇసుక రవాణా ప్రాంతాలను స్వయంగా చూశారు.  ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, వాహనాలు రాకుండా చూడాలని వీఆర్‌వో పెంటయ్యను ఆర్డీవో నగేశ్‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక రవాణా జరగవద్దని సూచించారు. దీనితో వీఆర్వో పెంటయ్య శనివారం ఉదయం బైక్‌పై ఇస్మాయిల్‌ఖాన్‌ పేటలోని ఇసుక రవాణా అవుతున్న ప్రాంతాలకు బయలుదేరాడు. అతనికి నలుగురు వ్యక్తులు అడ్డంగా వచ్చి వాహనాన్ని నిలిపివేశారు. అందరూ ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు.


వారిని చూడగానే పెంటయ్య భయపడి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు బైక్‌ను వేగంగా పక్కకు తిప్పాడు. దీనితో వాహనం కిందపడి పోయింది. భయంతో బైక్‌ను అక్కడే వదిలి పరుగులు పెట్టాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి బైక్‌కు నిప్పంటించారు. వాహనం పూర్తిగా అంటుకున్నది. వీఆర్వో అక్కడి నుంచి ఆర్డీవో, తహసీల్దార్‌, పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి చూసేసరికి వాహనం పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసిన సంగారెడ్డి రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కాగా ఇసుక మాఫీయాపై కఠినంగా వ్యవహరించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. వాల్టా చట్టానికకి తూట్లు పొడుస్తున్న అక్రమార్కులపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.


logo