ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Feb 10, 2020 , 23:07:48

లెక్క తేలింది..

లెక్క తేలింది..

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. సోమవారం సాయంత్రం ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో మొత్తం 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 689 వార్డులు (ప్రాదేశిక నియోజకవర్గం) ఉన్నాయి. కాగా, ఎస్టీలు లేనికారణంగా 9 వార్డుల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో 680 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. ఇందులో మొత్తం 262 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 418 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరుగనున్న వార్డుల్లో 1147 మంది బరిలో ఉన్నారు. 

బొక్కాస్‌గావ్‌, కల్హేర్‌, మార్డి, కడ్పల్‌, బానూరు, గంగారం, గుమ్మడిదల, ఏడాకులపల్లి సొసైటీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక్కడ 13 వార్డులకు 13 వార్డులు ఒక నామినేషన్‌ మాత్రమే రావడంతో అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. మొత్తం 1492 నామినేషన్లు ఉండగా, సోమవారం 345 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. దీంతో 1147 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలాఉండగా 15న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

జహీరాబాద్‌ బరిలో 318 మంది...

జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్‌ సబ్‌డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలోనే 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. కాగా, జహీరాబాద్‌ సబ్‌డివిజన్‌లో 14 సొసైటీల్లో 180 వార్డులుండగా, 48 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక్కడ 132 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, అత్యధికంగా 318 మంది బరిలో ఉండడం గమనార్హం. సంగారెడ్డి డివిజన్‌లో 99 వార్డుల్లో 264 మంది, నారాయణఖేడ్‌లో 73 వార్డుల్లో 234 మంది పోటీలో ఉన్నారు. అందోలు-జోగిపేటలో 71 వార్డుల్లో 180 మంది, పటాన్‌చెరు డివిజన్‌లో 43 వార్డులకు గాను 151 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, మొత్తం 680 వార్డుల్లో 262 వార్డులు ఏకగ్రీవం కాగా, అందులో మెజార్టీ వార్డులు అధికార టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం పరిస్థితుల ప్రకారం సహకార ఎన్నికల్లో గులాబీ మద్దతు దారులు పైచేయి సాధించనున్నట్లు స్పష్టం అవుతున్నది. 

ఎనిమిది సొసైటీలు ఏకగ్రీవం...

జిల్లాలో ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో బొక్కాస్‌గావ్‌, కల్హేర్‌, మార్డి, కడ్పల్‌, గంగారం, బానూరు, గుమ్మడిదల, ఏడాకులపల్లి సొసైటీలున్నాయి. కల్హేర్‌ మండలంలోని బొక్కాస్‌గావ్‌, మార్డి, కల్హేర్‌ సొసైటీలు, సిర్గాపూర్‌ మండలంలో కడ్పల్‌, నారాయణఖేడ్‌ మండలం గంగారం, కంది మండలంలోని బానూరు, గుమ్మడిదల మండలంలోని గుమ్మడిదల, ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి సొసైటీలు ఏకగ్రీవమైన వాటిలో ఉన్నాయి. ఒక్క నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోనే ఐదు సొసైటీలు పూర్తిగా ఏకగ్రీవం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆయా సొసైటీల్లో 13 వార్డులకు పూర్తిగా అన్ని వార్డులకు ఒక్క నామినేషన్‌ మాత్రమే వచ్చింది. దీంతో అన్నీ ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. 


logo