శనివారం 19 సెప్టెంబర్ 2020
Sangareddy - Feb 10, 2020 , 23:37:03

మున్సిపాలిటీల్లో ముమ్మర తనిఖీలు

మున్సిపాలిటీల్లో ముమ్మర తనిఖీలు
  • నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశంలో మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌ : మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్‌ అధ్యక్షతన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ జరుగాలని తప్పనిసరిగా ఇంటి నుంచే తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. కొన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ను ఒక చోట వేసి తగులబెట్టడం జరుగుతుందన్నారు. ఈ చర్యల వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అందువల్ల ఇలాంటి చర్యలకు సిబ్బంది పాల్పడకుండా తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రతి ఇంటిలో తడిపొడి చెత్తను వేరు చేసేలా మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తనిఖీలు చేయాలని కాలుష్యానికి సంబంధించిన విషయాలను గుర్తించిన చోట్ల సంబంధిత మున్సిపాలిటీలకు జరిమానాలు విధించాలన్నారు.


గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదన్నారు. పారిశ్రామిక వాడల్లో సైతం సెగ్రిగేషన్‌ షెడ్‌ల నిర్మాణాలతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్లపై పారబోయకుండా కంపెనీల వద్ద  ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన గ్రామాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు చెత్త నిర్వహణ ఎలా ఉంటుందో పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగరాజు, డీపీవో హనోక్‌, పీసీబీ ఏఈ భాగ్యలక్ష్మి, ఏఈఎస్‌ జీముతవాహన, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అశోక్‌కుమార్‌ తోపాటు జిల్లాలలోని వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. 


logo