బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Feb 12, 2020 , 00:34:59

డీసీసీబీపై గులాబీ గురి

డీసీసీబీపై గులాబీ గురి

సంగారెడ్డి టౌన్‌: ఎన్నికలు ఏవైనా విజయం మాత్రం టీఆర్‌ఎస్‌దే. సహకార పోరులో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతున్నది. ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లాలో 53 సహకార సంఘాలు ఉంటే 8 సహకార సంఘాలను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది. బొక్కాస్‌గావ్‌, కల్హేర్‌, మార్డి, కడ్పల్‌, భానూర్‌, గుమ్మడిదల, ఏడాకులపల్లి, గంగారం సొసైటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. పలు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు డైరెక్టర్లుగా గెలిచినప్పటికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. జిల్లా వ్యాప్తంగా 262 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ విజయం సాధించి అధికారాన్ని చే జిక్కించుకున్నది. ఇక సహకారంలోనూ ఎన్నికలు ఈనెల 15వ తేదీన ఉండగానే మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుని చరిత్ర సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా 53 సొసైటీలు ఉంటే అందులో 8 సొసైటీలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. 262 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోగా, 15వ తేదీన మిగతా 418 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరుగనున్న వార్డుల్లో 1147 మంది బరిలో ఉన్నారు. 


ఈ ఎన్నికల్లో అత్యధిక వార్డుల్లో విజయం సాధించి డీసీసీపీ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. జహీరాబాద్‌ సబ్‌డివిజన్‌లో 14 సొసైటీల్లో 180 వార్డులుండగా, 48 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ 132 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా అత్యధికంగా 318 మంది బరిలో ఉండడం గమనార్హం. సంగారెడ్డి డివిజన్‌లో 99 వార్డుల్లో 264 మంది, నారాయణఖేడ్‌లో 73 వార్డుల్లో 234 మంది పోటీలో ఉన్నారు. అందోలు-జోగిపేటలో 71 వార్డుల్లో 180 మంది, పటాన్‌చెరు డివిజన్‌లో 43 వార్డులకు గానూ 151 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, మొత్తం 680 వార్డుల్లో 262 వార్డులు ఏకగ్రీవం కాగా, అందులో మెజార్టీ వార్డులు అధికార టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం పరిస్థితుల ప్రకారం సహకార ఎన్నికల్లో గులాబీ మద్దతు దారులు పైచేయి సాధించనున్నట్లు స్పష్టం అవుతున్నది. 


నేడు మంత్రి హరీశ్‌రావు దిశా నిర్దేశం  

సహకార ఎన్నికల్లో డీసీసీబీ పీఠం కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. నేడు మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలో ఇప్పటికే 262 వార్డులను కైవసం చేసుకోగా, మిగిలిన 418 వార్డుల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు మంత్రి ప్రణాళికలు రూపొందించారు. అందుకుగానూ టీఆర్‌ఎస్‌ నాయకులకు సూచనలు, సలహాలు అందించి విజయం సాధించేందుకు కృషి చేయనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న 418 వార్డులను కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం ముమ్మురం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. ఆ దిశగా టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం వేగవంతం చేశారు. ఇప్పటికే మొదటి దఫా ప్రచారం పూర్తి చేసి స్వయంగా అభ్యర్థుల వద్దకు వెళ్లి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సహకారంలో గెలుపు వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందనే ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపుగా అన్ని సొసైటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేలా మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. 


logo