సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Feb 09, 2020 , 23:09:11

బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 1491

బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 1491
  • పూర్తయిన నామినేషన్ల పరిశీలన
  • తిరస్కరణకు గురైనవి 174
  • నేడు ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల బరిలో 1491 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన చేసిన అధికారులు 174 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 53 సహకార సంఘాలకు గాను 3 రోజుల్లో నమోదైన 1665 నామినేషన్ల పరిశీలన అనంతరం 1491 అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి జాబితా ప్రకటించారు. నేడు రంగంలో ఉన్న అభ్యర్థుల బుజ్జగింపుల అనంతరం ఉపసంహరణలు జరిగితే ఎంతమంది ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల జాబితా స్పష్టమవుతున్నది. అనంతరం ఎన్నికల పోటీ చేసేందుకు అర్హ త ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను ప్రకటిస్తారు. జిల్లాలోని 5 సబ్‌ డివిజన్‌లలో 144 వార్డులకు ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు కావడంతో ఏకగ్రీవం కానున్నాయి. 


144 వార్డుల ఏకగ్రీవం...

జిల్లాలోని 5 సబ్‌ డివిజన్‌లలో కలిపి 53 సంఘాల్లో 689 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆధారంగా జిల్లాలో ఎస్టీలు లేని కారణంగా 9 వార్డులకు ఎన్నికల జరుగడం లేదు. మిగతా 680 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇందులో 144 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన వార్డులకు ఈ నెల 15వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. వార్డుకు ఒకే ఒక నామినేషన్‌ దాఖలైన వాటిలో 144 వార్డులు ఏకగ్రీవం అయినట్లు సమాచారం. నేడు ఉపసంహరణ అనంతరం అధికారులు అధికారికంగా ఏకగ్రీవం అయిన వార్డుల జాబితా, ఎన్నికల పోటీలో నిలిచే అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు.


logo