గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Feb 13, 2020 , 23:07:46

అన్నింటిలో మేటి..ఐఐటీ హైదరాబాద్‌

అన్నింటిలో మేటి..ఐఐటీ హైదరాబాద్‌

కంది, నమస్తేతెలంగాణ : ఐఐటీ హైదరాబాద్‌. ఈ పేరు చెప్పగానే విద్యార్థుల మనస్సుల్లో అక్కడ ఒక్క సీటు సంపాదిస్తే చాలు అనే ఆశ కలుగక మానదు. ఇదో రంగుల ప్రపంచం. ఇక్కడ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలను రూపొందించి వాటికి ప్రాణం పోస్తుంటారు. పరిశోధనల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలువాలన్న లక్ష్యంతోనే ఇక్కడి అధ్యాపకుల బృందం సహా ఇదే క్యాంపస్‌లో విద్యనభ్యసించే విద్యార్థులు సంకల్పించుకొని మరీ ముందుకు సాగుతున్నారు. అంశం ఏదైనా సరే మేమున్నామంటూ తమ ప్రతిభాపాఠవాలను బయటికి తీసి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. దేశంలో ఎక్కడెక్కడినుంచో వచ్చిన వీరందరూ మేమంతా ఒకటే మా లక్ష్యమొకటే అన్న నానుడితో తమదైన శైలీలో సత్తా చాటుతున్నారు.


స్థాపించిన నాటి నుంచి సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలతో దూసుకెళ్తూ దేశంలో ఉన్న మొత్తం 22 ఐఐటీల్లో ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌ 8వ స్థానంలో ఉంది. అలాగే రెండో తరం స్థాపింపబడ్డ ఐఐటీల్లో మన ఐఐటీ హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచి అందరి చూపును ఆకట్టుకుంటుంది. రోజుకో కొత్త అంశాలు, కొత్త ఆవిష్కరణలు, కొత్త పరిశోధనలతో విద్యార్థులు, ఇక్కడి ఫ్యాకల్టీ ముందుకు సాగుతుండడంతో ప్రస్తుతం ఈ క్యాంపస్‌ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. వారం రోజుల క్రితమే ఐఐటీ హైదరాబాద్‌, తమ అంకుర సంస్థ అయిన ప్యూఈవీ ఎనర్జీ బ్యాటరీ సంస్థ కలిసి సంయుక్తంగా రూపొందించిన కొత్త రకం ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఇప్లూటో 7జీ పేరుతో దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఐఐటీహెచ్‌లో జరుగుతున్న పరిశోధనలు, ప్రత్యేకతలు, ఇతర కార్యక్రమాలపై ‘నమస్తేతెలంగాణ’ ప్రత్యేక కథనం.. 


 అత్యాధునిక క్యాంపస్‌ 

సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో 2008లో ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. మొత్తం 570 ఎకరాల సువిశాల స్థలంలో దాదాపు 1,336 కోట్ల వ్యయంతో పూర్తి స్థాయి క్యాంపస్‌ను విద్యార్థులకు సౌకర్యవంతంగా, అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా మిగతా క్యాంపస్‌ పనులు ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో మొత్తం 2,855 మంది విద్యార్థులు వివిధ కోర్సులో విద్యనభ్యసిస్తుండగా 210 మంది పూర్తి స్థాయి ఫ్యాకల్టీ ఇక్కడ పని చేస్తుంది. ఇప్పటి దాకా ఐఐటీ హైదరాబాద్‌ గత డైరెక్టర్‌ యూబీ.దేశాయ్‌, ప్రస్తుత డైరెక్టర్‌ బీ.ఎస్‌.మూర్తి నేతృత్వంలో యూఎస్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌, యూరోప్‌ వంటి 50కి పైగా యూనివర్సిటీలతో పరిశోధనల్లో భాగంగా పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులకు బయటికి వెళ్లే ఇబ్బందులు లేకుండా క్యాంపస్‌లోనే అన్ని రకాల సూపర్‌మార్కెట్‌, ఆమూల్‌ సెంటర్‌, బ్యాంక్‌, 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ క్యాంపస్‌ గురించి చెప్పాలంటే ఇదొక రంగుల ప్రపంచమనే చెప్పొచ్చు. ఒక్కసారి ఇందులోకి ప్రవేశిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనంత అందంగా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దారు.


అటు గ్రీన్‌.. ఇటు ఆదర్శం.. 

ఐఐటీ అంటే కేవలం చదువులు, పుస్తకాలు, పరిశోధనలే కావు మేము కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తామని ఇక్కడి క్యాంపస్‌ విద్యార్థులు, అధ్యాపక బృందం రుజువు చేసుకుంటున్నారు. పర్యావరణ హితం కోరి ఇక్కడ వారానికి ఒకరోజు గ్రీన్‌ డేగా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్‌ వేస్ట్‌ ఫ్రీ క్యాం పెయిన్‌ పేరుతో తాజాగా ఐఐటీలోని హాస్టల్‌, అకాడమిక్‌ బ్లాక్‌, క్యాంటీన్‌, మెస్‌ ఏరియా ల్లో పడేసిన ప్లాస్టిక్‌ను తీసి ఆ ప్రాంతాలను శుభ్రం చేశారు. సేకరించిన ప్లా స్టిక్‌ వ్యర్థాలను  రీసైకిల్‌ చేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. 


పండుగలు.. వినోదాలు.. 

ఐఐటీ హైదరాబాద్‌లో దేశంలోని అన్ని ప్రాంతాకు చెందిన వారు ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. అయితే ఇక్కడ చదివే విద్యార్థులు మామూలుగా ప్రతి పండుగలకు, పబ్బాలకు ఇంటికి వెళ్లే అవకాశం అంత ఇజీగా ఉండదు. వీరికి ఉన్న టార్గెట్‌ను బట్టి ఎంతో పట్టుదలతో చదివితే గాని అనుకున్న డిగ్రీ పట్టా చేతికిరాదు. ఈ సందర్భంగా ఏవైనా పండుగలు వస్తే అందరూ కలిసి ప్రతి ఒక్క పండుగను ఇక్కడే జరుపుకుంటారు. ఒకరి పండుగలు ఇంకొరికి తెలుపుతూ వారి విశిష్టతలు, విశేషాలు వివరిస్తూ ఆనందంగా గడిపేస్తారు. చదువులకే పరిమితం కాకుండా ఖాళీ సమయాల్లో ఆట పాటలు, మస్తీ మజా హుషారు కార్యక్రమాలతో ఆనందంగా గడపడం ఇక్కడి విద్యార్థుల పరిపాటి.


పరిశోధనల్లో దూసుకుపోతూ.. 

స్థాపించిన నాటి నుంచి ఐఐటీ హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల కృషే అందుకు ప్రధాన కారణం. కొత్త కొత్త పరిశోధనలకు, ఆవిష్కరణలకు కేర్‌ఆఫ్‌ అడ్రస్‌గా ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఐఐటీ హైదరాబాద్‌, తమ అంకుర సంస్థ అయిన ప్యూఈవీ ఎనర్జీ బ్యాటరీల సంస్థ సంయుక్తంగా ఈప్లూటో 7జీ పేరుతో భారతీయ మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రికల్‌ వాహనాన్ని విడుదల చేసింది. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుండడంతో సంస్థ సభ్యులు, ఐఐటీయన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


నేటి నుంచి మూడు రోజుల పాటు ఎలాన్‌, ఎన్‌విజన్‌ ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఐఐటీ 

హైదరాబా ద్‌లో ఎలాన్‌, ఎన్‌విజన్‌ 2020 పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభగాంచిన వారికి నగదు పురస్కారాన్ని కూడా అందజేయనున్నారు. పరిశోధన, కొత్త ఐడీయాల పోటీలతో ప్రత్యేకంగా జోష్‌ఫుల్‌గా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మిస్‌ ఇండియా పోటీలు కూడా ఇందులో భాగంగా నిర్వహిస్తున్నారు. పోటీల్లో భాగంగా క్యాడ్‌ప్రో పేరిట నిర్వహించే పోటీలో గెలిచిన వారికి రూ.8వేల నగదును అందజేయనుండగా, కొత్త ఐడియాలను ప్రోత్సహించే విధంగా నిర్వహించే హ్యాకథాన్‌ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.50వేల నగదు పురస్కారాన్ని అందించనున్నారు. అలాగే చివరి రోజున ‘క్యాంపస్‌ ప్రిన్సెస్‌' పేరిట నిర్వహించే రోడ్‌ టు మిస్‌ ఇండియా పోటీల్లో ఫెమినా మిస్‌ ఇండియా 2018 రన్నరప్‌ అయిన శ్రేయారావు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆమె నేతృత్వంలో రోడ్‌ టు మిస్‌ ఇండియాను ఎన్నుకోనున్నారు. వీటితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, పాటల పోటీలు, లైవ్‌ ఈవెంట్‌లకు కూడా ఐఐటీ హైదరాబాద్‌ వేదిక కానుంది.  


logo