మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Feb 13, 2020 , 23:10:51

రూ.207 కోట్లతో ఐస్‌క్రీం ప్లాంట్‌

రూ.207 కోట్లతో ఐస్‌క్రీం ప్లాంట్‌

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఉత్సా హం చూపుతున్నాయి. పరిశ్రమలు, ఐటీ, మున్సి పల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహించడంతో జహీరాబాద్‌ ప్రాంతానికి భారీ పరిశ్రమ వచ్చింది. మండలంలోని గోవింద్‌పూర్‌ శివారులో హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌ సంస్థ రూ.207 కోట్ల పెట్డుబడులతో దేశంలోనే ఆతిపెద్ద ఐస్‌క్రీం తయారీ ప్లాంట్‌ నిర్మాణం చేస్తున్నది. ఐస్‌క్రీం పరిశ్రమ నిర్మాణంతో జహీరాబాద్‌ ప్రాంతంలో ఉన్న 4 వేల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. పరిశ్రమల్లో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పరిశ్రమ అధికారులు తెలిపారు. గోవింద్‌పూర్‌లో నిర్మాణం చేసే ప్లాంట్‌లో రోజుకు 100 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. ఐస్‌క్రీం ఉత్పత్తులను ప్లాంట్‌లో అక్టోబర్‌ నుంచి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. 


హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌  సంస్థ రూ.207 కోట్లు పెట్టుబడులు

గోవింద్‌పూర్‌ శివారులో హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌ సంస్థ రూ.207 కోట్లతో ఐస్‌క్రీం పరిశ్రమను నిర్మాణం చేస్తున్నది. 120 ఎకరాల్లో ఐస్‌క్రీం ప్లాంట్‌ను నిర్మాణం చేస్తున్నారు. జహీరాబాద్‌ పట్టణానికి 12 కిలోమీటర్లు దూరంలో పరిశ్రమను స్థాపిస్తున్నారు. పరిశ్రమల్లో ప్రత్యేక్షంగా 500 మంది, పరోక్షంగా 2వేల మందికి ఉపాధి లభిస్తున్నదని అధికారులు తెలిపారు. పరిశ్రమ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్‌లో ప్లాంట్‌లో ఉత్పత్తులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ప్లాంట్‌ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఐస్‌క్రీం పరిశ్రమ వారు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ప్రతిరోజు వేల లీటర్లు పాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 


దేశం వ్యాప్తంగా ఉత్పత్తులు సరఫరాకు సిద్ధం

గోవింద్‌పూర్‌ ఐస్‌క్రీం ప్లాట్‌లో ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీంను దేశంలోని పలు రాష్ర్టాలకు సరఫరా చేస్తారని అధికారులు వివరించారు. ఐస్‌క్రీం ఉత్ప త్తి చేసేందుకు కావాల్సిన ముడి సరుకు జహీరాబాద్‌ ప్రాంతంలోనే కొనుగోలు చేస్తారని వివరించారు. ఐస్‌క్రీం ఉత్పత్తి చేసేందుకు నీరు సైతం అనుకూలంగా ఉందన్నారు. జాతీయ రహదారికి 12 కిలో మీటర్లు దూరం, రైల్వే స్టేషన్‌  12 కిలో మీటర్లు ఉండడంతో ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీంను రవాణా చేసేందుకు అనుకూలంగా ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు రోడ్డు, రైలు సౌకర్యం ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు జహీరాబాద్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గోవింద్‌పూర్‌లో భారీ ఐస్‌క్రీం పరిశ్రమ ఏర్పాటు చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


logo