శుక్రవారం 29 మే 2020
Sangareddy - Feb 09, 2020 , 23:15:42

కలెక్టర్‌ అవుతా..

కలెక్టర్‌ అవుతా..
  • వికలాంగుడినై ఉన్నా చదువు ఆపను
  • చదువే నా ప్రాణం-ఎంతకష్టమైనా భరిస్తా..
  • విద్యుత్‌ ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయిన విద్యార్థి మధుకుమార్‌

మునిపల్లి: చదివేది సర్కార్‌ బడి అని నేను ఎప్పుడూ అనుకోలేదు..చదువుకుంటే కార్పొరేట్‌ పాఠశాలలే నా దగ్గరకు వస్తాయనే భావించా.. నేను పాఠశాలలో చేరిన రోజే కలెక్టర్‌ కావాలన్న గొప్ప లక్ష్యం పెట్టుకున్నా. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మా అమ్మానాన్నలను బాగా చూసుకోవాలన్న కల నిజం చేసేందుకు మృత్యువుతో పోరాడి గెలిచానని దివ్యాంగుడినయ్యానని మధుకుమార్‌ అన్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి కాళ్లు, చేతులు కోల్పోయిన మధుకుమార్‌పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.


చదువు అంటే నా ప్రాణం..

చదువుకోసం ఏదైనా.. ఎంతదూరమైనా వెళ్తా ఎంత కష్టమైనా భరిస్తాననే మధుకుమార్‌ మా టలు వింటుంటే కన్నీళ్లు కార్చని వారు ఉండరు. మధుకుమార్‌ తాను చదువుకునే 5వ తరగతి పరీక్షల్లో మొ దటి స్థానం సాధించేవాడు. మధుకుమార్‌ పోగ్రెస్‌ చూస్తే అర్థమవుతున్నది. చదువంటే అంత ఇష్టం మరి. తను పాఠశాలకు గైర్హాజరుకాని రోజంటూ ఉండదు. చదువు విషయంలో తల్లిదండ్రుల మాటలను సైతం లెక్కచెయ్యకుండా నిత్యం పాఠశాలలో  ఎక్కువ సమయం గడిపేవాడు. చదువే నా ప్రాణం అనుకున్న ఆ విద్యార్థికి కరెంట్‌ ప్రమాదం కష్టాలు తెచ్చిపెట్టింది. 


నిరుపేద కుటుంబం...

కంకోల్‌లో కడు నిరుపేద కుటుంబం అంటే మధుకుమార్‌ వాళ్లదే. గ్రామానికి చెందిన ప్రమీళ-తుల్జరాం దంపతులకు నలుగురు సంతానం. మధుకుమార్‌ చిన్నవాడు. తుల్జారాం గ్రామంలోనే 20 ఏండ్లుగా ఉదయం లేవగానే ఇంటింటికీ దినపత్రికలు వేసుకుంటూ, పంక్చర్‌ దుకాణం నడుపుతుంటాడు. తాను ఎన్ని కష్టాలు పడినా కొడుకులను మంచి చదువులు చదివించాలని ఆశ. తుల్జరాం పెద్ద కుమారుడు మోహన్‌ రంజోల్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌, రెండో కూతురు చంద్రకళ సదాశివపేటలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం సీఈసీ, మూడో కూతురు రాజేశ్వరి కంకోల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. చివరి కుమారుడు మధుకుమార్‌ కూడా అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. 2019 సెప్టెంబర్‌ 15న స్నేహితులతో కలిసి మిద్దెపై ఆడుకుంటుండగా అతడి చేతి లోని ఇనుప రాడ్డు ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు తగిలిన ప్రమాదం చోటు చేసుకోవడంతో వైద్యులు కాళ్లు, చేతులు తొలిగించారు.  


ఇండ్లపై కరెంట్‌ తీగలు  తొలిగించండి.. 

బాలుడి కాళ్లు, చేతులు కోల్పోవడానికి విద్యుత్‌ తీగలు ఇండ్లపై నుంచి వెళ్లడమే కారణమని కం కోల్‌ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కంకోల్‌ గ్రామ శివారులోని వోక్సన్‌ ఇంటర్‌ నేషనల్‌ బిజినెస్‌ స్కూల్‌కు 11కేవీ విద్యుత్‌ వైర్లను రోడ్డు పక్క నుంచి వేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్‌ స్తంభాలను ఇండ్లకు దగ్గరగా వేశారు. దీంతో వైర్లు కాస్త ఇండ్లపై నుంచే వెళ్తున్నాయి. మధుకుమార్‌కు జరిగినట్లు ఇంకెవరికీ జరుగకుండా చూడాలని, వైర్లు తొలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


చదువులో ముందుంటాడు..

కంకోల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుకుంటున్న మధుకుమార్‌ అన్ని సబ్జెక్ట్‌ల్లో మంచి మార్కులు సాధించాడు. తాను తరగతిలో ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధంగా విని పరీక్షల్లో మంచి మార్కులు సాధించేవాడు. మంచి విద్యార్థికి ఇలా జరిగినందుకు చాలా బాధగావుంది. పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అన్నిట్లో పాల్గొనే విద్యార్థి మధుకుమార్‌.

- ఖరీమ్‌, కంకోల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు


నోటితోనే అన్ని..

విద్యుత్‌ తీగలు తగులడంతో మధుకుమార్‌ ఇక బతకలేడు అనుకున్న వారు అందరూ ఇప్పుడు అతడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. మధుకుమార్‌ నోటితోనే నోటుపుస్తకాల్లో అనేక రకాల మ్యాప్‌లు వేస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్మార్ట్‌ ఫోన్‌ను సైతం నోటితోనే ఆపరేటింగ్‌ చేస్త్తున్నాడు. నాలుక సాయంతోనే తోటి విద్యార్థులకు తండ్రి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా బంధువులు, స్నేహితులకు కాల్స్‌ చేసి మాట్లాడుతున్నాడు.


logo