మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sangareddy - Feb 10, 2020 , 23:36:53

నియోజకవర్గంలో 30 డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవం

నియోజకవర్గంలో 30 డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవం

దుబ్బాక,నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో సోమవారం  నామినేషన్ల ఉపసంహరణలో పలువురు అభ్యర్థులు పోటీలో నుంచి విరమించుకున్నారు. విత్‌డ్రాల అనంతరం సహకార సంఘాల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాలు ప్రకటించారు. నియోజకవర్గంలో  దుబ్బాక, మిరుదొడ్డి, కాన్గల్‌, దౌల్తాబాద్‌లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. 152 డైరెక్టర్ల పదవులకు గాను 30 డైరెక్టర్ల పదవులకు ఒక్కరు చొప్పున  పో టీలో ఉండడంతో ఆ పదవులు  ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 22 డైరెక్టర్ల పదవులకు గాను 55 మంది బరిలో ఉన్నారు.  దుబ్బాక సహకార సంఘంలో 6 డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవంగా కాగా..7 డైరెక్టర్ల పదవులకు 17 మంది బరిలో ఉన్నారు. మిరుదొడ్డి సహకార సంఘంలో 3 డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవం కాగా 10 వార్డుల్లో  26 మంది బరిలో నిలిచారు. తొగుట మండలం కాన్గల్‌లో 10 మంది డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవం కాగా 3 డైరెక్టర్ల పదవులకు 6మంది బరిలో ఉన్నారు. దౌల్తాబాద్‌ సహకార సంఘంలో 11 డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవం కాగా మిగిలిన 2 డైరెక్టర్ల పదవులకు 6 మంది బరిలో నిలిచారు.  నియోజకవర్గంలో అత్యధికంగా దౌల్తాబాద్‌లో 11, కాన్గల్‌లో 10 డైరెక్టర్ల పదవులు ఏకగ్రీం కావడం విశేషం. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు (సింబల్స్‌) కేటాయించారు. ఇక నేటి (మంగళవారం) నుంచి అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తమకు కేటాయించిన గుర్తులు, ఫొటోలతో ప్రచారంపై దృష్టి పెట్టారు.


కాన్గల్‌ సొసైటీలో గులాబీ జోరు..

తొగుట మండలం కాన్గల్‌ సొసైటీలో తొలిసారిగా 10 వార్డులు ఏకగ్రీవం కాగా, వాటిలో 9 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు ఉండడంతో సొసైటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురనుంది. గతంలోనే 5 వార్డులు ఏకగ్రీవం కాగా, ఈరోజు పోటీలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో మరో 5 మంది ఏకగ్రీవమయ్యారు. 1వ వార్డులో కుర్మ యాదగిరి, 2వ వార్డులో లింగాల నర్సవ్వ, 4వ వార్డులో లంబాడి కృష్ణ, 5వ వార్డులో ఎర్రన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, 6వ వార్డులో అల్వాల కృష్ణాగౌడ్‌, 7వ వార్డులో జీడిపల్లి అంజయ్య, 8వ వార్డులో పాత్కుల చిన్న ఎల్లయ్య, 10వ వార్డులో కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి, 11వ వార్డులో చిన్నరాంగారి జయమ్మ, 12వ వార్డులో వడిదం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన మూడు వార్డుల్లో ఇద్దరేసి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 3వ వార్డులో చెప్యాల నారాయణరెడ్డి, పన్యాల ఎల్లారెడ్డి, 9వ వార్డులో ఎన్నం కొండల్‌రెడ్డి, ఎన్నం మహిపాల్‌రెడ్డి, 13వ వార్డులో చింతమడ్క శ్రీధర్‌, సోమగారి వెంకట్‌రెడ్డి బరిలో ఉన్నారు. 


logo