గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Feb 10, 2020 , 22:59:34

కంచెలతో అడవులకు రక్షణ కవచం

కంచెలతో అడవులకు రక్షణ కవచం

గుమ్మడిదల: సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో హరిత తెలంగాణను రూపకల్పన చేయడానికి యేటా హరితహారం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి వేల రూపాయలను వెచ్చిస్తున్నారు. మంచి ఫలితాలను సాధించడానికి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అడవులను రక్షించడానికి  అటవీశాఖ కంచెల నిర్మాణం చేపట్టింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని దట్టమైన అడవులను రూపుదిద్దుకోవడానికి కృషి చేస్తున్నారు. వాతావరణ సమతుల్య తీసుకరావడానికి కృషి చేస్తున్నారు. దీని ఫలితంగా అడవులు హరితవనాలుగా, ఆక్సిజన్‌ పార్కులుగా మారనున్నాయి.

గుమ్మడిదల, వావిలాల సెక్షన్‌ పరిధిలోనే అటవీ విస్తీర్ణం అధికం

జిల్లాలోని గుమ్మడిదల, వావిలాల సెక్షన్‌లో 5,500 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. గుమ్మడిదల సెక్షన్‌ పరిధిలో జిన్నారం, బొంతపల్లి, కానుకుంట, నల్లవల్లి, మంభాపూర్‌ పరిధిలో 3,300 హెక్టార్లలో అటవీ విస్తీ ర్ణం విస్తరించి ఉన్నాయి. వావిలాల పరిధిలో 2,200 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఇందులో వావిలాలతో పాటు ఖాజిపల్లి, మంగంపేట, రొయ్యపల్లి, వడ్డెపల్లి అటవీ బీట్‌లు ఈ పరిధిలోని వస్తాయి.  

కంచెల నిర్మాణాలతో అడవులకు రక్షణ

అటవీ సంపదను అక్రమ రవాణా నుంచి రక్షించడానికి గుమ్మడిదల, వావిలాల సెక్షన్‌ పరిధిలో అడవుల చుట్టు కం చెల నిర్మాణం చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో 5,500 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులను రక్షించడానికి కందకాలు, కంచెల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వడియారం అటవీ ప్రాంతంలో 8 కిలో మీటర్ల విస్తీర్ణంలో456 హెక్టార్లు, మనోహరబాద్‌లో 4 కి.మీ విస్తీర్ణంలో 129 హెక్టార్లు, పరికిబండ 15 కి,మీ విస్తీర్ణంలో 880 హెక్టార్లు. జిన్నారం, గుమ్మడిదల 32 కిలో మీటర్ల విస్తీర్ణంలో 1757 హెక్టార్ల  కంచె నిర్మాణం చేపట్టారు. జహీరాబాద్‌లో 4కిలో మీటర్లు 80 హెక్టార్లలో రూ. 24.18 కోట్లతో మొదటి విడుత పనులు పూర్తిచేశారు. అడవి చుట్టూ మూడు అడుగుల ఎత్తున ప్రహరీ, దానిపై కంచెల ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో కంచెల నిర్మాణం పూర్తిదశకు చేరుకున్నాయి. అటవీ సంపద, వన్యప్రాణులు, అడవులను రక్షించడానికి కంచెల నిర్మాణం కొనసాగుతున్నది. ఈ నిర్మాణాల వల్ల అటవీ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్టపడుతున్నది. దీని వల్ల దట్టమైన అడవులు రూపుదిద్దుకుంటాయి. అడవుల్లో ఉన్న వన్యప్రాణులు వేటగాళ్ల వేటుకు గురికాకుండా ఉంటాయి. అడవుల్లో ఉన్న ఇసుక, కలప, మట్టి అక్రమంగా తరలించే అవకాశం ఉండదు. గతంలో అడవుల నుంచి ఆహా రం కోసం రోడ్లపైకి వచ్చే అడవి పందులు వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగిన సంఘటనలు అధికంగా ఉన్నాయి.  కంచెల నిర్మాణం వల్ల అడవుల నుంచి జనారణ్యంలోకి  వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల అలాంటి రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పడుతున్నది. ప్రతి యేడాది చేపట్టే హరితహారంలో భాగంగా అడవుల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో వేలాది ఔషధ మొక్కలను నాటి దట్టమైన అడవులుగా మార్చడానికి వీలు ఉంటుంది. అడవుల్లోకి మేకలు, పశువులు వెళ్లే అవకాశం లేదు. దీంతో  దట్టమైన అడవులు రూపుదిద్దుకుంటాయి.

పదేండ్లలో అడవులన్నీ అర్బన్‌ పార్కులు

నిత్యం పని ఒత్తిడితో ఉండే జనాలకు ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడికి వెళ్లి సేదతీరుతారు. అయినప్పటికీ సహజంగా లభించే పచ్చని వాతావరణం లోటుగానే కనిపిస్తున్నది. అందుకే అడవులను అర్బన్‌ పార్కులుగా తీర్చిదిద్దితే ఆ లోటు తీరనున్నది. జిల్లాలో అడవులను రక్షించడానికి కంచెల నిర్మాణాలు, కందకాల వల్ల అడవులన్నీ దట్టగా పచ్చని ప్రకృతి దర్శనమియనున్నాయి. వచ్చే పదేండ్లలో అడవులు హరితవనాలుగా మారనున్నాయి. దీంతో అడవులు అర్బన్‌ పార్కులుగా తీర్చిదిద్దడానికి అటవీశాఖ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. విహార యాత్రీకులకు, వన్యప్రాణి ప్రేమికులకు అడవుల పరిసర ప్రాంతాల్లో  కనీస ఏర్పాట్లు చేస్తే అర్బన్‌ పార్కులుగా కనువింధు చేయనున్నాయి.

ఆక్సిజన్‌ పార్కులుగా రూపుదిద్దుకోనున్న అడవులు

 అడవులు హరితవనాలుగా రూపుదిద్దుకుంటే ఇక్కడి అటవీ ప్రాంతాల్లో స్వచ్ఛమై ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లభ్యమవుతున్నది. దీని వల్ల  అడవులు ఆక్సిజన్‌ పార్కులుగా మారనున్నాయి. పచ్చని వాతావరణంలో శుభ్రమైన ఆక్సిజన్‌ లభ్యం కావడం వల్ల జంట నగరాల నుంచి ఒక రోజు కాలక్షేపం చేయడానికి జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఇక్కడి ప్రాంతాలను చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. తెల్లవారు జామున అడవి అందాలను వీక్షించేందకు వెసులుబాటు కల్పించనున్నారు. వాకింగ్‌ ట్రాక్‌,  పార్కులకు వచ్చే వారి నుంచి చిన్న మొత్తంలో టికెట్ల రూపంలో కొంత ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. చిరు వ్యాపారులకు ఉపాధి కలుగుతున్నది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు దోహదపడుతాయి. 

అడవుల రక్షణతో ఎన్నో ప్రయోజనాలు

అడవుల రక్షణతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దట్టమైన అడవులుగా రూపుదిద్దుకుంటే అడవుల్లో ఉండే వన్యప్రాణుల సంఖ్య పెరుగుతున్నది. అడవులు పచ్చని వాతావరణంలో కళకళాడుతాయి. అటవీ సంపదకు రక్షణ ఏర్పడుతున్నది. ఇసుక, మట్టి, కలప అక్రమ వ్యాపారుల నుంచి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి వీలుంటుంది. ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతను రక్షించవచ్చు. ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువుల లభించడం వల్ల చుట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఆరోగ్యంగా ఉండే  వీలుంటుంది. వర్షాలు అధికంగా కురిసే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి నిర్ణయంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు.


logo